30 October 2017

కుట్రపూరితంగానే రాజాపై దాడి


  • కావాలనే వైయస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు
  • నాయకులు, కార్యకర్తలను హింసిస్తున్నారు
  • ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నాడనే రాజాపై దౌర్జన్యం
  • టీడీపీ నేతలు అధికారులను కొట్టినా నో కేసు
  • టీడీపీ రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి..తీరు మార్చుకోవాలి
  • జక్కంపూడి రాజాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
  • కుట్ర వెనుక కోణాన్ని చేధించాలి..ఎస్సైపై చర్యలు తీసుకోవాలి
విజయవాడః జక్కంపూడి రాజాపై జరిగిన దాడిని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. కొందరు పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని, కావాలనే  వైయస్సార్సీపీ నాయకులను వేధిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, సుధాకర్ బాబు, సోమినాయుడులు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి మరీ వేధిస్తోందని అన్నారు. రాజాపై దాడి వెనుక ఉన్న కుట్రను చేధించాలని, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగానే వైయస్సార్సీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని...  ప్రభుత్వం, పోలీసుల తీరు మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను, బాబు సర్కార్ కాపులకు చేస్తున్న అన్యాయాన్ని రాజా నిలదీస్తున్నాడనే ఆయనపై కక్షపూరితంగా దాడి చేశారన్నారు. 

నాలుగు నెలల పసిబిడ్డతో కారులో కూర్చున్న రాజాపై కావాలనే ఎస్సై నాగరాజు దౌర్జన్యం చేశాడన్నారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నాడనే  ఆరోజు ముద్రగడ, ఈరోజు రాజాను ప్రభుత్వం హింసిస్తోందన్నారు.  కారు పార్కు సమస్య ఉంటే చలనాలు రాయాలి గానీ ఇలా  ఈడ్చుకుంటూ, లాఠీలతో కొట్టుకుంటూ  స్టేషన్ కు తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారు. అక్కడ అసలు ఎస్సైకి ఏం పని అని నిలదీశారు. రాజాను హింసించాలన్న ఉద్దేశ్యంతోనే ఇదంతా చేశారని అర్థమవుతోందన్నారు.  విజయవాడలో ఐపీఎస్ అధికారిపై టీడీపీ ఎంపీ కేశినేని దౌర్జన్యం చేసినా...టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఎమ్మెర్వోను జుట్టుపట్టుకొని లాక్కెనా, వైయస్సార్సీపీ ఇంచార్జ్ నారాయణరెడ్డి హత్యగావించబడినా టీడీపీ నేతలపై ఎలాంటి కేసులు, చర్యలు లేవు. ప్రభుత్వం ఈవిధంగా ప్రోత్సహించడం వల్లే ఘోరాలు జరుగుతున్నాయని వైయస్సార్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. రాజాపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

పోలీసులు పచ్చచొక్కాల కార్యకర్తలుగా మారారని, అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి పోలీసు యంత్రాంగాన్ని నెట్టిన ఘన చరిత్ర బాబు, మంత్రులు,  ఆయన తాబేదారులకే దక్కిందన్నారు.  ఎవరు నోరెత్తినా, అన్యాయాన్ని ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తూ దాడులు చేస్తున్నారని, రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని టీడీపీకి హిత బోధ చేశారు.  రాజాపై దాడితో వైయస్సార్సీపీ యువజన నాయకులను భయబ్రాంతులను చేయాలని చూస్తున్నారని,  మీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని టీడీపీని హెచ్చరించారు. తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు.  బాబు పాలనలో  పంచాయతీ దగ్గర్నుంచి కార్పొరేషన్ దాకా టీడీపీకి అనుకూలంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలివ్వడం, వారు చెప్పిన వారిని అరెస్ట్ చేయడం. పోస్టింగ్ లు కూడ వారి ఇష్టానుసారం జరుగుతున్నాయన్నారు. 

No comments:

Post a Comment