2 April 2016

సర్వత్రా ఆక్షేపణీయంగా మారిన ప్రభుత్వ తీరు

  • అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్దాలు
  • ఎదురు దాడులతో కాలక్షేపం

గుంటూరు: ప్రతిపక్షం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానాలు చెప్పలేక మంత్రులు, ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఎదురు దాడులు చేసి తప్పించుకొన్నారని  ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి   ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం  లేక మూజువాణి ఓటు పేరుతో ప్రభుత్వం పారిపోయిందని మండిపడ్డారు.గుంటూరు జిల్లా మంగళగిరి లో పాత్రికేయులతో మాట్లాడారు. శాసనసభలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సభ చరిత్రలోనే మాయనిమచ్చగా మిగులుతుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అంతా సభ సాక్షిగా అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారిన వారి సభ్యత్వాలుపోయి ఎన్నికలకు వెళితే గెలవలేమనే భయంతో వారిని రక్షించేందుకు ప్రభుత్వం దుస్సంప్రదాయాలకు ఒడిగట్టిందని విరుచుకుపడ్డారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. రాష్ట్రప్రజలు ప్రభుత్వ మోసాలను నిశితంగా గమనిస్తున్నారని, అవసరమైన సమయంలో గట్టిగా బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 
చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదల బతుకులు చిధ్రం చేశారని విమర్శించారు.  తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనే పునరావృతమై కరువు కాటకాలు, విద్యుత్ చార్జీల భారాలు, పన్నుల మోత తప్ప రాష్ట్రప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆర్కే పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల మోతతో చంద్రబాబు తన మోసపు నైజాన్ని మరోసారి నిరూపించాడని మండిపడ్డారు. 

No comments:

Post a Comment