14 June 2016

జిత్తులమారి గుంటనక్క ఎవరు ?

  • టీడీపీ పాలనలో దగాపడిన రాష్ట్రం
  • హామీలు విస్మరించి అరాచక పాలన
  • బాబును ఓడించగల శక్తివంతుడు వైయస్ జగన్ ఒక్కడే
  • గడగడపకు వెళ్దాం..పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం
  • చంద్రబాబు అవినీతి, మోసపూరిత పాలనను ఎండగడుదాం
  • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వైయస్సార్సీపీ నేతలు

విజయవాడః చంద్రబాబు రైతులను పూర్తిగా దగా చేశారని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. భారతదేశంలో రైతు ముఖ్యమంత్రిగా చెప్పుకునే ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఏపీని ఎందరో పాలించారు గానీ,  రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసిన ముఖ్యమంత్రి అది ఒక్క వైయస్సార్ మాత్రమేనన్నారు. చంద్రబాబు వ్యవసాయం అంటేనే  పారిపోయే దుస్థితి తీసుకొచ్చారని బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరికి బోనస్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమేనన్నారు. రైతుల ఇబ్బందులు, పాట్లు వైయస్సార్ కు తెలుసు గనుకే...రైతులను అన్ని విధాలా కాపాడారని తెలియజేశారు. 

రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు..!
రైతులకు ఏదో ఉద్ధరిస్తున్నానని చెప్పుకోవడం తప్ప బాబు చేసిందేమీ లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్ అయ్యారు. అధికారంలో లేనప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని మాట్లాడిన చంద్రబాబు...గద్దెనెక్కాక  దాన్ని ఉల్లంఘించారన్నారు. రైతులను బాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు.  జేబులు నింపుకునేందుకు బాబు పట్టిసీమను తెరపైకి తెచ్చారని బోస్ విమర్శించారు. 22 పర్సంట్ ఎక్సస్ తో కోట్ల అవినీతికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. దీనిపై శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు నిలదీస్తే ఎదురుదాడికి దిగారని ఆగ్రహించారు.  ఖరీఫ్ సీజన్ లో గోదావరి డెల్టాలో చేను ఎండిపోయిన దుస్థితి ఏనాడూ లేదన్నారు. కాసుల కోసం కట్టిన పట్టిసీమ వల్లే గోదావరి ఎండిపోయిందన్నారు. పట్టిసీమ వల్ల గోదావరి ఎండిపోతుందని చెప్పినా బాబు వినలేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు కూడా చేసిన విషయాన్నిబోస్  గుర్తు చేశారు. 

పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..!
బాబుకు ఓట్లేసి గెలిపించిన గోదావరి జిల్లాల రైతాంగం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు  రైతులు, డ్వాక్రామహిళలు, నిరుద్యోగ యువత అందరినీ బాబు మోసం చేశారని బోస్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరిలు ఎండిపోవడానికి బాబే కారణమన్నారు. రైతులు విలవిలలాడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు బాబు అని నిలదీశారు.  పోలవరం 2018లో పూర్తి చేస్తామని చెప్పి గాలికొదిలేశారు.  పోలవరాన్ని 2018లోగా పూర్తి చేస్తే  వైయస్ జగన్ తో బాబుకు సన్మానం చేయిస్తామని బోస్ అన్నారు . ఈసవాల్ ను స్వీకరించే దమ్ముందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. పోలవరం ముంపు ప్రాంతాల్లోని రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారని,  రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. 

అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి..
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
విజయవాడ: రెండేళ్ల కాలంలో టీడీపీ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని వైయస్‌ఆర్‌సీపీ డిప్యూటి ఫ్లోర్‌ లీడర్‌ ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజ్యంగానికి విరుద్ధంగా బాబు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం  ఏ ఒక్క పేదకు పక్కా గృహం నిర్మించిన పాపాన పోలేదని కల్పన ధ్వజమెత్తారు.  విజయవాడలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.  ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా రాజ్యంగ విరుద్ధంగా చేస్తున్నవేనని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ చొక్కాలు దోచుకుంటున్నారని ఫైరయ్యారు.  

ఏ సంక్షేమ పథకం రావాలన్న జన్మభూమి సిఫారసులు కావాలని ఆదేశాలు పెడుతూ..టీడీపీలోకి వస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఇంతవరకు ఎక్కడా చూడలేదని అధికార టీడీపీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారని తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు చేసిన ఐదు సంతకాల్లో ఇంత వరకు ఏ ఒక్కటి అమలు కాలేదని ధ్వజమెత్తారు. అంగన్‌వాడీలకు కనీస వేతనాలు చెల్లించలేదని, పంట రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వైయస్‌ జగన్‌ ఫీవర్‌ వచ్చిందని కల్పన అన్నారు. కరువు మండలాలు ప్రకటించకపోవడంతో వైయస్‌ఆర్‌సీపీ నిరసన కార్యక్రమలు చేపడితే..సీఎం కరువు ఎక్కడ ఉందని మాట్లాడటం శోచనీయమన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎం వివక్షాపూరితంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని..పాపాలు పోగొట్టుకునేందుకు ప్రజలు గుళ్లకు వెళ్తున్నారని సీఎం వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వచ్చే నెలలో తలపెట్టనున్న గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు.

రైతుల పొట్టగొట్టిన చంద్రబాబు..
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
విజయవాడ: రాజధాని పేరుతో చంద్రబాబు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని, రైతుల పొట్టగొట్టి భూములు లాక్కొని వాటితో రియలేస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో వ్యవహరించాడని ఆయన ఫైరయ్యారు. అధికారం కోసం అన్యాయమైన, అసంబద్ధమైన హామీలను గుప్పించారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొని... నేనే రాజధాని కడతానంటూ కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా దోచుకునేందుకు బాబు కుట్రపూరితంగా అడ్డుకున్నారన్నారు. 

మూడు పంటలు పండే భూమి, నల్లమట్టి భూమి రాజధానికి సరిపోదని, తీవ్రమైన ఖర్చుతో కూడుకున్న పని అని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందన్నారు. ఆ కమిటీ మాటలను కూడా బేఖాతరు చేసి చంద్రబాబు, తన వ్యాపారులతో కలిసి కమిటీగా ఏర్పడి రైతుల భూములను అడ్డగొలుగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధికి ప్రతిపక్షం ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. చంద్రబాబుతో రాజధాని నిర్మాణం జరగదని, చంద్రబాబుపై నమ్మకంలేని వ్యక్తి దేశంలో నరేంద్రమోడీ ఒక్కడేనని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు నీరు–మట్టి మాత్రమే ఇచ్చాడు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. డబ్బులు కొట్టేయాలనే చంద్రబాబు దురుద్ధేశాన్ని మోడీ పసిగట్టారని వివరించారు. 

రాజధాని నిర్మాణం కోసం కేవలం రూ. 850 కోట్లు మాత్రమే వచ్చాయని మంత్రి నారాయణ చెప్పారు. ఆ నిధులు ఎలా ఖర్చుపెట్టారంటే ఇంత వరకు మాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఆయన మంత్రులు పరిపాలనను వదిలి సంపాదించుకోవడానికే  వచ్చారని విమర్శించారు. 13 జిల్లాలు కల్గిన రాష్ట్రానికి 6,800 స్వ్కేర్ కిలోమీటర్ల రాజధాని అవసరమా అని చంద్రబాబును నిలదీశారు. రాజధాని పేరుతో  కృష్ణా, గుంటూరు జిల్లాలోని 58 మండలాలను అమ్ముకుందామని చంద్రబాబు పథకం పన్నారని ఆరోపించారు. 

రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల భూములను ప్రభుత్వం నిర్ధాక్షణంగా తగలబెట్టించిందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఆ సంఘటన దొంగలను పట్టించుకోని నిస్సాహాయస్థితికి చంద్రబాబే కారణమన్నారు. మూడు పంటలు పండే రైతులను భూములను లాక్కోవడంతో రైతులు విలవిలలాడుతున్నారన్నారు. పంటలతో కళకళలాడుతూ రైతు కూలీలు రోజులకు రూ. 5–8 వందల సంపాదించుకునే ప్రాంతం ఇప్పుడు సహారా ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల కోసం  బాబు మంత్రులను అర్ధరాత్రి రైతుల ఇంటికి పంపించి బెదిరింపులకు పాల్పడే స్థాయికి దిగజారారని మండిపడ్డారు. . భూములు లాక్కునే రోజుల్లో ఇంటికో ఉద్యోగం, ఇంటికి రూ. 2000 ఇస్తామని చెప్పి అవేవి అమలు కాకపోవడంతో మంత్రులు ఆ ప్రాంతంలో తిరగడం లేదని చెప్పారు. మేల్‌ మధర్‌ థెరిస్సాలా నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు. సమాజసేవ చేయడానికి వచ్చానని చెప్పిన మంత్రి నారాయణ రాజధాని ప్రాంత రైతుల చిన్నారులకు ఆయనకున్న విద్యాసంస్థల్లో ఉచితంగా చదువు చెప్పిస్తున్నారా అని ప్రశ్నించారు. నెలకు రెండు వేలు ఇస్తామని వాగ్ధానం చేశారు. ఇంత వరకు అమలు చేశారా అని నిలదీశారు. రాజధాని ప్రాంతంలో గ్రామీణ వాతావరణాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

మంగళగిరి ప్రాంతం నుంచి బాబు బస్సు సాఫీగా వెళ్లడానికి సుమారు 70 ఇళ్లను కూల్చివేయడానికి ఎంఆర్‌వోతో మార్కింగ్‌ చేయించారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుట్రపూరిత నిర్ణయాలపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నామన్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి చంద్రబాబు అక్రమంగా దండుకుంటున్న భూముల్లో నుంచి 8 నుంచి 10 వేల ఎకరాల భూమిని కాపాడామని చెప్పారు. పేదవాడి ఇళ్లను కూడా కాపాడుతామని వారికి భరోసా ఇచ్చారు. ఇంటి నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లడానికి కూడా చంద్రబాబు హెలికాప్టర్‌లో వెళ్తున్నారని, ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. పదివేల ఎకరాలు మాత్రమే రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చారని, మిగిలిన భూమినంతా దౌర్జన్యంగా లాక్కున్నారని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు లక్షకోట్ల అవినీతికి పాల్పడ్డారని, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండదండలతో ప్రజలంతా ఎదిరించాలని పిలుపునిచ్చారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రంలోని ముసలివారికి పెన్షన్‌ రాకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్న బాబు
ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసీఆర్‌ కాళ్లు పట్టుకొని ఆయన పెట్టిన డెడ్‌లైన్‌కు తలొగ్గి హైదరాబాద్‌ నుంచి తట్టాబుట్టా సర్దుకొని అమరావతిలో ఉంటున్నాడని ఆర్కే విమర్శించారు. ఓటుకు కోట్ల కేసుకు భయపడే రాష్ట్రానికి చెందాల్సిన అంశాలను తుంగలో తొక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లు తిన్న రాబంధు ఒక్క గాలివానకు చచ్చిందన్న చందంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు కూలిపోకతప్పదని బాబును హెచ్చరించారు. చంద్రబాబు అక్రమ ఇంటి కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం బస్సులో ఉండి పాలన చేస్తున్నానని చెప్పిన చంద్రబాబు మాటలకు ఆర్కే ఘాటుగా స్పందించారు. ఓటుకు కోట్ల కేసుకు భయపడి చంద్రబాబు బస్సులో ఉండి కేసుకు సంబంధించిన లావాదేవీలను నడిపించారని చెప్పారు. రాజధాని ముసుగులో చేస్తున్న రియలేస్టేట్‌ వ్యాపారాన్ని ఇకనైనా మానుకోవాలని డిమాండ్‌ చేశారు. దివంగత మహానేత వైయస్సార్ పరిపాలన కోసం వైయస్‌ జగన్‌ అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలకు సూచించారు. 

కొత్త కొత్త అవినీతిలను కనిపెడుతున్న తండ్రీకొడుకులు
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 
 చంద్రబాబు రెండేళ్ల అవినీతి మీద గంటో రెండు గంటలో మాట్లాడిన సమయం సరిపోదనే పార్టీ తరఫున ఒక పుస్తకం విడుదల చేయడం జరిగిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైయస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు గతంలో ఎన్నో రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు.   రూ. 50 వేలు ఇస్తే అవినీతి పరంగా ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేవారు. మంత్రి పదవులను కేటాయించడంలో మరోరకమైన అవినీతికి పాల్పడేవారు. భూ కేటాయింపులో ఒక రకమైన అవినీతి అని అంబటి పేర్కొన్నారు. కానీ 2014 ఎన్నికల తర్వాత కొత్తరకమైన అవినీతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆయన ఎద్దేవా చేశారు. గత అనుభవాన్ని రంగరించి ఒక రీసెర్చ్‌ బాబు పెద్ద ప్రొఫెసర్‌గా మారితే లోకేష్‌ చిన్న ప్రొఫెసర్ గా తయారయ్యారని విమర్శించారు. ఇద్దరబ కలిసి ఎన్నో ప్రయోగాలు చేసి అవినీతి ఎలా చేయాలో కొత్తమార్గాలు కనుగొన్నారని మండిపడ్డారు. ఆ అవినీతి ఎలా అంటే మట్టి, ఇసుకలో అవినీతి ఉంటుందని ఎవరికీ తెలియదని, కానీ తండ్రి కొడుకులు మాత్రం చెరువుల్లో మట్టితో సైతం అవినీతికి పాల్పడవచ్చన్న కొత్త విధానం కనుగొన్నారని ఎద్దేవా చేశారు. దేవుడి భూములను సైతం కాజేయవచ్చని నిరూపించారు. రెండేళ్లకే బాబు ఇంతమేర అవినీతికి పాల్పడితే ఎన్నికల సమయానికి ఇంకేంత మేర అవినీతికి పాల్పడ్డాతారో ఊహించవచ్చన్నారు. రెండేళ్లలో రూ. లక్ష 45వేల అవినీతి ... ఇక మూడేళ్లలో ఇంకెంత అవినీతికి పాల్పడతారో అర్థంకావడం లేదన్నారు. ఒక వైపు అవినీతి... మరోవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని నిప్పులు చెరిగారు. 

బాబు ఇంతమేర అవినీతికి పాల్పడితే ఎవ్వరు తిరగబడరా..? రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేస్తారా..? అన్న అనుమానం తండ్రీ కొడుకుల్లో ఏమాత్రం లేదన్నారు. ఎన్నికల సమయానికి ఓటుకు రూ. 500 నుంచి రూ. 5,000 ఇస్తే సరిపోతుంది... కేవలం డబ్బును వెదజల్లడం ద్వారానే అధికారంలోకి వస్తామన్న భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలను గడపగడపకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబును తుక్కుతుక్కుగా ఓడించగల శక్తి, సామర్థ్యాలు ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉన్నాయని ఆయన వివరించారు. బాబు అసలే జిత్తులమారి గుంటనక్క... అలాంటి నక్క ఎన్నికల సమయానికి ఎన్ని ఎత్తులు వేస్తుందో అర్థం చేసుకొని ఎత్తుకు పైఎత్తు వేసి యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఇప్పటికే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని జరిగినా ఇది ప్రజాస్వామ్య దేశమని చివరికి న్యాయమే గెలుస్తుందన్న ధీమాతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు.

ఓర్వలేకనే ఛానల్ నిలిపివేత..
వైయస్ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక,  ఏమీ చేయలేకనే సాక్షి ఛానల్‌ ప్రసారాలను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. గతంలో సైతం ఓ ఛానల్‌ను ఇలాగే నిలిపివేస్తే... ఆ ఛానల్‌ యాజమాని ఎంఎస్‌ఓ దగ్గరికి వెళ్లగా ఎంఎస్‌ఓ లోకేష్‌ దగ్గరికి పంపిచారని గుర్తు చేశారు. లోకేష్‌ దగ్గరికి సదరు యాజమాని వెళ్లగా ఆ ఛానల్‌లో వైయస్‌ జగన్‌కు అనుకూలంగా ఏ వార్తలు రాయకూడదని... కేవలం బాబు భజన మాత్రమే చేయాలని షరతులు విధించిన విషయం గుర్తు చేశారు. కానీ సాక్షి ఛానల్‌ అలా చేయదన్నారు. ఎన్ని అడ్డంకులు, అవంతరాలు ఏర్పర్చినా సాక్షి ఛానల్‌ నిజాన్ని నిప్పులాగే చూపెడుతుందన్నారు. సాక్షి ఛానల్‌ను ప్రసారం చేయకపోతే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

No comments:

Post a Comment