20 February 2016

తుదివరకు వైఎస్ జగన్ తోనే ఉంటాంః ఎస్వీ

టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది
అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే..
బాబు మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతున్నారు
తుదివరకు వైఎస్ జగన్ తోనే ఉంటాంః ఎస్వీ

హైదరాబాద్ః  టీడీపీ సర్కార్ కుట్ర రాజకీయాలను కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. పార్టీ మారుతున్నారంటూ  మీడియాలో వచ్చిన వార్తలను ముక్తకంఠంతో ఖండించారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేక..చంద్రబాబు మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వంపై... ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఎస్వీ అన్నారు. దానిలో భాగంగానే టీడీపీ ఇలాంటి ప్రచారాలు మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు. 

వైఎస్సార్సీపీ గుర్తుపైనే తాము గెలిచామని, తుది వరకు తాము వైఎస్ జగన్ తోనే కొనసాగుతామని ఎస్వీ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే నడుస్తామన్నారు. టీడీపీ మునిగిపోయే నావ అని...అలాంటి పార్టీలోకి ఎవరూ వెళ్లరని ఎస్వీ అన్నారు. తమను సంప్రదించకుండా ఛానల్ లో  తమ పేర్లు రాయడం సరికాదన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడం తగదన్నారు.  తమ భవిష్యత్తుకు క్వశ్చన్ మార్కు పెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇకనైనా స్క్రోలింగ్ లో వస్తున్న వార్తలను నిలిపేయాలన్నారు. 

ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించేందుకే తాము వైఎస్ జగన్ ను కలిశామని ఎస్వీ చెప్పారు.  వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పారు.  టీడీపీ తన అవినీతి ఆరోపణల నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకే... మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతోందని దుయ్యబట్టారు.  వైఎస్సార్సీపీ వీడాల్సిన అవసరం తమకు లేదన్నారు.  ప్రజలకు మొహం చూపించలేకపోతున్నామని టీడీపీ ఎమ్మెల్యేలే తమతో చెబుతున్నారని ఎస్వీ తెలిపారు. స్వార్థపరులే పార్టీని వీడుతారన్నారు. 

భూమా నాగిరెడ్డి వైఎస్సార్సీపీలోనే ఉంటారని ఎస్వీ ఘంటాపథంగా చెప్పారు.  ఆయన పార్టీ మారుతున్నట్లు ఎక్కడా ప్రకటించలేదన్నారు. ఆయనకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, పీఏసీ చైర్మన్ గా కూడా ఉన్నారని తెలియజేశారు.  పార్టీలో భూమా ఎంతో సంతృప్తిగా  ఉన్నారన్నారు. టీడీపీలోకి ఎవరినో ఒకరిని లాక్కోవాలన్న దురుద్దేశ్యంతోనే టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఎస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో చంద్రబాబు భయాందోళనతో ఉన్నారని ఎస్వీ అన్నారు. 

No comments:

Post a Comment