9 August 2016

హోదా సాధించే దాకా పోరాడుతాం

  • ప్రత్యేక హోదా కోసం నిరవధిక పోరాటం
  • జీఎస్టీ బిల్లుతో హోదా మరింత అవసరం
  • ప్రత్యేక హోదాపై బాబువి రెండు నాల్కల ధోరణి
  • చంద్రబాబుది దొంగల పార్టీ
  • హోదా ఇచ్చే పార్టీకే జాతీయ స్థాయిలో మద్దతు


న్యూఢిల్లీ)) ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కలిశారు. ఈ మేరకు పార్టీ ఎంపీలతో కలిసి ఆయన ఒక వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఎంత అవసరమో, అది ఇప్పించకపోతే జరిగే అనర్థం ఏమిటో విడమరిచి చెప్పారు. అనంతరం రాష్ట్రపతి భవన్ దగ్గర పార్టీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ వెంట రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్ తదితరులు ఉన్నారు. 
వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
() పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా మీద హామీ ఇచ్చారు. 98శాతం ఐటీ పరిశ్రమలు, 70శాతం ఉత్పాదక పరిశ్రమలు ఉన్న హైదరాబాద్ ను కోల్పోతున్నందున నష్ట పోతారు కాబట్టి పరిహారంగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి అప్పటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టాయి. ఇప్పుడు ఆ మాటను వదిలేస్తున్నారు.
() పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు భవనంలో ఇచ్చిన హామీనే నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరిని అడగాలి. ప్రజలకు ప్రజాస్వామ్యంలో ఎవరి మీద విశ్వాసం ఉంటుంది.
() పార్లమెంటులో ఇచ్చిన మాటనే తప్పితే ఎవరిని అడగాలి. ఎవరిని నమ్మాలి. ఒక దేశ పౌరునిగా సిగ్గుతో తలదించుకోవాలి.
() ఇప్పుడు జీఎస్టీ బిల్లు అమలు లోకి తెచ్చారు. దీంతో కేంద్ర పన్నుల వ్యవస్థకు లాభం చేకూరుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నుల గందరగోళానికి తెర పడుతుంది అనటం కూడా అంతే నిజం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి.
() జీఎస్టీ బిల్లుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వ్యవస్థలో రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు రావాలంటే, పరిశ్రమలు, పెట్టుబడుల్ని తీసుకొని రావాలంటే కొన్ని ప్రోత్సాహకాల్ని అందించే వెసులుబాటు ఉంది. తెచ్చిన పెట్టుబడి వినియోగం అయ్యేదాకా అమ్మకపు పన్నులో మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చే వీలు ఉంది. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక అన్ని పన్నులు కేంద్రం జాబితాలోకి చేరిపోయాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, పెట్టుబడులు మరింతగా క్షీణించిపోతాయి. అందుచేత ఈ సమయంలో ప్రత్యేక హోదా చాలా చాలా ఉందని అర్థం చేసుకోవాలి. ప్రత్యేక హోదా ను తెచ్చుకొంటే కనుక ఈ అమ్మకపు పన్నులో మినహాయింపు దొరుకుతుంది కాబట్టి పరిశ్రమలు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఏమాత్రం అవకాశం ఉండదు.
() మన కళ్ల ముందు ఇంత దారుణంగా అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు నుంచి ఉలుకు పలుకు లేదు. మన భవిష్యత్ అంధకారం, మన పిల్లలకు ఉద్యోగాలు దొరకని దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి ప్రత్యేక హోదా సాధించే దిశగా ఒత్తిడి పెంచేందుకు మంత్రుల్ని ఉపసంహరిస్తామని చెప్పే ధైర్యం కానీ, అటువంటి చిత్తశుద్ధి కానీ కనిపించని పరిస్థితి.
() ఒక పక్క చంద్రబాబేమో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి సన్మానాలు చేయిస్తారు. ఆ సన్మాన సభల్లో బీజేపీ ప్రభుత్వం తమకు చాలా మేలు చేసిందని చెబుతారు. మరో చోటకు పోయినప్పుడు మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు ఏ మేలు చేయలేదని చెబుతారు. ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా మాటలు చెప్పటమా.
() ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అనేది క సంజీవని అన్నట్లుగా చెప్పారు. 10 ఏళ్లు చాలదు, 15 ఏళ్లు కావాలి అని చెప్పారు. ఎన్నికలు అయిపోయాక మాత్రం హోదా అంటే అదేమైనా సంజీవనా అని అడుగుతున్నారు. ఒక మనిషి ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే దీని మీద ఏమాత్రం సీరియస్ నెస్ ఉన్నట్లు. అందుకే కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు.
() చంద్రబాబే చిత్త శుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటే కేంద్రం ఎకా ఎకిన పార్లమెంటులోనే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ మా మంత్రుల్ని కేంద్రం నుంచి ఉపసంహరించుకొనే పరిస్థితి లేదని చెప్పుకొస్తున్నారు. ఇవాళ కూడా జీఎస్టీ బిల్లు మీద జరిగిన చర్చలో మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు మరో రకంగా ప్రసంగించారు. ఈ విధంగా మోసాలు చేస్తుంటే ఇదేమి పద్దతి అని అనిపించక మానదు. అసలు పరిపాలనలో నైతిక విలువలు పాటిస్తున్నారా అని అడుగుతున్నాం.
() చంద్రబాబు మాత్రం ఢిల్లీకి 22 సార్లు వచ్చాను, 23వసారి పర్యటిస్తున్నా అని చెబుతారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం రాలేదు అని చంద్రబాబు చెబుతున్నారు.  కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో స్పీచ్ వింటే రక్తం మరిగిపోయింది అని కబుర్లు చెబుతారు. కానీ ఇక్కడకు వచ్చాక మాత్రం అటువంటి ఛాయ కనిపించదు. ఢిల్లీలో అరుణ్ జైట్లీకి శాలువా కప్పి ప్రత్యేక హోదా అడగటానికి రాలేదు, పుష్కరాలకు పిలవడానికి వచ్చాను అని చెబుతారు. అంతే కానీ, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అల్టిమేటమ్ ఇవ్వటానికి కాదని చెబుతారు.
() పోనీ పుష్కరాల కు ఇంత మందిని పిలుస్తున్నారు కదా అని దేవుడు మీద అయినా గౌరవం ఉందంటే అది కడా కనిపించదు. ఇదే పెద్ద మనిషి విజయవాడలో 40 దాకా గుడుల్ని కూల్చేశారు. దేవుడంటే అంతటి విలువ మరి, అమరావతి ప్రాంతంలోని సదావర్తి సత్రం కు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయిల విలువ చేసే భూముల్ని రూ. 22 కోట్లకే తన బినామీలకు అప్పగించేస్తారు. ఎవరైనా దేవుడి ఆస్తుల్ని ముట్టుకోవాలంటే భయపడతారు. కానీ, నిస్సిగ్గుగా దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూముల్ని తీసేసుకొనేందుకు వెనుకాడరు. కానీ బయట వాళ్లకు మాత్రం సవాలాక్ష బంధనాలు విధిస్తారు.
() చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంగ్లీషు లో నరేంద్రమోదీని ఒక్క మాట అనరు. ఎందుకంటే ఒక్క మాట అన్నా కానీ, సీబీఐ కేసులు పడతాయి అని భయం. ప్రెస్ మీట్ పెట్టి సూటిగా ఒక్క మాట అనరు.
() చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయి అంటే ఇటీవల ఒక పత్రికలో రాయించుకొన్నారు. ఏమని అంటే చంద్రబాబు మాదిరిగా పనిచేస్తే ఈ దేశం ఎక్కడికో వెళిపోతుంది అని రాయించుకొన్నారు. వాస్తవానికి ఎవరైనా రాష్ట్రపతిని కలిస్తే అక్కడకు పాత్రికేయులకు అనుమతి ఉండదు. కేవలం ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసుకొని వెళ్లిపోతారు. రాష్ట్రపతి తో కలవడానికి వచ్చినవారు మాత్రమే మాట్లాడతారు. అటువంటప్పుడు ఈ పత్రిక ప్రతినిధులు అంతా కళ్ల ముందు చూసేసినట్లు రాయించేస్తే ఎలా ఉంటుంది. పత్రికల విశ్వసనీయతను పక్కన పెట్టేసి మరీ ఇటువంటి డ్రామాలు ఆడిస్తున్నారు.
() చంద్రబాబు ప్రత్యేక హోదా మీద అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేయించారు.  సూటిగా ఒకటే అడిగాను. ప్రత్యేక హోదా మీద ఎందుకూ అందరినీ కలుపుకొని పోవటం లేదని ప్రశ్నించాను. అఖిల పక్షాన్ని పిలవండి. మేం కూడా వస్తాం. ఢిల్లీకి వెళదాం, అందరం కలిసి ఒత్తిడి తీసుకొని వద్దాం అంటే ఒప్పుకోరు. స్వయంగా పోరాడరు సరి కదా, మా లాంటి వాళ్లు పదే పదే గుర్తు చేస్తూ వీలైనంత మందిని కలుస్తూ అర్జీలు ఇస్తూ విన్నపాలు చేస్తుంటే మా మీద బండలు వేస్తుంటారు.
() చంద్రబాబుకి ఒక్కటే చెప్పదలచుకొన్నాం. జరుగుతున్న అన్యాయాన్ని సహిస్తూ ఉండిపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ముందుకు వచ్చి పోరాడక పోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
() ప్రత్యేక హోదా మీద మా వాదన సుస్పష్టం. హోదా మీద నరేంద్ర మోదీ అన్న మాటలు మేం ప్లే చేసి చూపించాం. తిరుపతి సభలో ఏం మాట్లాడారో వినిపించాం. అందుచేత హోదా ఇవ్వకపోవటం అన్నది మోదీ తప్పు. పోరాటం చేయకపోవటం చంద్రబాబు తప్పు. ఈ పోరాటం లో అందరం కలవాల్సి ఉంది. కలిసి కట్టుగా పోరాడాలి.
() ఈ తరుణంలో పోరాటం ఆపేస్తే, లేదా అడగటం మానేస్తే అసలు ఎవరూ దీన్ని పట్టించుకోరు. మనకు ఉన్న హక్కు గురించి మనమే ప్రస్తావన చేయకపోతే ఎలా. అప్పుడు మొత్తంగా పరిస్థితి నీరుగారిపోతుంది.
() ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒక వేళ కలిస్తే కనుక నేరుగా ప్రత్యేక హోదా గురించి అడుగుతాం. అంతే తప్ప పుష్కరాల ఆహ్వానం కోసం వచ్చాం అంటూ వంకలు చెప్పబోం.

No comments:

Post a Comment