1 February 2016

కాపుల ఉద్యమ ప్రస్థానం..!

* దశాబ్దాలుగా సాగుతున్న రిజర్వేషన్ ఉద్యమం
* కొంత కాలం రిజర్వేషన్లు అనుభవించిన కాపులు
* ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, తర్వాత తుంగలోకి తొక్కిన చంద్రబాబు
* రిజర్వేషన్ల అమలు కోసం కదం తొక్కుతున్న కాపులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఏర్పాటైన  సభలో పరిణామాలు చక చకా చోటుచేసుకొన్నాయి. సభ నిర్వాహకుడు ముద్రగడ పద్మనాభం పిలుపుతో రాస్తారోకో, రైలు రోకో కు కార్యకర్తలు దిగటం, పోలీసులు అడ్డుకొనే క్రమంలో ఆందోళన అదుపు తప్పటం జరిగిపోయాయి. పోలీసు స్టేషన్లు, రైళ్లు తగలబెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కాపు ఉద్యమం ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం.
కోస్తాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కాపులు బలమైన సామాజిక వర్గంగా పేరు తెచ్చుకొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ వర్గం జనాభా కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికంగా ఉన్నట్లు తేటతెల్లమైంది. అయితే జనాభా అధికంగా ఉన్నా, కాపులు మరియు సంబంధిత కులాలు అయిన బలిజ, ఒంటరి, తెలగ వంటి కులాల్లో విద్యాదికులు, ఉన్నత ఉద్యోగులు తక్కువగా ఉన్నారు. అందరి సమున్నత ప్రగతి కోసం రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
నాటి నుంచి నేటి దాకా..
వాస్తవానికి బ్రిటీష్ వారి పరిపాలనలోనే కాపులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకి గురయ్యారని గుర్తించారు. దీంతో కొన్ని రాయితీలతో కూడిన పరికల్పనలు కేటాయించారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత నీలం సంజీవరెడ్డి పరిపాలనలో వీటిని  తొలగించి ఓసీల్లో కలిపారు. తర్వాత కాలంలో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు తిరిగి బీసీ హోదా కల్పించారు. అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వీటిఅమలుకు బ్రేకులు వేసింది. తర్వాత కాలంలో దీని మీద అడపా దడపా వినతి పత్రాలు సమర్పించటం, నిలదీయటం జరుగుతూ వచ్చింది.
కానీ, 1993 లో అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం పదవికి రాజీనామా చేసికాపు ఉద్యమ బాట పట్టారు. పెద్ద ఎత్తన ఆమరణ నిరాహార దీక్షకు దిగటంతో ప్రభుత్వం దిగి వచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్ 30ని విడుదల చేసింది. కాపులతో పాటు సంబంధిత కులాలకు రిజర్వేషన్లు దక్కాయి.
        కానీ, తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దీని అమలు మూలన పడింది. చంద్రబాబు తెర వెనుక నడిపిన మంత్రాంగంతో కొందరు కాపుల రిజర్వేషన్ల మీద కోర్టుకి వెళ్లారు. దీంతో రిజర్వేషన్లకు బ్రేకులు పడ్డాయి. తర్వాత కాలంలో ఉన్నత న్యాయస్థానం ఫుల్ బెంచ్ కలగచేసుకొన్నప్పటికీ, రిజర్వేషన్లు మాత్రం అమలు కాలేదు. ఇదంతా కాల గమనంతో పాటు ఉద్యమ రూపురేఖలు మారుతూ వచ్చాయి.
చంద్రబాబు మోసం
        ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఎక్కువ భాగం ఆక్రమించిన కులాల్లో కాపులు ఒకటిగా చంద్రబాబు గుర్తించారు. దీంతో వేగంగా పావులుకదిపారు. అధికారంలోకి వస్తూనే కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ. 5వేలకోట్లనుకాపుల సమున్నత ప్రగతి కోసం కేటాయిస్తామని నమ్మబలికారు. ఈ మాటలు నమ్మి పెద్ద ఎత్తున కాపులు తమ ఓట్లను చంద్రబాబుకి వేసినట్లు ఓట్ల గణాంకాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చాక అనేక హామీలకు తూట్లు పొడిచినట్లుగానే కాపులకు వెన్నుపోటు పొడిచారు. రిజర్వేషన్ల మాట పక్కన పెట్టేశారు. కార్పొరేషన్ విషయం గాలికి వదిలేశారు.
        రోజులు, వారాలు గడిచాయి. నెలలు, సంవత్సరాలు మారుతున్నాయి. పరిస్థితి గమనించి కాపులు లోలోన కుమిలిపోసాగారు. దీంతో కాపుల రిజర్వేషన్ల అమలుకోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు రాశారు. వీటికి ఎటువంటి సమాధానం లేదు. పైగా కాపుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయించారు. దీంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ముద్రగడ పద్మనాభం తుని వేదికగా బహిరంగసభకు పిలుపు ఇచ్చారు.
సభ మీద కుట్రలు
        దీనికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయి. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న సభకు తరలి రావాలని పిలుపు ఇచ్చాయి. కానీ, ఈ సభను అడ్డుకొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు అమలుచేసింది. ఫ్లెక్సీల్ని తొలగించటం, బస్సులు అందకుండా చేయటం, తాగునీటి సదుపాయం కల్పించటానికి నిరాకరించటం వంటి చర్యలకు పాల్పడింది. అక్కడకు వెళ్లవద్దని అంతర్లీనంగా ప్రచారం చేయించింది.
        ఈ పరిణామాలపై మండిపోయిన కాపులు, ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జాతీయ రహదారి మీద రాస్తారోకో కు దిగారు. మరో వైపు రైల్వే స్టేషన్ కు దూసుకెళ్లారు. కొందరు రత్నాచల్ ఎక్సు ప్రెస్ కు, స్థానిక పోలీసు స్టేషన్ కు నిప్పు పెట్టారు. హింస ప్రజ్వరిల్లుతున్నప్పటికీ, సంయమన చర్యలు చేపట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకురాలేదు. కానీ, దీన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు అంటించేందుకు కుట్రలు చేసింది. ఈ కుటిల మంత్రాంగాన్ని వైఎస్సార్సీపీ ఖండించింది. హింస సరైన పంథా కాదని, శాంతియుతంగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చింది. అదే సమయంలో దీనికి అంతటికీ బాధ్యత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీదే అని అభివర్ణించింది. మరోవైపు కాపుల రిజర్వేషన్ ల మీద సమగ్ర నిర్ణయం కోసం సోమవారం సాయంత్రం దాకా ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇస్తూ ముద్రగడ తన ఆందోళన ని విరమించారు. 

4 comments:

  1. కాపుల పేరుతో రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకుల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. కాపుల రిజర్వేషన్లే కాదు స్త్రీల రిజర్వేషన్లు కూడా అనవసరం. పేదరికమే రిజర్వేషన్ల ప్రాతిపదిక కావాలి. కే సీ ఆర్, మోడీ ఏ రిజర్వేషన్లూ లేకుండానే నాయకులు అయ్యారు. అది గుర్తుంచుకుని మసలుకుంటే మీకే మంచిది.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. కాపులు అధికసంఖ్యలో ఉన్నారు గాబట్టి జబాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటే దామాషాని బట్టి ప్రతి కులానికీ శాతాలూ భాగహారాలూ హెచ్చవేతలూ వేసి లెక్కగట్టి అన్ని కులాలకీ ఇవ్వాల్సి ఉంటుంది - లేదంటే మొతం రిజర్వేషన్లనే ఎత్తెయ్యాలి.

    ఏదో ఒకటి జరిగేవరకూ నిద్రపోరు రగడ గాళ్ళు!

    ReplyDelete
  4. నిఘా వ్యవస్థ ఏమి చేస్తుంది? హింస జరిగే అవకాశం ఉందని వారు పసి కట్టలేకపోయారా లేదా వారి సమాచారాన్ని రాజకీయనాయకులు పట్టించుకోలేదా?

    ReplyDelete