13 May 2016

ప్రజాసమస్యలను గాలికొదిలి విహారయాత్రలా

  • ఏపీ ఎడారిగా మారుతున్నా పట్టదా బాబు
  • తెలంగాణ అక్రమప్రాజెక్ట్ లపై మౌనమేల 
  • నిస్సిగ్గుగా హెరిటేజ్ మజ్జిగ వ్యాపారం చేస్తున్నారు
  • పనామాలో వచ్చిన అవినీతి బాగోతంపై బాబు నోరువిప్పాలిః బొత్స
విశాఖపట్నంః చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని  వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తెలంగాణ నిర్మించబోయే అక్రమ ప్రాజెక్ట్ లతో దిగువ ప్రాంతాలన్నీ ఎడారిగా మారే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయంలో 880 అడుగుల నీరుంటే తప్ప సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ కు నీరు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. రాయలసీమకు నీరు అందాలన్నా శ్రీశైలంలో సమృద్ధిగా నీరు ఉండాలన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎగువ నుంచి నీటిని పంపింగ్ చేసుకుంటే ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. విశాఖలో విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడారు.

దీనిపై టీడీపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని, ఈసమస్యను కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని బొత్స ప్రశ్నించారు.  దాని మీద మీ తాలుకా అభిప్రాయాన్ని ఎందుకు వెళ్ల‌డించ‌డం లేదని నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్ పైనా ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి అథారిటీ ఏర్పాటుచేసినా ....రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, ధనదాహం కోసం పోలవరాన్ని పక్కనబెట్టి పట్టిసీమ పేరుతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేసిందని ఫైరయ్యారు. ఇక ఎగువన కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్త‌యితే దిగువన గోదావ‌రికి వ‌చ్చే నీరు తగ్గుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు క‌ట్ట‌క‌పోతే ప‌రిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

చంద్రబాబు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని పక్క రాష్ట్రాల‌కు తాక‌ట్టు పెడుతున్నందునే....ఆప్రయత్నాలను అడ్డుకొనేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి రావల్సిన న్యాయ‌ప‌ర‌మైన జ‌లాల కోసం ఎంతవరకైనా  పోరాడుతామని బొత్స స్పష్టం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో  ఏపీ ప్రజల హక్కులను పోరాడి సాధించుకుంటామన్నారు. తెలుగుదేశం నాయ‌కులు మ‌న‌స్సాక్షిని  ప్ర‌శ్నించుకోవాలని హితవు పలికారు. ఈనెల 17వ తారీఖున అన్ని మండ‌ల కేంద్రాల్లో  ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేందుకు, ప్ర‌భుత్వంపై ఒత్త‌ిడి తేవ‌టానికి నిరసన కార్య‌క్ర‌మాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. 16, 17, 18 తేదీల్లో వైయ‌స్ జ‌గ‌న్ దీక్షకు మద్దతుగా నిలిచి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 

గతంలో చంద్ర‌బాబు హ‌యంలో  ఎగువ రాష్ట్రాలు ఆల్మ‌ట్టి, బాబ్లీ ప్రాజెక్టులు క‌ట్టుకొన్నాయని, ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్ట్ లు కట్టుకుంటోందని ప్రభుత్వ నిర్లక్ష్యంపై బొత్స విరుచుకుపడ్డారు. క‌రవు, ఎండ‌ల‌తో ప్రజలు మాడిపోతుంటే బాబు విహారయాత్రలు చేయడం హేయనీయమన్నారు. చ‌రిత్ర‌లో ఏ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రించ‌ని విధంగా బాబు  వ్యవహరిస్తున్నారని, ప్రజలు దీన్ని గమనించాలన్నారు. వ్య‌క్తిగ‌త విహార యాత్ర‌ల‌కు తాము వ్య‌తిరేకం కాదని, కానీ  ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే బాధ్యత గల ముఖ్యమంత్రిగా  విహార యాత్ర‌లు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్ర‌ధాన‌మంత్రి అన్ని  రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని పిలుస్తున్నారని బొత్స చెప్పారు. అక్కడకు వెళ్లి ప్ర‌ధాన స‌మ‌స్యగా జ‌ల వివాదాన్ని, న్యాయ‌ప‌ర‌మైన మ‌న హ‌క్కుల్ని కాపాడుకోవ‌టానికి, గోదావ‌రి కృష్ణా ప్ర‌యోజ‌నాల్ని కాపాడుకోవ‌టానికి, రాయ‌ల‌సీమను ర‌త‌నాల సీమ‌గా మార్చుకోవ‌టానికి చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని బాబుకు సూచించారు. 

విశాఖ లో ప్ర‌భుత్వం త‌ర‌పున విశాఖ డెయిరీ ఉన్నా,  నిస్సిగ్గుగా హెరిటేజ్ మ‌జ్జిగ కొనాలంటూ క‌లెక్ట‌ర్ల చేత లెటర్ లు రాయించడం సిగ్గుచేటని ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. అన్నీ వదులుకొని ఇంతగా బ‌రితెగించిన ప్ర‌భుత్వాన‌్ని ఇంత వ‌ర‌కు తానెక్కడా చూడలేదని బొత్స ఎద్దేవా చేశారు. బాబు హెరిటేజ్ సంస్థ‌ల డైర‌క్ట‌ర్ పేరు ప‌నామా ప‌త్రాల్లో మారు మోగుతోంది. అక్రమ సంపాదనను పనామాలో ఏవిధంగా దాచుకున్నారో బాబు ప్రజలకు సమాధానం చెప్పాలి.  అవాకులు, చెవాకులు చెప్పి తప్పించుకోవడం తగదని బాబును హెచ్చరించారు. ఇలాంటి దారుణాలు తాము చూడాల్సివస్తున్నందుకు బాధపడుతున్నామన్నారు. 

ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల అవ‌స‌రాలు ప‌ట్ట‌డం లేదని బొత్స ఫైరయ్యారు. టీడీపీ నేతల దృష్టి అంతా  అవినీతి మీద‌నే ఉందని ఆగ్రహించారు.  ఏజ‌న్సీ ప్రాంతంలో ఆసుప‌త్రులు స‌క్ర‌మంగా పనిచేయ‌టం లేదన్నారు. దీని మీద మా ఎమ్మెల్యే  మంత్రికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. అదేవిధంగా  విశాఖ స్టీల్ ప్లాంట్ కు నష్టం జరగకుండా నగర ప్రజలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము చేప‌ట్టిన జలదీక్ష  రాజ‌కీయాల‌కు సంబంధించిన‌ది కాదని, ఎగువ ప్రాంతాల్లో ప‌థ‌కాలు పూర్త‌యితే దిగువ‌కు నీరు రావన్నదే తమ ఆవేదన అన్నారు. కానీ  టీడీపీ మాత్రం ఇంకుడు గుంత‌ల పేరుతో ప్ర‌జ‌ల దృష్టిని ప‌క్క‌కు మర‌ల్చ‌ేందుకు కుట్ర చేస్తోందన్నారు.  

No comments:

Post a Comment