31 October 2017

బాబూ.. ముడుపుల వ్యవహారం ఇక ఆపు


  • పోలవరం పేరుతో బాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు
  • కమీషన్ల  కోసమే పోలవరం జాప్యం
  • 16వేల కోట్ల నుంచి 50వేల కోట్లకు అంచనాలు పెంచారు
  • మళ్లీ ఇప్పుడు 2,3వేల కోట్లు పెరుగుతుందని లీకులిస్తున్నారు
  •  ప్రభుత్వ అవినీతిపై కేంద్రం విచారణ జరిపించాలి 
  • పోలవరం నిర్మాణవ్యయం ఎంత, ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలి
  • బాబు ముడుపుల వ్యవహారం మానేయాలి
  • పోలవరం ప్రజలకు అందుబాటులోకి రావడమే వైయస్సార్సీపీ ధ్యేయం
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
హైదరాబాద్ః పోలవరం పేరుతో ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేసి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటే....ఏమి ఆశించి మేమే చేస్తామని బాబు లాక్కున్నారో స్పష్టం చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. పోలవరాన్ని ఎవరు పూర్తి చేసినా తమకు అభ్యంతరం లేదని,   రాష్ట్రానికి ప్రాణవాయివులాంటి పోలవరం ప్రజలకు అందుబాటులోకి రావడమే వైయస్సార్సీపీ ధ్యేయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద పైసా భారం పడకుండా కేంద్రమే ప్రాజెక్ట్ పూర్తి చేసే పరిస్థితి ఉంటే....చంద్రబాబు  కమీషన్ల కోసం, పోలవరాన్ని ఆదాయానికి మార్గంగా ఎంచుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వేల కోట్ల ప్రాజెక్ట్ ను 50వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు మరో 2, 3వేల కోట్లు పెరుగుతుందని లీకులిస్తున్నారని ధ్వజమెత్తారు. 
చంద్రబాబు తన మాయలతో  ప్రజలపై ఆర్థికభారం మోపుతున్నారని పార్థసారధి ఫైర్ అయ్యారు.  ప్రాజెక్ట్ ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, నిర్మాణ వ్యయం ఎంత నిర్ణయించారో స్పష్టం చేయాలన్నారు.  ముడుపులు దండుకొని  ప్రాజెక్ట్ ను వదిలేయడానికి కూడ టీడీపీ వెనుకాడదని అనుమానం వ్యక్తం చేశారు. 

పోలవరాన్ని 2017, 18, 19లోగా పూర్తి చేస్తామంటూ బాబు రకరకాలుగా చెబుతున్నారే తప్ప చేస్తున్నదేమీ లేదన్నారు. 2017లోనే పోలవరం  పూర్తి చేయాలనుకుంటే ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే బాబు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేవారని, కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదని పార్థసారధి  విమర్శించారు. ముడుపుల కోసం కావాలనే బాబు పోలవరాన్ని డిలే చేస్తున్నారని పార్థసారధి ఆగ్రహించారు. అందుకే పట్టిసీమ, పురుషోత్తంపట్నంలు తెచ్చి దాంట్లో పిండుకున్నాక 2019కి పోలవరం మీద దృష్టిపెట్టినట్టుగా నటిస్తున్నారన్నారు. వ్యవస్థను చేతుల్లోకి తీసుకొని నడపడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు.  కేంద్రానికి చెందిన నాలుగు శాఖల్ని మేనేజ్ చేసి మరీ బాబు పోలవరం నిర్మాణం చేస్తున్నారని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి స్పష్టంగా చెప్పిన విషయాన్ని పార్థసారధి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఎన్నిపార్టీలు అభియోగాలు చేసినా బాబు దున్నపోతు మీద వానపడిన చందాన వ్యవహరిస్తున్నారన్నారు. బాధ్యత గల అధికారి స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు సమాధానం చెప్పడం లేదని చంద్రబాబును నిలదీశారు.

టీడీపీ తంతంగమంతా కేంద్రానికి అర్థమైపోయిందని పార్థసారధి అన్నారు. పోలవరం నిర్మాణవ్యయం పెరిగితే జాతికే నష్టమని, పారదర్శకంగా కరప్షన్ లేకుండా నిర్మాణం చేయాలని కేంద్రమంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారంటేనే బాబు పట్ల వారి అభిప్రాయం ఏంటో తెలుస్తోందన్నారు. కాంట్రాక్టర్ ను మార్చడానికి ముఖ్యమంత్రి స్పైషల్ ఫ్టైట్ లో వెళ్లి మంత్రితో మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని శాఖల అధికారులను పిలుపించుకొని 2, 3వేల కోట్ల భారం ప్రజలపై మోపేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. సబ్ కాంట్రాక్టర్ లకు కూడ అడ్వాన్స్ లు చెల్లించడం దారుణమన్నారు. పోలవరంలో బాబు చేస్తున్న అక్రమాలపై కేంద్రం విచారణ జరిపించి, ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు. ముడుపులు చెల్లించే కాంట్రాక్టర్ ను తీసుకురావడం కోసం బాబు ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలు, వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ముడుపుల వ్యవహారం ఆపేయాలని హెచ్చరించారు. 

No comments:

Post a Comment