8 September 2016

బాబు సీఎంగా ఉండడం ప్రజలు చేసుకున్న కర్మ

  • తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారు
  • రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
  • మీడియాతో వైయస్ జగన్ చిట్ చాట్
హైదరాబాద్ః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని మండిపడ్డారు. జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్న వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. కేంద్రమంత్రివర్గం నుంచి బాబు తన  మంత్రులను తక్షణమే ఉపసంహరించుకొని ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిన అనంతరం మీడియాతో వైయస్ జగన్ చిట్ చాట్ చేశారు.  

గతంలో జైట్లీ ప్రకటన చూసి రక్తం మరిగిపోయిందని మాట్లాడిన చంద్రబాబుకు...మరి ఇప్పుడు రక్తం మురిగిపోయిందా అని వైయస్ జగన్ నిలదీశారు. బాబు తన మంత్రులను జైట్లీ పక్కన కూర్చోబెట్టి మరీ ప్రకటన ఇప్పించారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని ఆగ్రహించారు. ఓ పద్ధతి ప్రకారం బాబును హోదాను నీరుగార్చారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజలు చేసుకున్న కర్మ అని వైయస్ జగన్ అన్నారు. బాబు ఇలానే వ్యవహరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. 

No comments:

Post a Comment