5 February 2016

తుపాకీలు, లాఠీలున్నాయని ప్రజలను భయపెట్టొద్దు

కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నాడు
బీసీలు బాబు చౌకబారు రాజకీయాలను తిప్పికొట్టాలి
ఆర్భాటాలు ఆపండి..రెచ్చగొట్టి సమస్యను జఠిలం చేయొద్దు
సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేయొద్దు
కాపుల డిమాండ్లపై ముద్రగడతో చర్చించి న్యాయం చేయాలి
ముద్రగడ దీక్షకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నాంః అంబటి

హైదరాబాద్ః మాయమాటలతో చంద్రబాబు కాపు సమాజాన్ని మోసం చేయాలని చూస్తున్నాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాపులకు సంబంధించిన డిమాండ్లపై బాబు చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని, మోసం చేయాలన్న దృక్పథంతో బాబు వ్యవహరిస్తున్నారన్నది తేటతెల్లం అవుతోందన్నారు. బీసీలను రెచ్చగొట్టి కాపులు, బీసీల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చిల్లర రాజకీయాలు మానుకోవాలని బాబుకు హితవు పలికారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నామని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

చౌకబారు రాజకీయాలను తిప్పికొట్టండి..
అర్థాంగి సమేతంగా కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష ప్రారంభించారని అంబటి చెప్పారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను పంపితే,  ముద్రగడతో చర్చలు జరిపి దీక్ష విరమింపజేస్తారన్న ఆశతో కాపులంతా ఎదురుచూశారని...కానీ అది ఓతంతుగా ముగియడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు కాపుల  సమస్యను మరింత జఠిలం చేస్తూ ...సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని, దాన్ని వేరేవాళ్లపై రుద్దాలని చూస్తున్నాడని  అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు మాసాల్లోనే కాపులకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తానంటూ ..2014 మేలో జరిగిన మహానాడులో చంద్రబాబు చెప్పారని అంబటి గుర్తుచేశారు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓవైపున కాపులను ఎగదోసే కార్యక్రమం చేస్తూ..మరోవైపున కాపులు, బీసీల మధ్య మంటపెట్టి చలికాచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలను బీసీ సోదరులు గుర్తించి, తిప్పికొట్టాలన్నారు.

ఎందుకీ ఆర్భాటం..
తూర్పుగోదావరి జిల్లాలోని పరిసర ప్రాంతాలన్నీ ఆరుగురు డీఎస్పీలు,  24 మంది సీఐలు, 50 మంది ఎస్ ఐలు, 200 మంది ఏఎస్ ఐ, 700 మంది కానిస్టేబుళ్లు, వందమంది పారామిలటరీ దళాలు, ఎస్పీ, ఐజీ, డీజీపీ పర్యవేక్షణలో ఉన్నాయని అన్నారు. అసలు  అక్కడ ఏం జరుగుతుందని ఆర్భాటం చేస్తున్నారని అంబటి ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజంగా మీకు శాంతిభద్రతల మీద చిత్తశుద్ధి ఉంటే మిలటరీ దళాలను దింపి ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. ముద్రగడకు అనుకూలంగా దీక్షలు చేస్తే కేసులు పెడతామంటూ పోలీసులు కాపులను బెదిరించడం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అన్యాయాలు చంద్రబాబుకు అనుకూలంగా జరుగుతుంటే వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు.  తుపాకీలు, లాఠీలు ఉన్నాయని దుర్వినియోగం చేయొద్దని... ఆర్భాటాలు చేయడం ఆపాలని ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీలను అంబటి   హెచ్చరించారు.  

శత్రువుగా చూడొద్దు..
కర్నాటకలో  ఓ వర్గాన్ని  ఒక్కనెలలోనే బీసీ జాబితాలో  చేర్చానని అక్కడ కమిషన్ నిర్వహించిన ద్వారకానాథ్ చెబుతుంటే...చంద్రబాబు మాత్రం 3 నెలలు, 9 మాసాలంటూ కాపులను మభ్యపెట్టి మోసగిస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన  వాగ్దానాన్నే కాపులు కోరుతున్నారని, వారు కొత్తగా ఏమీ అడగడం లేదన్నారు. ముద్రగడ నిరాహార దీక్షను విరమించేవిధంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ముద్రగడతో చర్చలు జరిపి తక్షణమే రూ. 2 వేల కోట్లు ప్రకటించడంతో పాటు, మూడు మాసాల్లోనే పూర్తిచేస్తామనే హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విషపరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.  తెలుగుదేశంలోని కాపునేతలు సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని, ముద్రగడను శత్రువుగా చూడొద్దన్నారు. 

బాబు ఆత్మవిమర్శ చేసుకో..
చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటి అని అంబటి ధ్వజమెత్తారు. కాపులు శాంతికాములు అంటూనే ..వారిపై ఎందుకు కేసులు పెడుతున్నారని, ఇంతమంది పోలీసులను ఎందుకు మొహరిస్తున్నారని ప్రశ్నించారు. ముద్రగడ చుట్టూ పోలీసులను పెడితే  సమస్య పరిష్కారం కాదని,  చర్చలకు పిలిచి వారి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.  ఎవ్వరూ కాపుల మీటింగ్ కు వెళ్లవద్దని కట్టడి చేసిన చంద్రబాబు ...మీ మంత్రులు కులమీటింగ్ లలో పాల్గొన్నప్పుడు ఎందుకు ఈపని చేయలేదన్నారు. మీకో పద్దతి, వారికో పద్దతా. ఎందకీ వివక్ష చూపుతున్నారో ఆత్మవిమర్శ  చేసుకోవాలన్నారు.

No comments:

Post a Comment