13 August 2016

మర్యాదతప్పిన బాబు ప్రభుత్వం

  • పుష్కరాల ఆహ్వానం పేరుతో రాజకీయాలు
  • టీడీపీ తీరుపై వైయస్సార్సీపీ నేతల ఆగ్రహం
  • ఇంతకంటే కుసంస్కారం మరొకటి ఉండదని వ్యాఖ్య
హైదరాబాద్ః టీడీపీ తీరు అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిని పుష్కరాలకు ఆహ్వానించే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ఆహ్వానానికి వచ్చేటపుడు మీడియాను కూడా వెంటబెట్టుకుని వచ్చారని అన్నారు. ఆహ్వానించడానికి వచ్చినవారిని తాము గౌరవంగానే చూసుకున్నామని, సాదరంగా స్వాగతం పలికామని, అయినా వాళ్లు మాత్రం వెళ్తూ వెళ్తూ ఈ అంశాన్ని రాజకీయం చేశారని, ఇంతకంటే కుసంస్కారం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. 

పుష్కరాలు ప్రారంభమైన 24 గంటల తర్వాత ఆహ్వానం ఇస్తారా, అయినా అసలు ఆహ్వానం అందించేటపుడు సంబంధిత వ్యక్తి ఉన్నారా లేదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి కదా అని ఆయన అన్నారు. వైయస్ జగన్ అందుబాటులో లేరని తెలిసి మరీ రాజకీయానికి పాల్పడ్డారని, టీవీల ద్వారా లీకులిచ్చి, నిఘాసిబ్బందిని పెట్టుకుని రాజకీయాలు చేశారని మండిపడ్డారు.

వైయస్ జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారని, అయినా ఆయనను కలుస్తామంటూ మంత్రి రావెల ఓఎస్డీ కాల్ చేశారని పార్థసారథి తెలిపారు. ఈ విషయాన్ని టీవీలకు లీకులు ఇచ్చారని అన్నారు. వచ్చినవాళ్లను రిసీవ్ చేసుకోవాల్సిందిగా వైయస్ జగన్ తనకు చెప్పారని, తూర్పుగోదావరి పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూడా మంత్రి కిశోర్ బాబు, విప్ కూన రవికుమార్ వచ్చారా లేదా అని వైయస్ జగన్ తనను అడిగారని, వాళ్లు రాలేదని చెప్పడంతో రేపు కలుద్దాంలే అని తనతో అన్నారని వివరించారు. 

వైయస్ జగన్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి రావెల, రవికుమార్ వచ్చారని, వారిని తాను రిసీవ్ చేసుకుని రేపు ఉదయం 10 గంటలకు కలుద్దామని చెప్పినట్లు తెలిపారు. టీడీపీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే తీరు ఇదేనా, ఇలా చేయడం ప్రజాస్వామ్యంలో అవమానించడం కాదా అని పార్థసారథి ప్రశ్నించారు. అధికార టీడీపీ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రతీసారి ప్రతిపక్షంపై బురదజల్లుతోందని పార్థసారథి ఫైర్ అయ్యారు. అందుకోసం పుష్కరాలను సైతం వాడుకొని రాజకీయాలకు పాల్పడడం దారుణమన్నారు. 

No comments:

Post a Comment