1 March 2016

కేంద్రంపై ఒత్తిడి తేవటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం

  • ప్రత్యేక హోదా ప్రసక్తే లేదు
  • విభజన చట్టం హామీల ఊసే లేదు
  • బడ్జెట్ ను విశ్లేషించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజా
హైదరాబాద్: కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయమే జరిగిందని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. వార్షిక బడ్జెట్ తర్వాత ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆయన బడ్జెట్ పద్దుల్ని విశ్లేషించారు. ప్రత్యేక హోదా ఊసే లేకపోవటం, విభజన చట్టంలో హామీలను ప్రస్తావించక పోవటాన్ని ఆయన తప్పు పట్టారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివ్రద్ది కనిపించాలంటే ప్రత్యేక హోదాయే పరిష్కారం అని,  ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత కనిపిస్తోందని ఆయన అన్నారు. వివిధ రంగాల వారీగా ఆయన విశ్లేషణ ఇలా సాగింది.

       వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తున్నట్లుగా బడ్జెట్ లో చెప్పారు కానీ అధిక ప్రాధాన్యం వ్యవసాయ బీమాకు ఇస్తున్నారు అని రాజా వివరించారు. ఇది మంచిదే కానీ, దేశవ్యాప్తంగా 40 శాతం లోపు రైతులు మాత్రమే బీమా పరిధిలోకి వస్తున్నారు. మిగిలిన 60 శాతం మందికి బీమా ధీమా లేదు. అటువంటి వారిని బీమా పరిధిలోకి తెచ్చేందుకు నిర్దిష్ట మార్గాల్ని ప్రతిపాదించలేదని ఆయన విశ్లేషించారు.  దీంతో బీమా ప్రయోజనాలు దిగువ తరగతి రైతాంగానికి అందకుండా పోతాయని ఆయన అంచనా వేశారు. రైతులకు ముఖ్యంగా కావలసింది కనీస మద్దతు ధర. ఈ విషయంలో నిరాశే కనిపిస్తోంది. గత ఏడాది చూసుకొంటే వరిపంటకు రూ. 50 మాత్రమే పెంచారు. ఇది అన్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో కూడా స్పష్టత కనిపించటం లేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో సాగునీటి రంగానికి విరివిగా నిధులు ఇవ్వటం సంతోషదాయకం అని, కానీ వాటిని పరిపూర్ణంగా ఖర్చు చేసి ప్రగతి సాధించాలని సూచించారు.

       పారిశ్రామిక రంగం విషయానికి వస్తే మేకిన్ ఇండియా గురించి ఎక్కువగా చెబుతున్నారు కానీ, గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయని బుగ్గన రాజా పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లు ఉందని, అదే కాలానికి సంబంధించి పారిశ్రామిక వ్రద్ది లో 3.2 శాతం తగ్గుదల కనిపించిందని వివరించారు. ముఖ్యంగా 14 నెలల పాటు వరుసగా ఎగుమతుల రేటు క్షీణించటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

       పన్నులు, సుంకాల విధానం మీద ఎమ్మెల్యే రాజా నిరసన తెలిపారు. టాక్సులు, సర్ చార్జీలు, సెస్ లు అంటూ ప్రజానీకాన్ని పీడిస్తున్నారని మండి పడ్డారు. ఒక్క ఆటోమొబైల్ రంగాన్నే తీసుకొంటే కారుమీద రక రకాల పేరుతో సెస్ లు సర్ ఛార్జీలు వడ్డిస్తున్నారని ఇది అన్యాయమని వ్యాఖ్యానించారు. పది రకాల పన్నులు, పది రకాల వడ్డింపులతో గుంజుతున్న డబ్బంతా ఎక్కడకు పోతోందని ప్రశ్నించారు. ఒక సామాన్యుడు హోటల్ కు వెళితే తిండికి ఇచ్చేది రూ. 100 అయితే టాక్స్ ల కోసం రూ. 30..40 చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

       చరిత్రలో చూసుకొంటే ఇప్పుడు ఉన్న ఎన్డీయే ప్రభుత్వం చాలా అద్రష్టవంతమైన ప్రభుత్వం అని బుగ్గన రాజా అభివర్ణించారు. ముడిచమురు ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టిన పరిస్థితి ఉంది. అప్పట్లో ముడిచమురు 100 కు పైగా అమెరికన్ డాలర్లు ఉంటే, ఇప్పుడు 30 డాలర్లు కూడా లేదు. కానీ, వినియోగ దారునికి 10 నుంచి 20 శాతమే వస్తోంది. మిగిలిన సొమ్మంతా ఎక్కడకు పోతున్నట్లు అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలంతా దీన్ని ఒక ప్రధాన ఆదాయ వనరుగా చూసుకొంటున్నాయని రాజా వివరించారు.

బొగ్గు విషయానికి వస్తే క్లీన్ ఎనర్జీ సెస్ అని మొదలు పెట్టి రూ. 100 పెట్టారు, తర్వాత రూ. 200 చేశారు. ఇప్పుడు రూ. 400 అయిపోయింది. దీంతో పవర్ చార్జెస్ బాగా పెరిగిపోతాయి అని రాజా వర్గీకరించారు.

       బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తులు తగ్గించుకొనేందుకు రీ క్యాపిటలైజేషన్ అంటున్నారు. కానీ లక్ష కోట్ల రూపాయిల నిరర్ధక ఆస్తులు ఉంటే ఇప్పుడు ఇస్తున్న రూ. పాతిక వేల కోట్ల రూపాయిలు ఎలా సరిపోతాయని రాజా అనుమానం వ్యక్తం చేశారు. గ్రామీణులకు ఎల్పీజీ పొయ్యిలకు సబ్సిడీలు, గ్రామీణ విద్యుదీకరణ కు ఇస్తున్న సబ్సిడీలు వంటివి మంచి నిర్ణయాలు అని ఆయన అన్నారు. ఆరోగ్య బీమా మంచి పథకమే అని, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతోందని రాజా గుర్తు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, మౌళిక వసతుల మెరుగుదల వంటి పథకాలకు నిధులు పెంచటాన్ని ఆయన స్వాగతించారు.

       మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు సరైన న్యాయం కల్పించక పోవటం బాధాకరమని బుగ్గన రాజా అభిప్రాయ పడ్డారు. మిగిలిన అంశాలు చూసుకొంటే సాదా గా బడ్జెట్ ఉందని అభివర్ణించారు.

No comments:

Post a Comment