30 April 2016

మే 2న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు

  • కరువు బాధలు పట్టని సర్కార్
  • అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు
హైదరాబాద్ః ప్రజలు కరువుతో అల్లాడుతుంటే దాన్ని గాలికొదిలేసి...ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పుతూ ఎంతమంది వచ్చారని లెక్కలేసుకోవడం సిగ్గుచేటని  వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  చంద్రబాబు వైఫల్యం మూలంగా  కరువు దెబ్బకు  ప్రజలు, మూగజీవాల జీవాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎంతసేపు ఎమ్మెల్యేలను కొంటూ సంతోషపడుతున్నారే గానీ...ప్రజల బాధలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. 

ఏ ప్రభుత్వమైనా మార్చిలోనే వేసవి కాలంలో వచ్చే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్లాన్ చేసుకోవడం పరిపాటి అని పార్థసారథి అన్నారు.  జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులందరితో సమావేశం పెట్టి ...కరువు, తాగునీటి సమస్యలపై ప్రణాళికలు రూపొందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కానీ  ఏఫ్రిల్ చివరి వారం వచ్చినా కూడా కరువును, నీటి ఎద్దడిని ఏవిధంగా ఎదుర్కోవాలన్న సూచిక లేకుండా ఈప్రభుత్వం పనిచేయడం దారుణమని పార్థసారథి ఫైరయ్యారు. బాబు ఎంతసేపు  ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు తప్పితే వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. 

అనంతపూర్ ను బాబు రాబోయే రెండేళ్లలో కోనసీమ కంటే పచ్చగా తయారు చేస్తాడంటూ కలల్లో విహరిస్తున్న టీడీపీ నేతలకు...తాజాగా జిల్లాలో నెలకొన్న  కరువు కనిపించడం లేదా అని నిలదీశారు.  తాగునీరు లేక ప్రజలు పడుతున్న అవస్థలు.  పశుగ్రాసం లేక మూగజీవాలు విలవిలాడుతున్న పరిస్థితి మీకు కానరావడం లేదా అని కడిగిపారేశారు.  కరువు, తాగునీరు, పశుగ్రాసం సమస్యలను  బాబు, టీడీపీ నేతలు మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. 

కృష్ణా జిల్లాకు పోయి నదుల అనుసంధానం చేశాం. బ్రహ్మాండంగా పంటలు పండించామని కలల్లో విహరింపజేస్తున్నారు. రైతులు పంటలు వేసుకోలేని దుస్థితి కల్పించి....కృష్ణా, గోదావరిని కలిపేశాం. అంతా బాగుందని నమ్మించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.  కరువు దృష్ట్యా  రైతులను ఏవిధంగా ఆదుకోవాలి,  పంచాయతీలకు ఎంత నిధులు కేటాయించాలి. ట్యాంకర్ల ద్వారా నీటిని ఏవిధంగా సరఫరా చేయాలన్న కార్యాచరణ ఈప్రభుత్వానికి లేకపోవడం హేయనీయమని  పార్థసారథి తూర్పారబట్టారు. బాబు వస్తే జాబు అన్నారు. జాబు సంగతేమో గానీ బాబు వస్తే కరువు వస్తుందని మాత్రం  నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పశువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు  చేసేవారమని పార్థసారథి ఈసందర్భంగా గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి పశుగ్రాసం కొనుక్కొని కరువు జిల్లాలకు సరఫరా చేసే విధానం ఉండేదని, కానీ ఈప్రభుత్వానికి పశువుల గురించి పట్టించుకునే ప్రణాళికలేవీ లేకపోవడం బాధాకరమన్నారు. ఓ పక్క కరువు, ఇంకో పక్క నిధులు లేవంటారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి మాత్రం బ్రహ్మాండంగా వెలిగిపోతుందని చెప్పుకుంటున్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని దుయ్యబట్టారు. బాబుకు ఎంతసేపు ఏవిధంగా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుదామన్న  ధ్యాసే తప్ప ...ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రాష్ట్రంలో నెలకొన్న కరువు దృష్ట్యా నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు... మే 2న అన్ని మండల , నియోజకవర్గ కార్యాలయాల్లో  ధర్నాలు చేపడుతున్నట్లు పార్థసారథి ప్రకటించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. పార్టీ నేతలందరూ ఈధర్నాలో పాల్గొంటారని చెప్పారు.  తమ అధ్యక్షులు వైఎస్ జగన్ కూడా మే 2వ తేదీ..ఉదయం 10 నుంచి 11 వరకు మాచర్లలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.  ఇక టీడీపీలోకి వెళ్లే వారంతా తాయిలాల కోసం వెళుతున్నారు తప్ప మరొకటి లేదని పార్థసారథి ఫైరయ్యారు. 

No comments:

Post a Comment