30 October 2017

వి‘శోఖ’ నగరం


– మూడేళ్లలో అన్నీ అలజడులే 
– మహిళల మనోభావాలు పణంగా పెట్టి చంద్రబాబు వికృత చేష్టలు 
– బీచ్‌ ఫెస్టివల్స్, అందాల పోటీలతో న‌గ‌రానికి చెడ్డ పేరు
– పెరిగిన అవినీతి, భూదందాలు

ప్రశాంత వాతావరణానికి.. అందమైన ప్రకృతి రమణీయతకు పేరున్న విశాఖ నగర పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. అందమైన బీచ్‌.. చల్లని గాలులతో పలుకరించే నగర ప్రాముఖ్యతను దెబ్బతినే ప్రమాదం ముంచుకొస్తుంది. అభివృద్ధి పేరుతో నగరాన్ని కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుంటోంది. ఆధునిక సాంప్రదాయం ముసుగులో మహిళల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విష సంస్కృతికి విశాఖను కేంద్రంగా తయారు చేస్తున్నారు. మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే వారిని రోడ్డుపై అసభ్యకరంగా లాగేసి పోలీసు జీపుల్లోకి ఎక్కిస్తున్నారు. 

విశాఖ పేరు చెడగొడుతూ...
చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ మూడేళ్లుగా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూనే ఉన్నారు. పిచ్చి తుగ్లక్‌ ఆలోచనలతో ఖజానా నింపుకోవాలని దుర్భుద్ది పుట్టింది. విశాఖలో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని హంగామా చేసేశాడు. గోవా తరహాలో బీచ్‌లో టెంట్లు వేసి జంటలను ఆహ్వానిస్తామని.. లిక్కర్‌ పార్లర్లు ద్వారా మద్యం పంపిణీ చేస్తామని.. విదేశీయులను పిలిచి పండగ చేస్తామని గప్పాలు పోయాడు.  ఆయన ప్రకటించిన బీచ్ ఫెస్టివల్‌ విధానాలపై  వైయస్‌ఆర్‌సీపీ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తాజాగా అందాల పోటీల పేరుతో విశాఖ కీర్తిని తగ్గించేలా మరో విష వేదిక నిర్వహించడంపై మహిళా లోకం మళ్లీ భగ్గుమంది. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగిన మహిళల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బట్టలు చిరిగి పోతున్నా వారిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి  వాహనాల్లో పడేసిన తీరు ప్రభుత్వ తీరుకు నిదర్శనం. మహిళలపై దాడులేకాదు.. భూ కబ్జాలతోనూ విశాఖ పేరును నాశనం చేసేశారు. హుద్‌ హుద్‌ తుపాన్‌ పేరు చెప్పి వేల ఎకరాల భూములకు సంబంధించి రికార్డులు మాయం చేసిన టీడీపీ నాయకులు తమ ఆస్తుల్లో కలిపేసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం యువత నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని జరగకుండా అడ్డుకున్నారు. 

విశాఖే ఎందుకంటే..
బీచ్‌ ఫెస్టివల్స్, అందాల పోటీలు, ర్యాంపు వాక్‌లకు విశాఖ నగరాన్ని కేంద్రంగా చేయడానికి కారణం లేకపోలేదు. రాష్ట్రం విడిపోయాక ఏపీలో విశాఖే పెద్ద నగరం. అందమైన బీచ్‌తో మంచి వాతావరణం విశాఖ సొంతం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, వాడరేవు ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు. వారి ప్రభావం ఇక్కడి వారిపై ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ పట్నం ఒకటి. ఈ నేపథ్యంలో విశాఖను కూడా గోవా మాదిరిగా విదేశీ సంస్కృతికి కేంద్రంగా మార్చి ఖజానా నింపుకోవాలన్నది చంద్రబాబు కల. డబ్బు యావలో ఇక్కడున్న మహిళల మనోభావాలను, తెలుగు సంస్కృతిని  మాత్రం పట్టించుకోలేదు. భాగస్వామ్య సదస్సు పేరుతో హడావుడి చేసినా ఒక్క పైసా పెట్టుబడి తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలో మహిళల మనోభావాలను పణంగా పెట్టి విష సంస్కృతిని విశాఖ ప్రజలపై రుద్దాలని చూసి విఫలమయ్యారు. 

No comments:

Post a Comment