22 August 2016

క్షతగాత్రులను పరామర్శించిన వైయస్ జగన్

హైదరాబాద్)తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలపై వైయస్సార్సీపీ అధ్యక్షులు  వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . గోదావరి జిల్లాలతో పాటు  ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రమాద ఘటనలపై కలత చెందారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే వైయస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం చేరుకున్నారు. బస్సు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  


కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్‌ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న యాత్రజినీ ప్రైవేటు బస్సు నాయకన్‌ గూడెం వద్ద నాగార్జున సాగర్‌ (ఎన్ఎస్పీ) కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 10 మంది మృతి చెందగా, 26 మందికి గాయాలయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్నలారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. 

No comments:

Post a Comment