30 October 2017

రాజోలి రిజర్వాయర్‌ లేకనే కేసీ రైతాంగానికి దుస్థితి


– ఫిబ్రవరి నెలాఖరు వరకూ సాగునీరు ఇవ్వాలి
– నష్టపోయే రైతాంగానికి ఆదుకునేలా నివేదికలు పంపండీ
– పేరుకు స్వచ్ఛాంద్ర ఎక్కడ చూసినా రోగ పీడితులే
– చాపాడు ఎస్‌ఐ శివశంకర్‌పై చర్యలు తీసుకోవాలని మండల తీర్మానం
– మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

చాపాడు: రాజోలి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టకపోవటంతో జిల్లాలోని కేసీ రైతాంగానికి సాగునీటి దుస్థితి ఏర్పడుతోందని మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యలయ సభాభవనంలో సోమవారం మండల అధ్యక్షురాలు టి. వెంకటలక్షుమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ...  కేసీ రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదనే నిర్ణయంతో 2009లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 2.9 టీఎంసీ కేపాసిటితో రాజోలి రిజర్వాయర్‌ నిర్మించేందుకు శంఖు స్థాపన చేశారన్నారు. ఆయన మరణాంతరం ఏర్పడిన ప్రభుత్వాలు దీని నిర్మాణం చేపట్టకపోవటంతో కేసీ రైతాంగానికి ఏటా సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా వర్షాలు వచ్చినా సాగునీటి విడుదలపై ప్రభుత్వం, అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన అదును దాటి తర్వాత వరి సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలాఖరు వరకూ సాగునీరు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకూ సాగునీటిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఆలస్యంగా వరి సాగు చేసుకునే రైతులు తెగుళ్ల కారణంగా పంటలు దెబ్బతింటే ఈ నివేదికలు ప్రభుత్వానికి పంపాలని, ప్రస్తుత సీజన్‌లో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం 6 వేల మంది రైతుల దరఖాస్తులు అలాగే ఉండిపోయాయని, రైతుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది లేదన్నారు. ప్రభుత్వం పేరుకే స్వచ్ఛాంద్ర అంటూ గొప్పు చెప్పుకుంటోందని, ప్రతి గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పల్లెల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు రోగాల పట్ల అవగాహన కల్పిస్తుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, తహాసీల్దారు పుల్లారెడ్డి, ఎంపీడీఓ రామదాసు తదితరులు పాల్గొన్నారు.

చాపాడు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని మండల తీర్మాణం:
చాపాడు మండల ఎస్‌ఐ శివశంకర్‌ విధుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తీర్మాణం చేశారు. మండల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, తప్పుడు కేసులను నమోదు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ఇదే క్రమంలో ఏకపక్షంగా వ్యహరిస్తూ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాడనని, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చియ్యపాడు ఎంపీటీసీ మహేష్‌యాదవ్‌ సభలో ప్రతిపాదించగా, మండల అధ్యక్షురాలు బలపరుస్తూ తీర్మాణం చేశారు.

No comments:

Post a Comment