21 September 2016

వెన్నుపోటు రాజకీయాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య

  • కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలనుకోవడం బాబు తరం కాదు
  • బాబు రాక్షస ప్రవృత్తి కలిగిన అరాచక శక్తి..సీఎంగా ఉండడం ప్రజల దౌర్భాగ్యం
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి

గుంటూరుః వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తునిలో జరిగిన విధ్వంస ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేకున్నా...చంద్రబాబు ఆనెపాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై రుద్దాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కుటిల ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు కూనిరాగం తీసినంత సులువని భూమన విమర్శించారు. కేసులు, అరెస్ట్ లతో తమను భయపెట్టాలనుకోవడం చంద్రబాబు తరం కాదని భూమన అన్నారు. 

పలకరించడం నేరం. మాట్లాడడం పాపం. క్షేమం విచారించడం కుట్ర అనుకునే నైజం బాబుదని భూమన దుయ్యబట్టారు.  బాబు మోసాలను ప్రజలెవ్వరూ చూడకూడదు. ప్రతిపక్షం ఆ వాణి వినిపించకూడదు. దానిపై ఏ పత్రికలు కూడా మాట్లాడకూడదు. రాయకూడదన్న ధోరణిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. పదే పదే విచారణ పేరుతో పిలిచి ఎన్ని విధాల బయపెట్టాలని చూసినా భయపడే స్వభావం తనది కాదని భూమన పేర్కొన్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పోరాటానికి వైయస్సార్సీపీ, తమ నాయకుడు వైయస్ జగన్ మద్దతు తెలపడాన్ని భరించలేకనే బాబు తమను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడని భూమన ఫైర్ అయ్యారు. 

తనను అరెస్ట్ చేస్తే, బయటకు వచ్చాక కాపు ఉద్యమంలో ఓకార్యకర్తలా రిజర్వేషన్ కోసం ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతానని భూమన స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి ఆచరణలో ఆ హామీలను నెరవేర్చకుండా... ప్రతీసారి ప్రజాసమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఆనెపాన్ని వైయస్సార్సీపీపై వేయాలని చూస్తున్నారని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తారు. దేశ రాజకీయాల్లోనే బాబు లాంటి అరాచక శక్తి మరొకటి లేదని, పనికిమాలిన రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తి చంద్రబాబు అని భూమన నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు. 

No comments:

Post a Comment