8 January 2018

బాబూ అది నోరా.. తాటిమట్టా


  • ఇంకా ఎంతకాలం అబద్ధాలతో మభ్యపెడతారు
  • ఇరిగేషన్‌పై రూ. 50 వేల కోట్ల ఖర్చు పచ్చి అబద్ధం
  • ఖర్చు చేసింది మొత్తం రూ. 27,898 మాత్రమే
  • చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది
  • ప్రపంచస్థాయి రాజధాని ఎక్కడ నిర్మించారో చెప్పాలి
  • వాస్తవం మాట్లాడినందుకు అంబటిని హౌస్‌ అరెస్ట్‌ చేస్తారా?
  • గ్రామాలకు వెళ్లి మీరే అడగండి ఎవరి పెన్షన్‌ వస్తున్నాయో చెబుతారు
  • పాలనపై నమ్మకం లేక క్షుద్రపూజలకు దిగన చంద్రబాబు
  • ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్‌: చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశానని చెప్పడానికి అది నాలుకా.. తాటిమట్టా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై నాలుగేళ్లలో వాస్తవంగా ఖర్చు చేసింది జీఓ 22ను ప్రకారం రూ. 27,898 మాత్రమేనని, దాంట్లో రూ. 16,186 కోట్లు మాత్రమే ప్రాజెక్టుపైన ఖర్చు చేశారన్నారు. మిగిలినవి అంచెనాలు పెంచుకొని కాజేశారని ఆరోపించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై చంద్రబాబు అని అబద్ధాలు మాట్లాడుతున్నారని, కర్నూలు సభలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశానని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు నాలుగు సంవత్సరాల్లో రూ. 16 వేల కోట్లు ఖర్చు చేశారంటే చంద్రబాబు వ్యవసాయం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టే అర్థం అవుతుందన్నారు.
 
చంద్రబాబుకు ముని శాపం ఉందని, ఆయన నిజం చెబితే తల వెయ్యిముక్కలు అవుతుందని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పడూ అనేవారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాల్లో రూ. 1.20 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో లక్ష పక్కనబెట్టినా.. రూ. 20 వేలు కూడా ప్రాజెక్టులకు ఖర్చు చేయలేకపోయారన్నారు. కొత్త సంవత్సరం కదా మనిషి మారి వాస్తవాలకు కొంత దగ్గరకు వస్తాడనుకున్నా.. కానీ ఆయన తీరు మార్చుకోలేదన్నారు. రైతు రుణమాఫీ రూ. 24 వేల కోట్లు చేశానని చెబుతున్నారు కానీ వాస్తవంగా రూ. 12 వేలు కూడా చేయలేదన్నారు. అదే విధంగా డ్వాక్రా రుణమాఫీ చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాడని వాస్తవానికి రూ. 6 వేల కోట్లు కూడా చేయలేదన్నారు. ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతూ ఇంకా ఎంతకాలం పరిపాలన సాగిస్తారని బొత్స ప్రశ్నించారు. 

ప్రపంచస్థాయి రాజధాని కడతానని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పటి వరకు అమరావతి శాశ్వత రాజధానికి ఒక ఇటుక కూడా వేయలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభలో రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని ప్రశ్నించారన్నారు. దానికి కేంద్రం రాజ్‌భవన్, అసెంబ్లీకి కలిపి 2014–15లో రూ. 500 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. 500 కోట్లు 2015–16లో 350 కోట్లు, అర్బన్‌ డౌలప్‌మెంట్‌కు 2014–15లో రూ.250 కోట్లు, 2015–16లో రూ. 450 కోట్లు, మొత్తం రూ. 1500 కోట్లు ఇచ్చామని చెప్పారన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.1583 కోట్లు ఖర్చు చేశామని నివేదిక ఇచ్చిందన్నారు. 

హైదరాబాద్‌ స్థాయి కాకుండా ప్రపంచస్థాయి రాజధాని అన్నారు. ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధానిలా అమరావతి రూపుదిద్దుతానన్నారు. రూ. 1583 కోట్లు అదనంగా ఖర్చు చేశామని చెప్పారు కానీ అసలు రాజధాని ఎక్కడ నిర్మించారో తెలియడం లేదన్నారు. నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే.. అయినప్పుడు ఇన్నీ వందల కోట్లు ఎందుకు ఖర్చు చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎందుకిలా ప్రజలను మభ్యపెడుతున్నారు చంద్రబాబూ అని బొత్స నిలదీశారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలు, అవినీతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు రంగు మొత్తం బయటపడిందని, ఇక ఆయన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబును అక్రమంగా హౌస్‌ అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో నిజమైన లబ్ధిదారులకు పెన్షన్‌ అందడం లేదని అంబటి రాంబాబు వాస్తవం చెబితే.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అందరికీ అందుతున్నాయని, బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారన్నారు. దీంతో ప్రజలకు పెన్షన్‌లు అందుతున్నాయో లేదో.. తెలుసుకునేందుకు వెళ్తున్న అంబటిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోలీసు బందోబస్తుతో గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేయాలన్నారు. అది వాస్తవం కాదు కాబట్టే అంబటిని అరెస్టు చేశారన్నారు. ఎందుకు ఇలా అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తారని టీడీపీ సర్కార్‌ను ప్రశ్నించారు. 

పిల్లి మీద ఎలుక, ఎలుక మీద పిల్లి చెప్పుకున్నట్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంమీద కేంద్రం, కేంద్రం మీద రాష్ట్రం చెప్పుకుంటున్నాయని బొత్స ఆరోపించారు. ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారని, ఏ ప్రతిపక్షంగా పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుందో నిరూపించాలని డిమాండ్‌ చేశారు. తోటపల్లి ప్రాజెక్టును వైయస్‌ఆర్‌ హయాంలో రూ. 600ల కోట్లు ఖర్చు చేసి 85 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులకు రూ. 200ల కోట్లు ఖర్చు చేయడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అట్టహాసంగా రాయలసీమకు నీరు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కానీ జీవో 22ను తీసుకొచ్చి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు తన పరిపాలనపై నమ్మకం లేక క్షుద్రపూజలు, కోటల్లో తవ్వకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఎలాంటిదంటే ఆయన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్‌కు నేటికీ సున్నం కూడా వేయించలేని దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు కట్టిపెట్టి, వాస్తవాలకు దగ్గరగా వచ్చి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 
 

No comments:

Post a Comment