4 March 2016

హాయ్‌ల్యాండ్.. హాంఫట్!

  


రూ.425 కోట్ల విలువైన ‘అగ్రిగోల్డ్’ భూములు చినబాబు వశం 
రాజధాని పేరుతో భారీ దోపిడీకి తెరలేపిన ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్‌ల్యాండ్ భూములే ఉదాహరణ. కోల్‌కోత-చెన్నై జాతీయ రహదారిపై మంగళగిరి మండలం చినకాకానిలో 85.13 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ కొనుగోలు చేసి హాయ్ ల్యాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఎకరం రూ.4 నుంచి రూ.4.50 కోట్ల వరకూ పలికే ఈ భూమిపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డాయి. ఆ భూములను కొట్టేయాలన్న మందస్తు ఎత్తుగడలో భాగంగా.. వాటిని రాజధాని భూసమీకరణ నుంచి తప్పించారు. తనకు సన్నిహితుడైన ఓ పోలీసు ఉన్నతాధికారిని ప్రభుత్వ పెద్ద రంగంలోకి దించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న భూములు అప్పగిస్తే కేసుల నుంచి తప్పిస్తామంటూ అగ్రిగోల్డ్ యజమానులకు రాయబారం పంపారు. అప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన అగ్రిగోల్డ్ యాజమాన్యం అందుకు అంగీకరించడంతో కేసుల నుంచి తప్పించేందుకు 32 లక్షల మంది డిపాజిట్‌దారుల ప్రయోజనాలను ప్రభుత్వ పెద్ద పణంగా పెట్టారు. టీడీపీ అధికారం చేపట్టి 21 నెలలైనా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదు. ప్రతిఫలంగా రూ.425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్‌ను చినబాబు కొట్టేశారు. హైకోర్టు ఆదేశించినా సీఐడీ విచారణను ఓ కొలిక్కి తేలేకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్ద ఒత్తిళ్లేనన్నది పోలీసు వర్గాల అభిప్రాయం.  క్విడ్ ప్రోకో అంటే ఇదీ అని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తోండటం గమనార్హం.



 
హైకోర్టు ఆగ్రహించినా...
అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కర్ణాటక, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర  రాష్ట్రాల్లోని 32 లక్షల ఖాతాదారుల నుంచి సుమారు రూ.6850 కోట్లను డిపాజిట్లను ఈ సంస్ధ సేకరించింది. ఆ డబ్బులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసింది. గడువు తీరిపోయినా అధిక శాతం మంది డిపాజిట్‌దారులకు నగదు చెల్లించకపోవడం వివాదాస్పదంగా మారింది. దాంతో ఏడు రాష్ట్రాలతోపాటూ మన రాష్ట్రంలోనూ 2014 నవంబర్ నుంచి  ఖాతాదారులు, ఏజెంట్లు ఆందోళనలకు దిగారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆగస్టు, 2015లో హైకోర్టులో బాధితులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఎక్కడ సీబీఐ విచారణకు ఆదేశిస్తుందోనని ఆందోళన చెందిన ప్రభుత్వ కీలక నేత.. తన చెప్పుచేతల్లో ఉండే సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన  మొత్తం సుమారు 16 వేల ఎకరాల భూమికి సంబంధించి కొనుగోళ్లూ, అమ్మకాలు స్థంభించిపోయాయి.

సీఐడీ దర్యాప్తు నత్తనడకన సాగుతోండటంతో ఆగస్టు, 2015లో ఉమ్మడి హైకోర్టు జోక్యం చేసుకుంది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు, ఆ సంస్థ, అనుబంధసంస్థల్లో ఉన్న డెరైక్టర్లు, భాగస్వాముల వివరాలు, వారి ఆస్తులు వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థను అదేశించింది. ఒకానొక సందర్భంలో దర్యాప్తు తీరు ఎంత మాత్రం సంతృప్తికరంగా లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని, లేని పక్షంలో తామే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి లేకుండా ఆస్తులు విక్రయించేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. పక్షం రోజుల క్రితం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎట్టకేలకు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు. కానీ.. కేసు విచారణను నీరుగార్చుతూ వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. రూ.200 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ కోసం 32 లక్షల మంది మదుపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టడంపై టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయినా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్‌కు చెందిన 14 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం గమనార్హం.

No comments:

Post a Comment