26 October 2017

పోలవరంపై కేంద్రం డేగ కన్ను


  • పోలవరం పనుల్లో జాప్యం సహించం
  • అంచనా వ్యయం పెంచం
  • పునరావాస ప్యాకేజీతో కేంద్రానికి సంబంధం లేదు
  • గడువులోగా పోలవరం పూర్తి చేయాల్సిందే
ఏదోలా పోలవరాన్ని జాప్యం చేయాలనుకుంటున్న చంద్రబాబు క్రూరమైన ఆలోచనలకు కేంద్రం చెక్ పెడుతూ వస్తోంది. ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థను మార్చడం, పునరావాస ప్యాకేజీ, పెరిగిన అంచనా వ్యయం వంటి విషయాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో సమావేశమయ్యారు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ. ఏడాదికోసారి ఇలా అంచనా వ్యయం పెంచుకుంటూ పోతారా అని గడ్కారి ప్రశ్నించినట్టు సమాచారం. మెయిన్ కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ సంస్థ సబ్ కాంట్రాక్టర్ అయిన త్రివేణి, బికెమ్ సంస్థలకు ఇప్పటి వరకూ చేసిన పనులకు సంబంధించి కోట్లాది రూపాయిలు బకాయిలు పడింది. దాంతో అటు హెడ్ వర్క్స్ పనులు, గేట్లపనులూ కూడా ఆలస్యం అవుతున్నాయి. ఇకపై ప్రధాన కాంట్రక్టర్ నుంచి కాక ఎస్క్రో ఎకౌంట్ ద్వారా సబ్ కాంట్రాక్టర్లకు నేరుగా రాష్ట్రప్రభుత్వమే బిల్లులు చెల్లించమని గడ్కారీ సూచించారు. అంటే ఇకపై సబ్ కాంట్రాక్టర్లు బిల్లులు అందక పనులు ఆపేసారని, అందుకే పోలవరం జాప్యం అనే సాకులు చెప్పడానికి చంద్రబాబుకు ఆస్కారం లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పై వ్యవహరిస్తున్న తీరును కేంద్రం ఓ కంట కనిపెడుతూనే ఉంది. రోజుకో కారణం చెబుతూ, కాలయాపన చేయడం కుదరదని కేంద్రం తెగేసి చెబుతోంది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించిన తర్వాత కేంద్రం రెండు కమిటీలను కూడా వేసింది. డిజైన్ల రూపకల్పనకు ఎబి పాండ్యా కమిటీ, పనులు వేగంగా పూర్తి చేయడానికి మసూద్ కమిటీ సాయం చేస్తాయని కేంద్రమంత్రి అంటున్నారు. అంటే రాష్ట్రం పోలవరంలో చేసే ప్రతి పని మీదా ఈ రెండు కేంద్ర స్థాయి కమిటీల డేగకన్ను ఉంటుందన్నమాట. నిబంధనలకు లోబడి, చట్టబద్ధంగా ఉన్నప్పుడు కేంద్రం కూడా సహకరిస్తుందని, అలా లేనప్పుడే ఇలాంటి చికాకులు తలెత్తుతాయని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇక పోలవరం భూసేకరణ, సహాయ పునరావాసం వ్యయం 2934 కోట్లనుంచి  33,858 కోట్లకు పెరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు చెప్పగా గడ్కారీ ఆశ్చర్యపోయారు. మూడేళ్లలో మూడువేల నుంచి 33వేల కోట్లకు పెరగడం ఏమిటని అసహనం వ్యక్తం చేసారు. అయినా పోలవరం నిర్మాణానికయ్యే వ్యయంలో భూసేకరణ, పునరావాశ కలపొద్దని ఆయన సూచించారు. దీనిపై తాను ఏ హామీ ఇవ్వలేనని, ఏదైనా ఉంటే చంద్రబాబే నేరుగా అరున్ జైట్లీతో మాట్లాడుకోవాలని చెప్పారు. పోలవరం కోసం నేలను పోగొట్టుకున్న వారికి పునరావశం కథ ఇక కంచికి వెళ్లినట్టే అని జలవనరుల శాఖాధికారులు కొందరంటున్నారు. కేంద్రం మొండి చెయ్యి చూపిందనే సాకుతో చంద్రబాబు వారికి ఉత్తచేతులే చూపిస్తారని వారంటున్నారు. 

No comments:

Post a Comment