8 September 2016

ఎల్లుండి రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపు

హైదరాబాద్ః  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఎల్లుండి(శనివారం) రాష్ట్ర బంద్ కు ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.  బంద్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైయస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన చేపట్టారు.



ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏవిధంగా అన్యాయం చేశారో అదేవిధంగా ఇప్పుడు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తెలిపారన్నారు. జైట్లీ, చంద్రబాబు కలిసి ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు వస్తాయని, ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని వైయస్ జగన్ వివరించారు. ప్రత్యేక హోదా వస్తేనే వేలకొద్ది పరిశ్రమలు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ యువత ఆశలపై జైట్లీ నీళ్లు చల్లారని అన్నారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించడాన్నివైయస్ జగన్ తప్పుబట్టారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ తో ఆట లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా శనివారం ఏపీ బంద్ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ కు సంబంధించి వామపక్ష నాయకులతో మాట్లాడామని వెల్లడించారు. చంద్రబాబు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు  

No comments:

Post a Comment