24 February 2016

62 మంది మా వెంట ఉన్నారు. వారు అందరికీ నా హ్యాట్సాఫ్

* కుటుంబ సభ్యులు అనుకొన్న వారినే ప్రలోభ పెట్టారు
* ఎన్ని ప్రలోభాలు పెట్టినా 62 మంది వెళ్లనేలేదు
* మా తో మిగిలిన సభ్యులకు మా హ్యాట్సాఫ్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడకుండా ప్రజల తరపున నిలిచిన 62 మంది ఎమ్మెల్యేలను అభినందిస్తున్నట్లు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ హ్యాట్సాఫ్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచపు పనుల్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన అంశాల మీద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే..!
       నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, కోట్లాది రూపాయిలు ఇచ్చి , మంత్రి పదవుల్ని ఎర చూపి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు నాయుడు చేసే పనుల్ని చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది. ఈ పనుల్ని చూస్తే బాధ అనిపించింది. బాగా దగ్గరగా ఉన్న కుటుంబసభ్యులు అనుకొన్న మనుషుల్ని ప్రలోభ పెట్టి తీసుకెళ్లటం బాధ అనిపించింది. భూమా నాగిరెడ్డి అన్న గురించి చెబుతున్నాను. అప్పట్లో శోభమ్మ చనిపోతే నా కుటుంబసభ్యులు అంతా.. మా శ్రీమతి భారతి, అమ్మ విజయమ్మ, చెల్లెలు షర్మిలమ్మ హాజరు అవటం జరిగింది. తర్వాత స్మరణ దినం రోజున కుటుంబ సభ్యులం అంతా హాజరు అయ్యాం. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఎర చూపి తీసుకొని వెళ్లారు. మంత్రులే స్వయంగా కోట్ల రూపాయిలు ఎర చూపుతున్నారు. మిగిలిన వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ప్రలోభ పెట్టేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగి ప్రయత్నించినా కేవలం నలుగురిని మాత్రమే తీసుకొని పోగలిగారు. మిగిలిన వారంతా అంటే62 మంది మా వెంట ఉన్నారు. వారు అందరికీ నా హ్యాట్సాఫ్.   ప్రలోభ పెట్టి పెట్టినా ప్రజల తరపున నిలిచిన సభ్యులు వీరంతా..!
          ఎవరైతే పార్టీ మారారో ఆ నలుగురు సభ్యులు గుండెల మీద చెయ్యి వేసుకొని మనస్సాక్షిని ఒక విషయం అడగాలి. చంద్రబాబు నాయుడు భేషరతుగా మాఫీ చేస్తానని చెప్పిన రైతుల్ని అడగాలి. మొత్తంగా 7,300 కోట్ల రూపాయిలు మాత్రమే రుణమాఫీ కి విడుదల చేశారు. వాస్తవానికి చంద్రబాబు హామీ ఇచ్చేటప్పటికే రూ. 87, 612 కోట్ల రూపాయిల అప్పులు ఉన్నాయి. దీనికి వడ్డీయే ఇప్పటికి రూ. 24 వేల కోట్ల రూపాయిలు అయింది. అటువంటప్పుడు ఈ వడ్డీ లో మూడో వంతు మాత్రమే విడుదల చేసి మాఫీ అయిపోయిందని చెబుతున్న చంద్రబాబు పార్టీలోకి వెళ్లటం ఎంత వరకు న్యాయమో ప్రజలు అడిగితే ఏం చెబుతారు.
       డ్వాక్రా అక్క చెల్లెమ్మలు అడిగితే ఏం జవాబు చెబుతారో ఆలోచించుకోవాలి. మొత్తంగా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా తప్పించుకొని తిరుగుతున్న చంద్రబాబుని నిలదీయాల్సింది పోయి అటువైపు పోతే అక్క చెల్లెమ్మలు అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెబుతారు అనేది ఆలోచించుకోవాలి. ఇటు, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. జాబులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల్ని ఊడబెరుకుతున్నారు. పూర్తిగా మోసం చేసిన చంద్రబాబు గురించి నిరుద్యోగులు అడిగితే ఏం చెబుతారు. ఇక, పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల సమయంలో ఊదర గొట్టారు. ఇప్పుడు ఊరికి రెండు ఇళ్లు కూడా కట్టి ఉండరు కదా. దీని మీద రేపు ప్రజలు అడిగితే ఏం జవాబు చెబుతారు. మంత్రి పదవులు, డబ్బుల కోసం వెళ్లిపోతే ఏం జవాబు చెబుతారు అనేది మనస్సాక్షిని అడగాల్సి ఉంటుంది.
       

No comments:

Post a Comment