17 August 2016

పుష్కరాలతోనే భ్రమలు కల్పిస్తారా..!

ఆంద్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో కృష్ణ పుష్కరాలు ఘనంగా ఆరంభం అయ్యాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లు శాస్త్రోక్తంగా పుణ్యస్నానాలు ఆచరించి పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ప్రాదాన్యత ఇవ్వవలసిందే. లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పింవలసిందే. అన్ని ఏర్పాట్లు,ముఖ్యంగా భద్రతా పరంగా జరగవలసిందే. అందులోను రాజమహేంద్రవరం వద్ద గత ఏడాది గోదావరి పుష్కరాలలో జరిగిన ఘోరమైన తొక్కిసలాట లో ఇరవైతొమ్మిది మంది మరణించిన నేపద్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు.కాని ఆ పేరుతో సాగుతున్న వందల,వేల కోట్ల రూపాయల దుబారాను మాత్రం సమర్ధించజాలం. 

తెలంగాణలో సుమారు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఆంద్రప్రదేశ్ లో ఏకంగా 1700 కోట్లు ఖర్చు పెట్టారంట. గోదావరి పుష్కరాల సమయంలో కూడా ఎపిలో సుమారు 1800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పుష్కరాలంటేనే ప్రజలకు ఏమోకాని కాంట్రాక్టర్లకు ,ప్రభుత్వంలోని వారికి పండగగా మారడం దురదృష్టం. ఒక సాహితీవేత్త అన్నట్లు పుష్కరాలలో పిండప్రదానం, కాంట్రాక్టర్ లకు ప్రసాదంగా అన్నట్లు పరిస్థితి ఏర్పడుతోంది. పలు చోట్ల నదిలోపల వరకు మెట్లు కట్టడం ,సిమెంట్ చేయడం వంటివి చేశారట. ఆ తర్వాత వరద రావడం తో అవన్ని వృధా అయిపోయాయట. రెండేళ్లుగా అదికారంలో ఉన్న ప్రభుత్వాలు చివరి నిమిషం వరకు టెండర్ లు ఎందుకు పిలవలేదో, నామినేషన్ పద్దతిలో ఎందుకు కాంట్రాక్టులు కట్టబెట్టారో తెలియదు. విజయవాడ వద్ద ఘాట్ ల నిర్మాణానికి ఈ రకంగా కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని విమర్శలు వచ్చాయి. 

ఇవి కాకుండా ఎపి ప్రభుత్వం ప్లెక్సీ ఫండ్ పేరుతో మరో ముప్పై కోట్ల రూపాయలను పుష్కరాల మార్కెటింగ్ కు ఖర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ రకంగా వందల కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవమే అయితే, ప్రభుత్వం కచ్చితంగా బాద్యతారాహిత్యంగా ఉన్నట్లే అనుకోవాల్సి ఉంటుంది. గతంలోను పుష్కరాలు వచ్చాయి. అప్పట్లో ముఖ్యమంత్రులు ఇంత హడావుడి చేయలేదు. వెళ్ల దలచుకుంటే ఏదో ఒక రోజు వెళ్లి వచ్చేవారు. ప్రస్తుతం పుష్కరాలు ఇదే మొదటిసారి వచ్చినట్లు లేదా ప్రభుత్వ నేతలే వాటిని కనిపెట్టినట్లుగా వ్యవహారం నడుస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే ప్రభుత్వానికి అసలైన కార్యక్రమం అయినట్లు, పెద్ద ఎత్తు ప్రచారం చేయడం, స్నానాలకు తరలి రండని పార్టీ కార్యకర్తలను పురమాయించడం వంటివి చేస్తున్నారు. 

గోదావరి పుష్కరాల సమయంలో నీటి సమస్య రావడంతో భక్తులు కలుషిత నీటిలోనే స్నానాలు చేయవలసి వచ్చింది.దానితో లక్షల మందికి చర్మవ్యాధులు సోకినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కృష్ణా నదిలోకి ఈసారి నీరు రావడంతో ఆ సమస్య అంతగా ఉండవకపోవచ్చు.అయినా కొన్ని చోట్ల నీరు కలుషితంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విజయవాడలో ఇతర కొన్ని చోట్ల ఏర్పాట్లు బాగానే ఉన్నా, కొన్ని ఘాట్ ల వద్ద తాగు నీటి సదుపాయం సరిగా లేదని ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం వాటిపై శ్రద్ద తీసుకుంటే మంచిది.ఏదైనా లోపాలు ఉంటే ప్రభుత్వాలపై విమర్శలు వచ్చే మాట నిజమే. లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు శ్రధ్ద తీసుకుని అన్ని వసతులు ఏర్పాటు చేయడం మంచిదే . కాని అతి గా ప్రచారం చేస్తుండడం, ప్రపంచం అంతా కృష్ణా పుష్కరాలతోనే ఎపిని గుర్తించాలని ముఖ్యమంత్రి చెబుతుండడమే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టడం, సదస్సుల పేరుతో ప్రచారం సాగించడం, వంటివి ,విన్నూత్నంగా కనిపెట్టిన హారతి వంటి కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్ధికంగా కష్టాలలో ఉన్నామని చెప్పే ఎపి ప్రభుత్వం యధేచ్చగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండడం విమర్శలకు దారి తీస్తుంది. మతం అన్నది విశ్వాసం. మతం అన్నది ఒక నమ్మకం. వాటిని ప్రభుత్వ పెద్దలు వాడుకుని ప్రజలను ఇతర సమస్యలను మళ్లింవచ్చనుకుంటే అది భ్రమే అవుతుంది.మరి పుష్కరాలతోనే ప్రజలలో భ్రమలు కల్పించగలుగుతారా?

No comments:

Post a Comment