10 May 2016

ప్రత్యేక హోదా తో ఎన్నెన్నో ప్రయోజనాలు

  • హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు
  • చంద్రబాబు స్వార్థంతో హోదాకు అడ్డంకి
  • కలిసికట్టుగా పోరాడుదాం
  • కాకినాడ ధర్నాలో వైయస్ జగన్ పిలుపు

కాకినాడ: ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడి సాధించుకొందామని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపు ఇచ్చారు. చంద్రబాబు స్వార్థంతో హోదాను, ప్రయోజనాల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ దగ్గర ప్రత్యేక హోదా కోసం జరిగిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

       ఈ రోజు మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా ఈ మాదిరి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాం. ఒక ప్రశ్న సూటిగా అడగదలచుకొన్నాను. ఉద్యోగాలు కావాలా..వద్దా.. అంతా కావాలని అంటున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నారో గుర్తు చేసుకోండి. ఆ సమయంలో ఏ టీవీ పెట్టినా జాబుకావాలంటే బాబు రావాలి అని వచ్చేది. అవునా.కాదా. గుర్తు చేసుకోండి. మరి బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. మనకు మాత్రం జాబులు రాలేదు. ఒక వేళ జాబులు ఇవ్వలేకపోతే రూ.2వేల నిరుద్యోగ భ్రతి ఇస్తాను అన్నాడు. మరి ఎక్కడ. ఎందుకంటే చంద్రబాబుకి ప్రజలతో పని అయిపోయింది. అదే బాబు నైజం. ఎన్నికలకు వెళ్లినప్పుడు అబద్దాలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయటం. ఇదే చంద్రబాబు నైజం. ఇదేమీ ఆయనకు కొత్త కాదు. బాబు వచ్చాడు..మోసం చేశాడు.. అని మరోసారి తేటతెల్లం అయింది.


       చదువుకొన్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. ఈ హోదా వస్తేనే కనీ వినీ ఎరగని విధంగా పరిశ్రమలు వస్తాయి. లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడులు వస్తాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు చంద్రబాబు సింగపూర్ లు, జపాన్ లు వెళ్లనవసరం లేదు. విమానాలు ఎక్కి విదేశాలు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి వస్తాయి. విపరీతమైన రాయితీలు ఇస్తారు. ఎక్సైజ్ డ్యూటీ కట్టనవసరం లేదు. కరెంటు ఛార్జీల్లో సగానికి సగం రాయితీ ఉంటుంది. పావల వడ్డీకే వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఇన్ని ప్రోత్సాహకాలు ఉంటాయి కాబట్టే పరిశ్రమలు, పెట్టుబడిదారులు దండిగా వస్తారు. ఉద్యోగావకాశాలు కలుగుతాయి. అప్పుడు ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది.
       రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టేటప్పుడు చంద్రబాబు దగ్గర ఉండి ఓట్లు వేయించారు. అదే చట్ట సభల్లో బీజేపీ, కాంగ్రెస్ లు ఓట్లు వేయించి విడగొట్టారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లపాటు కల్పిస్తామని చెప్పి మరీ రాష్ట్రాన్ని విడదీశారు. ఎన్నికల సమయంలోనూ ఇదే ఊదర గొట్టారు. చివరకు ఈ పరిస్థితికి చేరుకొన్నాం.
       వాస్తవానికి చంద్రబాబు అన్ని వర్గాల్ని మోసం చేశారు. రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశారు. అదే పేరుతో డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. చదువుకొనే పిల్లల్ని మోసం చేశారు. ఎనికలప్పుడు చెప్పినవాటిని ఎగ్గొట్టి తీరిగ్గా పంగనామాలు పెడుతున్నారు. అదిగో అక్కడ ప్లకార్డులు పట్టుకొన్న అన్నదమ్ముల్ని అడుగుదాం. ఎన్నికలప్పుడు ఎన్నెన్ని చెప్పారు. అప్పుడు వచ్చి డోలు కొట్టారు. ఇప్పుడు పంగనామాలు పెడుతున్నారు. వాస్తవానికి కులం, మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించిన ఘనత దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుంది. ప్రతీ కులం, ప్రతీ వర్గం, అక్క చెల్లెమ్మలు, రైతులు, అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే చెందుతుంది.
       ప్రత్యేక హోదా కోసం మేం దఫ దఫాలుగా పోరాడుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని తెలిసి దీక్ష చేపట్టాం. గుంటూరు లో నేను స్వయంగా ఆమరణ నిరాహార దీక్ష చేశా. ప్రధానమంత్రికి ఈ దీక్ష తీవ్రత అర్థం అయ్యేలా చాటి చెప్పేందుకు ప్రయత్నించాం. కానీ, నాలుగు రోజుల ముందే అర్ధ రాత్రి దొంగచాటుగా వచ్చి దీక్ష ను భగ్నం చేశారు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి అక్కడ దీక్ష చేశాం. ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం.
మేం ఇన్ని రకాలుగా ప్రయత్నాలు, పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రత్యేక హోదా రావాటం లేదూ అంటే దానికి కారణం చంద్రబాబే. ఎందుకంటే అడగాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అడగకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు కాబట్టే ప్రత్యేక హోదా రావటం లేదు. ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్ల పాటు కావాలి అన్నారు. తీరా ఎన్నికల తర్వాత చూస్తే అదేమీ సంజీవని కాదంటున్నారు, హోదా వస్తే స్వర్గం అయిపోతుందా అంటున్నారు, కోడలే మగపిల్లాడ్ని కంటాను అంటే అత్త వద్దంటుందా అని ప్రశ్నించారు. చివరకు చంద్రబాబు వైఖరితో ఢిల్లీ పాలకుల మనస్సు మారిపోయింది. అక్కడ నాయకులు పార్లమెంటులోనే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పగలిగే ధైర్యం చేయగలిగారు అంటే దానికి చంద్రబాబే కారణం.
అందుకే మనమంతా కలిసికట్టుగా చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొని రావాలి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయమని అడగాలి. చంద్రబాబు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదంటే మా కేంద్ర మంత్రులతో రాజీనామా చేయిస్తా అని అల్టిమేటమ్ ఇవ్వాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఇంత జరగుతున్నప్పటికీ ఎందుకు అల్టిమేటమ్ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ బీద అరుపులు అరిచి, అక్కడకు వెళ్లి మోదీని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఎందుకంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. 20 కోట్లు, 30 కోట్లు వెదచల్లి ఎమ్మెల్యేలను కొంటున్నారు. 17 మంది ఎమ్మెల్యేలను ఇంత పెద్ద మొత్తంలో కొన్నారు అంటే తక్కువ లో తక్కువ 4, 5 వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి ఉంటారు అని అర్థం అవుతోంది. ఇదే తరహాలో తెలంగాణ లో ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నించి ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయారు. ఏ రోజైతే కేంద్రానికి ఈ విధమైన అల్టిమేటమ్ ఇస్తారో అప్పుడు కేసులు బయటకు తీయించి జైలుకి పంపిస్తుంది అని భయం. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది ప్రజల్ని ఎడారి పాలు చేస్తున్నారు.
అటు, మహబూబ్ నగర్ జిల్లాలోనే కేసీయార్ క్రిష్ణా నది నీటిని ఆపుతుంటే పట్టించుకోవటం లేదు. కనీసంగట్టిగా నిలదీయటం లేదు. ఎందుకంటే అడిగితే కేసీయార్ ఆడియో వీడియో టేపులు బయటకు తీస్తారు. జైలులో పెట్టిస్తారు అని భయం. చంద్రబాబు కేసుల గురించి ఇటువంటివి జరగుతున్నాయి.
అందుచేత మనం అంతా కలిసికట్టుగా పోరాడుదాం. ఢిల్లీ పెద్దలను కదిలిద్దాం. ఇటువంటి పరిస్థితుల మీద చంద్రబాబుకి జ్నానోదయం కావాలి. ప్రజలంతా పడుతున్న బాధలు తెలిసిరావాలి. ఎమ్మెల్యేలను కొనటం వల్ల ప్రజల్లో మంచి పేరు రాదు, సుపరిపాలన వల్ల వస్తుంది అని తెలిసిరావాలి. ఈ మార్పుకోసం అంతా ఒక్కటై పోరాడుదాం.
       అని వైయస్ జగన్ పిలుపు ఇచ్చారు.

No comments:

Post a Comment