22 September 2016

హోదాపై విద్యార్థులు, యువతకు వైయస్ జగన్ దిశానిర్దేశం

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ఎండగట్టిన జననేత
  • ఓటుకు కోట్లు కేసులో పట్టుబడినా తప్పిించుకు తిరగడం బాబుకే చెల్లింది
  • కేసులకు భయపడి ఐదుకోట్ల ఆంధ్రుల హక్కును ఢిల్లీకి తాకట్టుపెట్టాడు

ఏలూరు))ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ నాయుళ్లిద్దరూ (చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు) పొంతనలేని మాటలతో ప్రజలను ఏవిధంగా మోసం చేస్తున్నదీ వైయస్ జగన్ వీడియోల ద్వారా తెలియజెప్పారు. ప్రొజెక్టర్ల సాయంతో ఆయా సందర్భాల్లో వారు మాట్లాడిన మాటలను యువభేరి వేదికగా విద్యార్థుకు చూపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని వెంకయ్య నాయుడు మేక మెడలో ఉండే వాటితో పోల్చడం దారుణమన్నారు. ఆనాడు ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో, బహిరంగ సభల్లో ప్రస్తావించి నేడు ప్యాకేజీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హోదా కోసం పోరాడదామని తాను పిలుపునిచ్చినా ...కేసులకు భయపడి చంద్రబాబు బీజేపీ వారి కాళ్లను విడిచి రావడం లేదని ఆరోపించారు. విలువలు, విశ్వసనీయత గురించి వీరు ఎన్ని జన్మలెత్తినా తెలుసుకోలేరని నిట్టూర్చారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల ద్వారా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా తప్పించుకు తిరగడం బాబుకే చెల్లిందన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఇదేమంత పెద్ద విషయం కాదన్నారు. సెప్టెంబర్‌ 7 అర్థరాత్రి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ నిర్ణయానికి అంగీకరించిన బాబు 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలని ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. 


ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఏలూరు యువభేరి వేదికగా విద్యార్థులు, యువతకు దిశానిర్దేశం చేశారు. హోదా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. నీతి అయోగ్, 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి రాష్ట్రానికి ప్రత్యేక ఇవ్వకుండా తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, హోదా కంటే ప్యాకేజీనే బాగుందని ప్రజలను మభ్యపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా చురకలంటేలా సాగిన జగన్‌ ప్రసంగంతో ప్రజల్లో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిత్వశాఖ స్వయంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనను చూపిస్తూ ప్రసంగించారు. ప్రత్యేక హోదా పేరుతో కలిగే లాభాలతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయంతో జరుగుతున్న దోపిడీని వివరించారు. గతంలో పలు సందర్భాల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటూ ప్రశ్నించిన చంద్రబాబు ప్రశ్నకు ఆయా రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా వివరిస్తూ బాబుకు ధీటైన జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఐదు పాయింట్లతో సవివరంగా అవగాహన కల్పించారు. 

సెప్టెంబర్‌ 7 అరుణ్‌జైట్లీ ప్రసంగం ఆధారంగా వివరణ.. 
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు సెప్టెంబర్‌ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రసంగం, దానిపై ఆయన మీడియా విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌ను చూపిస్తూ రాష్ట్రానికి మనకు హక్కుగా రావాల్సిన నిధులే తప్ప కొత్తగా ఏమీ ఇవ్వలేదంటూ తేల్చేశారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే మనకు కూడా కేంద్రం నుంచి రావాల్సిన వాటాల పరంగా వచ్చినవే తప్ప ప్యాకేజీ పేరుతో కొత్తగా వచ్చిందేమీ లేదని వివరించారు. 

హోదా నిర్ణయం ఆర్థిక సంఘానికెక్కడిది..
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్ద అని నిర్ణయించే అధికారం ఆర్థిక సంఘానికి లేదని తెలిపారు. రాష్ట్రాల నుంచి ట్యాక్సుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయాన్ని ఏయే రాష్ట్రాలకు ఎంతెంత పంచాలి అనే సలహాలు ఆర్థిక శాఖకు, ప్రధానికి ఇస్తుందన్నారు. గతంలో 32.5 శాతం ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచేవారని అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా 6.94శాతం ఉండేదని, నేడది నవ్యాంధ్రప్రదేశ్‌కు 4.31 శాతం ఉందని వివరించారు. 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత రాష్ట్రాల వాటాను 42శాతానికి పెంచినట్లు వివరించారు. ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను కూడా కేటాయించారన్నారు. గతంలో ఏపీ ఆర్థిక లోటును పూడ్చేందుకు 22,500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఇది కూడా ఆంధ్రాకు ప్రత్యేకంగా వచ్చిందేమీ కాదని కేరళ, పశ్చిమ బంగా రాష్ట్రాలకూ కేటాయించారన్నారు. 

అభిజిత్‌ సేన్‌ ఏమన్నారంటే..
14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం హోదా ఇవ్వడానికి కుదరదని అంటున్న బీజేపీ వాదన సరిగా లేదని పేర్కొంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ రాజ్యసభ్య సభ్యుడు జైరాం రమేశ్‌  చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక సంఘంలో సభ్యుడిగా ఉన్న అభిజిత్‌ సేన్‌ తన మెయిల్‌కు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ప్రత్యేక హోదా ఇవ్వమంటూ ఆర్థిక సంఘం ఏనాడూ చెప్పలేదని, అది తమ పరిధిలో అంశం కాదని అభిజిత్‌ సేన్‌ పంపిన మెయిల్‌ను పార్లమెంట్‌లో జైరాం రమేశ్‌ చదివి వినిపించారని జగన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

9 నెలలు ఏం చేశారు
ప్రణాళిక సంఘం రద్దవడం.. నీతి అయోగ్‌ రాకతో ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని చెప్పుకోవడం సమంజసం కాదని జగన్‌ ఆరోపించారు. 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని ప్రణాళిక సంఘం 2 మార్చి, 2014న ప్రకటించారని అయితే నీతి అయోగ్‌ డిసెంబర్‌ 2014 అమల్లోకి వచ్చిందని.. ఈ మధ్యలో జరిగిన 9 నెలల కాలంలో హోదా ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్‌డీసీ (నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌), ప్రణాళికా సంఘాలదేనని తెలిపారు. అయితే వాటికి చైర్మన్‌గా ఉన్న ప్రధానికి హోదా ఇవ్వడం చిటికెలో పని అన్నారు. ఆనాడు వాజ్‌పేయి ప్రధానికి ఉన్న సమయంలో ఒక్క సంతకంతో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కేటాయించిన  విషయాన్ని వైయస్ జగన్ గుర్తుచేశారు. 


కుంటిసాకులు తగనా..?
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు అడుగుతాయని రెండేళ్ల తర్వాత అంటున్నారు.... ఏపీని విడగొట్టేనాడు ఆయా రాష్ట్రాలు అడ్డుగున్నా ఎలా విభజించారని నిలదీశారు. హోదాను ఎగ్గొట్టేందుకు కుంటిసాకులు వెతకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 14వ ఆర్థికసంఘం ఉండగానే ఇంతకుముందు హోదా ఇచ్చిన రాష్ట్రాలకు కొనసాగిస్తున్నారు కదా అని వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్‌లో అడిగితే... సంబంధిత మంత్రి  హోదా కొనసాగుతుందని లిఖిత పూర్వకంగా  సమాధానం ఇచ్చారని వైయస్ జగన్ చదివి వినిపించారు.  ప్రత్యేక హోదాకు సంబంధించిన పూర్తి సమాచారం వైయస్సార్‌సీపీ వెబ్‌సైట్‌లో కరపత్రం పొందుపర్చినట్లు వైయస్ జగన్ విద్యార్థులు, యువతకు ఈ సందర్భంగా వివరించారు. 

చంద్రబాబూ... హోదా వలన ప్రయోజనాలివిగో
ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఏమొస్తుందని పదేపదే చెప్పుకొస్తున్న చంద్రబాబు కళ్లు తెరిపించేలా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని వినిపించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోదా సంక్రమించడం వలన తాము సాధించిన అభివృద్ధిని వివరిస్తూ కేంద్రానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను చదివి వినిపించారు. 
ఉత్తరాఖండ్‌లో హోదా అనంతరం 30244 పరిశ్రమలు వచ్చాయని ఇది గతంతో పోల్చితే 130 శాతం అధికమని తెలిపారు. ఆయా పరిశ్రమల ద్వారా 2లక్షలా 45వేల ఉద్యోగాలు వచ్చినట్లు తెలిపారు. ఉపాధి 490 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. వీటన్నింటి ద్వారా రాష్ట్రానికి 35వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వివరించారు. 
హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా 10వేల 864 పరిశ్రమల ద్వారా లక్షా 30వేల ఉద్యోగాలు సిద్ధించాయని పేర్కొన్నారు. 

పారిశ్రామిక రాయితీలు...
వంద శాతం పన్ను రాయితీలు
100 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ (హోదా ఉంటే జీఎస్టీ రాయితీ కూడా)
అప్పులు తీసుకుంటే 3 శాతం వడ్డీని కేంద్రమే భరిస్తుంది. 
రైల్వే లైన్‌ నుంచి ఫ్యాక్టరీల వరకు సరకుల రవాణాకు అయ్యే ఖర్చులు కేంద్రమే రీయింబర్స్‌ చేస్తుంది. 
50 శాతం విద్యుత్ వినియోగంలో రాయితీ

కేంద్రం ప్యాకేజీ పప్పు బెల్లానికే సరిపోదు
ప్రత్యేక హోదా పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులు పప్పు బెల్లానికే సరిపోవని జగన్‌ ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి హక్కుగా రావాల్సింది తప్ప మనకి కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ప్రత్యేకంగా రాలేదని పేర్కొన్నారు. మనకు రావాల్సిన నిధులు కూడా ప్రత్యేక ప్యాకేజీలో చూపుతున్నా అన్నింటికీ సమ్మతమేనని తలూపుతున్న చంద్రబాబు మనకు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment