25 March 2016

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా

  • రాజకీయంగా సర్వనాశనం చేయాలని చూస్తున్నారు
  • చేయని తప్పుకు క్షమాపణ ఎలా చెబుతారు
  • అధికారపార్టీకి, మహిళకు మధ్య పోరాటం
  • టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు దూషించినా చర్యలు తీసుకోరా
  • కా.మ అని ఈనాడు కూడా రాసింది..చర్యలు ఎందుకు తీసుకోరు
  • టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన రోజా

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అధికార టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన క్లిప్పింగ్ లు వేస్తూ ఎల్లో మీడియా తనను అవమానించడంపై రోజా మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిదాలను, అరాచక పనులను ఎత్తిచూపినందుకే అసెంబ్లీ నుంచి తనను కక్షపూరితంగా సస్పెండ్ చేశారని రోజా నిప్పులు చెరిగారు.  చేయని తప్పుకు క్షమాపణ చెప్పాల్సిన పనిలేదని రోజా స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.  సస్పెన్షన్ పై న్యాయస్థానంలో న్యాయపోరాటం కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.

లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. సస్పెన్షన్ అన్నది అధికారపార్టీ పురుష అహంకారానికి, మహిళకు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంగా రోజా అభివర్ణించారు. మహిళా సమస్యల మీద పోరాడుతుంటే తట్టుకోలేకనే చంద్రబాబు తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని రోజా ఫైరయ్యారు . రికార్డ్ లు బయటకు తీస్తే..ఎవరు ప్రజాసమస్యల మీద మాట్లాడారు. ఎవరి తిట్టడమే పనిగా పెట్టుకున్నారో తెలుస్తోందన్నారు.  అధికారపార్టీ నేతలు దోషిగా తేలుతారని కుండబద్ధలు కొట్టారు. 

రాజకీయంగా తనను సర్వనాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితులకు న్యాయం జరిగేందుకు గొంతు విప్పిన తనపై అన్యాయంగా కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు దళిత మహిళా ఎమ్మెల్యేలను పావుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం ఉన్న ఇంటి దగ్గరే,  కాల్‌మనీ సెక్స్ రాకెట్ విజృంభించింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహిళలను  వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ప్రశ్నిస్తే... ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూ సస్పెండ్ చేశారన్నారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశానికి సంబంధించి 17వ తేదీన 344 కింద వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చామని రోజా పేర్కొన్నారు. 3 కోట్ల మంది మహిళలకు సంబంధించిన ఈ విషయమంమీద..చర్చ కోసం అడిగితే రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి సభలోకి వచ్చాక అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చి, దాన్ని పక్కదోవ పట్టించారని రోజా తెలిపారు. 18వ తేదీ మరోసారి ఇదే అంశంపై నోటీసు ఇచ్చామని, అంబేద్కర్ కూడా ఇలాంటి అంశంపై చర్చ సాగించాలనే చెప్పేవారని రోజా అన్నారు. మహిళను ఓటర్లుగా కాదు మనుషులుగా చూడండి అని తాము అడిగితే... అంబేద్కర్ ఆత్మ కూడా క్షోభించేలా 58 మందిని 344(2) ప్రకారం సస్పెండ్ చేశారని రోజా చెప్పారు. అదే సమయానికి అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరం చూశామన్నారు. 

No comments:

Post a Comment