30 June 2016

సచివాలయం పూర్తికాకముందే ప్రారంభోత్సవాలు

  • ఈ హంగు ఆర్భాటాలు అవసరమా..?
  • అమరావతి రాజధాని ఏపీకా..? సింగపూర్‌కా..?
  • లక్షల కోట్ల ఎంవోయూలు  ఏమయ్యాయి
  • విదేశీ మోజును వీడి రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలి
  • వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: ఏపీ రాజధాని తరలింపు పేరుతో బస్సులు, రైళ్లు అంటూ యుద్ధప్రతిపాదికన టీడీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రెండు సంవత్సరాల కాలంగా నిద్రపోయిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తన్నారో అర్ధం కావడం లేదన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో పట్టిసీమలో కాల్వలు పూర్తికాకముందే ప్రాజెక్టు అయిపోయిందని, అనుసంధానం అయిపోయిందని ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో ఒక చిన్నరూం కూడా నిర్మాణం పూర్తికాని తాత్కాలిక సచివాలయంలో చంద్రబాబు ఒకసారి, మంత్రులు అనేక సార్లు ప్రారంభోత్సవాలు చేసి మళ్లీ 29వ తేదికి ఒక ముహూర్తం పెట్టారని ఎద్దేవా చేశారు. ఇన్ని ఆర్భాటాలు ఎందుకో చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 

అధికారం ఉందికదా అని ఏం చేస్తే అదే శాసనం అనే విధానాన్ని వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్‌కు కట్టబెట్టడాన్ని పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుపై వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన చెందుతుందని పేర్కొన్నారు. మనకున్న జీవనశైలిలో ఆర్థికంగా వెనుకబడిన పేదవాడు నివసించే విధంగా రాజధాని నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. గతంలో దేశాన్ని పాలించిన బ్రిటీష్‌ వారు కూడా చంద్రబాబు లాంటి నిబంధనలు, దురాక్రమణలు చేసివుండరని విరుచుకుపడ్డారు. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానా? లేక సింగపూర్‌కు రాజధానా? అని చంద్రబాబును ప్రశ్నించారు. 

20 సంవత్సరాలు వాణిజ్యపరంగా అమ్ముకునేందుకు, అది చాలకపోతే మరో 5 సంవత్సరాలు అమ్ముకునేందుకు సింగపూర్‌ కంపెనీలకు నిబంధనలు పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ ఒప్పందాలపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే టీడీపీ అవినీతి భయటపడుతుందనే నెపంతో పది రెట్లు ప్రభుత్వ సొమ్మును చెల్లించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఎవరిని మోసం చేయడానికి ఈ నిబంధనలు పెడుతున్నారని ప్రశ్నించారు. 

బాబువి దుర్మార్గపు నిర్ణయాలు
చంద్రబాబు  నిర్ణయాలన్ని దుర్మార్గమైన నిర్ణయాలని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో సమ్మిట్‌లు పెట్టి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అసెంబ్లీ రికార్డులలో మాత్రం  రూ. 10 వేల కోట్లు అని చూపిస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా విజయవాడలో పెట్టుబడులు పెట్టేందుకు రూ. 2 లక్షల కోట్లు, జపాన్‌ నుంచి లక్షలాది కోట్లు, సింగపూర్‌ దావోస్‌ నుంచి లక్షల కోట్లు వస్తున్నాయి. ఎంవోయూలు కూడా కుదుర్చుకున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఆ ఎంవోయూలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ. 3 వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌ వస్తుంది అని చెప్పారు. ఆ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌ గురించి విచారణ చేస్తే అది పూర్తిగా నష్టాల్లో ఉన్న కంపెనీగా తేలిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన సమయంలో వింతపోకడలతో పోతున్న ప్రభుత్వాన్ని చూస్తుంటే భయాందోళనలు రేకెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

గత కొద్ది రోజులుగా చంద్రబాబు మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నారు కానీ మనసంతా సింగపూర్‌లోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. బాబుకు సింగపూర్ అంటే ఎందుకు అంత ప్రేమ అని ప్రశ్నించారు. భారతదేశంలో మంచి ఇంజనీర్స్‌ ఉన్నారని ప్రపంచ దేశాలు అంటుంటే చంద్రబాబు మాత్రం రాజధానిలో మురికివాడలను కట్టాలనుకుంటున్నారా అని ఇంజనీర్స్‌ను, సంస్థలను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఏరకంగా ఉందో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. ఇతిహాద్‌ హెయిర్‌లైన్స్‌ వస్తున్నాయని చెబుతున్నారు . వాణిజ్య పరంగా ఆ కంపెనీ అభివృద్ధి చెందుతుంది కానీ పేద ప్రజలకు ఒరిగేదేముందో అర్ధం కావడం లేదన్నారు.  రెండు సంవత్సరాల కాలంలో చేసిందేమీ లేక గత ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలపై పేర్లు మార్చి మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విదేశీ మోజును వీడి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. 

No comments:

Post a Comment