27 January 2016

గ‌ర్జించు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. ప్ర‌త్యేక హోదా కోసం గ‌ర్జించు!

ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీ కరపత్రం ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఓ సంజీవని.   ప్ర‌త్యేక హోదాయే శ్రీ‌రామ ర‌క్ష‌. ఉద్యోగాలు, ప‌రిశ్ర‌మ‌లు, ప‌న్ను రాయితీలు అన్నీ ప్రత్యేకహోదాతోనే సాధ్యం.  ప్ర‌త్యేక హోదాతోనే వస్తువుల ధరలు స‌గానికి స‌గం త‌గ్గుతాయి. విభజనతో అడ్డంగా న‌రికిన మ‌న రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాయే ప్రాణ‌వాయువు. కాబ‌ట్టే ఆత్మాభిమానులైన అయిదు కోట్ల ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌జ‌లారా గ‌ర్జించండి... దిక్కులు పిక్క‌టిల్లేలా సింహ‌నాదాలు చేయండి.  తెలుగువాడి గ‌ర్జ‌న‌ను ఢిల్లీ వ‌ర‌కు ప్ర‌తిధ్వ‌నింప‌జేయండి.  ప్ర‌త్యేక హోదా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల హ‌క్కు.  మోసం చేస్తున్న ప్ర‌భుత్వాల‌పై పోరాడి అయినా దీన్ని సాధించుకుందాం రండి!

పార్ల‌మెంటులో ఇచ్చిన హామీకే దిక్కు లేక‌పోతే...

రాష్ట్ర విభ‌జ‌నే అన్యాయం. ఆ అన్యాయం చేస్తున్న స‌మయంలో సాక్షాత్తు దేశ పార్ల‌మెంటులో అప్ప‌టి ప్ర‌ధాని ఒక హామీ ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అయిదేళ్ళు ప్ర‌త్యేక హోదా ఇస్తాం అని కాంగ్రెస్ అంటే, కాదు ప‌దేళ్లు కావాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వ‌స్తే అయిదేళ్ళు కాదు - ప‌దేళ్ళు ప్ర‌త్యేక హోదా ఇస్తాం అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఆ పార్టీ స్ప‌ష్టం చేసింది. చంద్ర‌బాబు నాయుడు కూడా అయిదేళ్ళు చాల‌దు - ప‌దేళ్ళు కావాల‌ని ఎన్నిక‌లకు ముందు - త‌రువాత చెప్పాడు. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌లిసి రాష్ట్రాన్ని విభ‌జించేందుకు పార్ల‌మెంటులో ఇచ్చిన హామీకే దిక్కులేట్ట‌యితే... ఇక పార్ల‌మెంటుకు విశ్వ‌స‌నీయ‌త ఏముంటుంది?
లంచాల కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం సంజీవ‌ని అవుతుందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లంచాలు తీసుకుని ప‌ట్టిసీమ నుంచి పోల‌వ‌రం దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, ఎంపిక చేసిన వారికి పారిశ్రామిక రాయితీలు మొద‌లు.... కొంద‌రికే మ‌ద్యం ఉత్ప‌త్తి పెంపు లైసెన్సుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క అంశంలోనూ విచ్చ‌ల‌విడిగా పుచ్చుకున్న ముడుపుల‌తో ...వంద‌ల కోట్లు కుమ్మ‌రించి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాల‌తో స‌హా అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు నాయుడు గారికి ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా కంటే త‌న ముఖ్య‌మంత్రి హోదా ఊడ‌కుండా చూసుకోవ‌టం ముఖ్య‌మయింది. అందుకే ఆ కేసు నుంచి బ‌య‌ట ప‌డేందుకు అయిదు కోట్ల ప్ర‌జ‌లు, వారి పిల్ల‌లు, భ‌విష్య‌త్తు త‌రాల ప్ర‌యోజ‌నాల‌న్నింటినీ తాక‌ట్టుపెట్టిన విధంగా ఢిల్లీ వెళ్ళి మ‌రీ... ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని కాదు అంటూ దుర్మార్గ‌మైన ప్ర‌క‌ట‌న చేశారు.

ప్యాకేజీకి అర్థం చ‌ట్టం ప్ర‌కారం ఇవాల్సిన నిధులే కాదా?
విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప్యాకేజీకి అర్థం అప్ప‌టికే కేంద్రప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాల కోసం యాక్ట్‌లో పెట్టి మ‌న రాష్ట్రానికి ఇస్తాన‌న్న నిధులేక‌దా..? చ‌ట్ట‌ప్ర‌కారం ఇవ్వాల్సిన ఆ నిధులు మ‌న‌కు రావ‌టం మ‌న హ‌క్కు క‌దా? అవే నిధుల‌కు ప్యాకేజీ అని పేరు పెట్టి, అదేదో కొత్త‌గా తానేదో తీసుకువ‌స్తున్నాని మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం దారుణం కాదా? ఏకంగా ప్ర‌త్యేక హోదానే ప‌ణంగా పెట్ట‌టం ధర్మ‌మేనా?

ఎందుకు ఇవ్వ‌రని నిల‌దీస్తుంటే... ఎన్నో అబ‌ద్ధాలు!
18 నెల‌లు గ‌డిపోయాయి. పార్ల‌మెంటులో మాట ఇచ్చి, అప్ప‌టి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపి... ప్ర‌ణాళిక సంఘానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వండ‌ని ఉత్త‌ర్వులు జారీ చేసి... 2014 డిసెంబ‌రులో న‌రేంద్ర‌మోడీగారు ప్ర‌ణాళిక సంఘాన్ని ర‌ద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసే వ‌ర‌కు కూడా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న సిఫార‌సు ఆచ‌ర‌ణ‌కు రాకుండా 8 నెల‌లు అలాగే ప‌డి ఉంది. ఇప్పుడు 18 నెల‌లు గ‌డిచినా ప్ర‌త్యేక హోదా ఊసులేదు... ఇస్తార‌న్న ఆశ లేదు. ఏపీకి ఎన్ని అన్యాయాలు అయినా చేయ‌వ‌చ్చునన్న‌ట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కుమ్మ‌క్కు అయ్యాయి. అంత‌కు ముందు - 14వ ఆర్థిక సంఘం ప్ర‌త్యేక హోదా ఇవ్వొద్ద‌న్న‌ద‌ని అబద్ధం చెప్పారు. ఆర్థిక సంఘానికి అలా చెప్పే అధికార ప‌రిధే లేదు. ఆర్థిక సంఘం ప‌ని కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య కేంద్ర పన్నుల్ని పంప‌కం చేయ‌టం, నాన్‌ప్లాన్ గ్రాంట్స్ అండ్ లోన్‌గా పంచ‌టం. ప్లాన్ గ్రాంట్లు, ప్లాన్ డెఫిసిట్ ఇచ్చే బాధ్య‌త ఆర్థిక సంఘానికి కాదు. అదేర‌కంగా ప్ర‌త్యేక హోదా క‌లిగిన రాష్ట్రాల‌కు ఎంత మొత్తం నిధులుగా ఇవ్వాలో ఒక ఫార్ములా లేదు. నిధుల‌ను గ‌త ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక వ్య‌యం, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ప్ర‌ణాళిక నిధుల ప‌రిమాణం ఆధారంగా ఇస్తారు. కాబ‌ట్టే ఆ హోదా ఉన్న జ‌మ్మూకాశ్మీర్‌కు ఎన్నిక‌ల ముందు న‌రేంద్ర మోడీ గారు రూ. 70వేల కోట్లు గ్రాంట్‌గా ప్ర‌క‌టించారు. ఆ రాష్ట్ర జ‌నాభా కేవ‌లం 1.25 కోట్లు మాత్ర‌మే. అదే ప్ర‌త్యేక హోదాలేని రాష్ట్రాలు అయితే నిర్ధిష్ఠ గాడ్డిల్‌-ముఖ‌ర్జీ ఫార్ములా మేర‌కే నిధులు ఇస్తారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం కుద‌ర‌దంటూ కేంద్రంలో ఉన్న పెద్ద‌లు మ‌రో విచిత్ర‌మైన వాద‌న చేశారు - మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఒరిస్సాలు అడ్డుకుంటున్నాయ‌ని సాకులు చెప్పారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఈ రాష్ట్రాలు లేవా? ఇప్పుడు ఆ రాష్ట్రాలు అడ్డుకొంటున్నాయ‌న‌టం భావ్య‌మా? ఎన్డీసీ అయినా, ప్ర‌ణాళికా సంఘం అయినా, నీతి ఆయోగ్ అయినా, కేంద్ర క్యాబినెట్ అయినా... అన్నింటికీ ప్ర‌ధాన‌మంత్రే అధ్య‌క్షుడు. ప్ర‌త్యేక హోదా అన్న‌ది కేవ‌లం క్యాబినెట్ నిర్ణ‌యం. అంటే ఎగ్జిక్యూటివ్ డెసిష‌న్‌. గ‌తంలో ఏర్పాటు అయినా ఏ రాష్ట్రానికి అయినా అప్ప‌టి కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యం ద్వారానే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం జ‌రిగింది. అడ‌గాల్సింది బాబు.... ఇవ్వాల్సింది కేంద్ర మంత్రిమండ‌లి. త‌ల‌చుకుంటే ఇది చిటికెలో ప‌ని!

విద్యార్థులు, యువ‌త ఉద్య‌మించాలి!
అయినా బాబు గ‌ట్టిగా అడ‌గ‌డు... కేంద్రం ఇవ్వ‌దు! ఇదీ ప‌రిస్థితి! కాబ‌ట్టే మ‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌మే కాపాడుకునేందుకు ఉద్య‌మించాల్సిన త‌రుణం వ‌చ్చింది. ప్ర‌త్యేక హోదా ఏపీ హ‌క్కు అని దిక్కులు పిక్క‌టిల్లేలా ఉద్య‌మించి కార్యాచ‌ర‌ణ‌కు దిగాల్సిన సంద‌ర్భం వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే తొలుత విజ్ఞాప‌న‌లు, త‌రువాత మంగ‌ళ‌గిరిలో దీక్ష‌, ఆ పైన ఛ‌లో ఢిల్లీ, ఏపీ బంద్‌, శాస‌న‌స‌భ‌లో నిల‌దీత‌...
ఇలా ఈ మొద‌టి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అడుగులు వేస్తూనే వ‌చ్చింది. ప్ర‌త్యేక హోదా ఇచ్చే, తెచ్చే విష‌యంలో నిద్ర న‌టిస్తున్న వారిని ప్ర‌జ‌లే నిద్ర లేపాల్సిన స‌మ‌యం అస‌న్న‌మ‌యింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక రాష్ట్రంగా స‌గ‌ర్వంగా నిల‌బ‌డాల‌న్నా, అభివృద్ధి చెందాల‌న్నా, యువ‌త‌కు ఉద్యోగాలు రావాలన్నా కేంద్రంలో - రాష్ట్రంలో అధికారం అనుభ‌విస్తున్న పార్టీలు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కుమించిన ప్రయోజ‌నాలు ఏవీ లేవ‌ని తెలుగు ప్ర‌జ‌ల‌కు నిరూపించ‌ద‌ల‌చుకుంటే చంద్ర‌బాబు నాయుడు త‌క్ష‌ణం త‌న మంత్రుల‌తో రాజీనామా చేయించాలి. ఒత్తిడి తేవాలి. మ‌హోద్య‌మం రావాలి. 

ప్ర‌త్యేక హోదాతో మాత్ర‌మే ఇవ‌న్నీ సాధ్యం!
కేంద్ర గ్రాంట్లు 90శాతం వ‌స్తాయి
- ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు ప‌న్నుల్లో వాటాతో పాటు గ్రాంట్లు, లోన్ ద్వారా రాష్ట్రాల‌కు సొమ్ము అందుతుంది. గ్రాంట్ అంటే తిరిగి చెల్లించ‌న‌క్క‌ర‌లేని సొమ్ము. అదే లోన్ అయితే తిరిగి చెల్లించాలి.
- స్పెష‌ల్ కేట‌గిరీ లేని రాష్ట్రాల‌కు కేంద్ర ఇచ్చే గ్రాంట్లు 30శాతానికి మించి ఉండ‌వు. అంటే ఏ ప‌థ‌కం, ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా... కేంద్రం గ్రాంట్ పోనూ మిగ‌తా 70శాతం లోనుగానే వ‌స్తుంది.
- అదే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్ 90శాతం అందుతుంది. లోన్ కేవ‌లం 10శాతం ఉంటుంది.
- ఇవికాక ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు మాత్ర‌మే అద‌నంగా భారీ పారిశ్రామిక రాయితీలు ఇస్తారు.
ప్ర‌త్యేక హోదాతోనే భారీ పార‌శ్రామిక రాయితీలు...
- దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చారు. ఆ 11 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చినందునే ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు భారీగా వ‌చ్చాయి. మిగ‌తా రాష్ట్రాల‌కు అర‌కొర పారిశ్రామిక రాయితీలు ల‌భిస్తే ప్ర‌త్యేక హోదా రాష్ట్రాల‌కు అత్యంత భారీగా పారిశ్రామిక రాయితీలు ద‌క్కాయి. చంద్ర‌బాబు నాయుడు గారు ఏమంటున్నారంటే... ప్ర‌త్యేక హోదా వేరు - పారిశ్రామిక రాయితీలు వేరు అంటున్నారు. ఇది అబద్ధం. ప్ర‌త్యేక హోదా లేకుండా దేశ చ‌రిత్ర‌లో ఏ ఒక్క రాష్ట్రానికి అటువంటి భారీ పారిశ్రామిక రాయితీలు ల‌భించ‌లేదు. ఇది తెలిసీ చంద్ర‌బాబు అబద్ధాలు చెప్ప‌టం మ‌రీ దారుణం. వేల‌కొద్దీ ప‌రిశ్ర‌మ‌లు, వాటితో పాటు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు రావాల‌న్నా క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా కావాలి.
హోదా వ‌స్తే ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌... ఉద్యోగాల వెల్లువ‌
- ప్ర‌త్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక యూనిట్ల‌కు 100శాతం ఎక్సైజ్ డ్యూటీ మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఆదాయం మీద ప‌న్నులో (ఇన్‌క‌మ్ ట్యాక్స్ - ఐటి) కూడా 100 శాతం రాయితీ ల‌భిస్తుంది. ప‌న్ను మిన‌హాయింపులు, ఫ్రైట్ రీయింబ‌ర్స్‌మెంట్‌లు ద‌క్కుతాయి. ప్ర‌త్యేక హోదాతో దక్కే ఇలాంటి రాయితీలు ఉంటేనే మిగ‌తా రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పెద్ద‌పెద్ద కంపెనీల పారిశ్రామిక వేత్త‌లు రెక్క‌లు క‌ట్టుకు వ‌స్తారు. ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌స్తాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు స‌మ‌కూర‌తాయి.
- ప్లాంట్లు, యంత్రాల మీద పెట్టే పెట్టుబ‌డిలో 30శాతం రాయితీ ల‌భిస్తుంది. కొత్త‌గా ఏర్పాటయ్యే ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు, ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌న నాటికే ఏర్పాటై... ఆ త‌ర్వాత విస్త‌ర‌ణ చేప‌ట్టిన ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది.
- మ‌న రాష్ట్రంలో ఉన్న ఔత్సాహికులు సొంతంగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌డానికి ఈ నిర్ణ‌యాలు దోహ‌దం చేస్తాయి. మ‌ధ్య‌, చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు ప‌నికి వ‌స్తాయి. 
- పరిశ్ర‌మ‌ల ఏర్పాటుకు తీసుకునే వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌పై 3 శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది. 
- ప‌రిశ్ర‌మ‌లకు 20 ఏళ్ళ‌కు త‌గ్గ‌కుండా విద్యుత్ చార్జీల‌పై 50 శాతం రాయితీ ల‌భిస్తుంది.
- ఇవే కాకుండా ఇన్సూరెన్స్‌, ర‌వాణా వ్య‌యంపైనా రాయితీలు ఉంటాయి.
- కేంద్ర సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా, భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఏర్పాటు స‌మీకృత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కేంద్రాల ఏర్పాటులో పెట్టుబ‌డుల తీరును ప్ర‌త్యేక హోదా మారుస్తుంది. ప్ర‌భుత్వ రంగంలోని ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి కూడా భారీ పెట్టుబ‌డుల‌తో ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.
- సాధార‌ణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే కేంద్ర‌, రాష్ట్ర పెట్టుబ‌డుల నిష్ప‌త్తి 2:3గ‌ఆ ఉంటుంది. అదే ప్ర‌త్యేక హోదా ఉంటే 4:1 నిష్ప‌త్తిలో ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప‌దేళ్ళ ప్ర‌త్యేక హోదాతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాలూ ఒక్కో హైద‌రాబాద్‌గా రూపొందుతాయి. కంపెనీలే నిరుద్యోగుల వెంట ప‌డే ప‌రిస్థితి వ‌స్తుంది. నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ అంటూ ప్ర‌తి కంపెనీ ఎదుటూ బోర్డులు పెట్టే ప‌రిస్థితి వ‌స్తుంది. ప‌న్ను రాయితీలు, ప్రోత్సాహ‌కాల వ‌ల్ల మ‌నం కొనుగోలు చేస్తున్న అనేక వ‌స్తువుల ధ‌ర‌లు స‌గానికి స‌గం త‌గ్గే అవ‌కాశం ఉంది. ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల మీద 100 శాతం ప‌న్ను రాయితీలు ల‌భిస్తే ఏ రాష్ట్రంలోనూ ల‌భించ‌నంత చౌక‌గా మ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వ‌స్తువులు అందుతాయి.
 హోదా ఉంటే మ‌న నీటి ప్రాజెక్టుల్ని కేంద్ర‌మే క‌డుతుంది.

- యాక్సిల‌రేటెడ్ ఇరిగేష‌న్ బెనిఫిట్ ప్రోగ్రామ్‌(ఏఐబీపీ) అన‌ది కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల‌కు నిధులు ఇచ్చే కార్య‌క్ర‌మం. ప్ర‌త్యేక హోదా లేని రాష్ట్రాల‌కు ఈ ప‌థ‌కం కింద ప్రాజెక్టులు వ‌చ్చినా మ‌హా అయితే 25 నుంచి 50 శాతం నిధులు గ్రాంట్‌గా ఇస్తారు. అదే ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 90శాతం నిధుల‌ను కేంద్ర‌మే గ్రాంట్‌గా ఇస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఆంధ్రప్ర‌దేశ్ పున‌ర్ వ్య‌వ‌స్థీకర‌ణ చ‌ట్టం పేరా నంబ‌ర్ 10లో హంద్రీ-నీవా, గాలేరు-న‌గ‌రి, వంటి నీటి ప‌థ‌కాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే క‌నీసం రూ. 8వేల కోట్లు కావాలి. ప్ర‌త్యేక హోదా ఉంటేనే ఈ ప్రాజెక్టుల‌కు 90శాతం డ‌బ్బు గ్రాంట్‌గా వ‌స్తుంది.

హోదా ఉంటే మ‌న రుణాన్ని కేంద్రమే చెల్లిస్తుంది
- ఎక్స్‌ట‌ర్న‌ల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల‌కు సంబంధించి విదేశీ రుణ భారాన్ని కేంద్ర‌మే భ‌రిస్తుంది. రుణంలో 90శాతం మొత్తాన్ని కేంద్ర‌మే గ్రాంటుగా ఇస్తుంది.
- ఆ రుణంపై వ‌డ్డీ కూడా కేంద్ర‌మే క‌డుతుంది.
- ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌ప‌ట్నం-చెన్నై పారిశ్రామిక కారిడ‌ర్ ఏర్పాటుకు రూ. 5000 కోట్ల రుణాన్ని ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ నుంచి తీసుకోవాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ మెట్రో రైళ్ళ ఏర్పాటుకు దాదాపు రూ. 8 వేల కోట్లు ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా. ఈ రెండు ప్రాజెక్టుల‌కు కూడా విదేశీ ఏజెన్సీల నుంచి రుణం పొంద‌నున్నారు. ప్ర‌త్యేక హోదా ఇస్తే 90శాతం రుణాన్ని గ్రాంట్‌గా ఇవ్వ‌టంతో పాటు వ‌డ్డీ కూడా కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. విశాఖ‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, విశాఖ‌, విజ‌య‌వాడ‌(వీజీటీఎం) మెట్రో రైళ్ళు.... విభ‌జ‌న చ‌ట్టంలో హామీలే. 90 శాతం రుణం కేంద్రం భ‌రిస్తే.... విశాఖ‌-చెన్నై పారిశ్రామిక కారిడ‌ర్‌తో పాటు అన్నీ వ‌స్తాయి. ఎంద‌రో పారిశ్రామిక‌వేత్త‌లు కారిడార్ పొడ‌వునా ప‌రిశ్ర‌మ‌లు పెడ‌తారు. భారీగా ఉద్యోగాలూ వ‌స్తాయి. కారిడార్ వెంబ‌డి అనుంబంధ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి. ఉపాధి, యువ‌త ముందుకు వ‌స్తుంది. అదే ప్ర‌త్యేక హోదా లేక‌పోతే, ఈ ప్రాజెక్టుల‌న్నింటికీ కేంద్రం నిధుల్ని గ్రాంట్‌గా ఇచ్చే విష‌యం దేవుడెరుగు.... వ‌డ్డీతో స‌హా మొత్తం మ‌న రాష్ట్ర‌మే క‌ట్టాల్సి వ‌స్తుంది. అటువంటి ప‌రిస్థితుల్లో గ్రాంట్లు ఇస్తే గిస్తే... వారి ద‌య - మ‌న ప్రాప్తం!

ప్ర‌త్యేక హోదాతో ప్ర‌యోజ‌నం పొందిన రాష్ట్రాలు
ఉదాహ‌ర‌ణ‌కు ఉత్త‌రాఖండ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం వ‌ల్ల ఆ రాష్ట్రంలో 2 వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. రూ. 30వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో ఒకేసారి 130శాతం అధికంగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు కావ‌డం వ‌ల్ల ఉపాధి అవ‌కాశాలు 490 శాతం పెరిగాయి. 
- మ‌న రాష్ట్రం కంటే బాగా వెనక‌బ‌డిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఏకంగా 10వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. 
- 972 కిలోమీట‌ర్ల స‌ముద్ర‌తీరం ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్కు ప్ర‌త్యేక హోదా ల‌భిస్తే అది ఈ రాష్టం పాలిట సంజీవ‌నిగా ఉప‌యోగ‌ప‌డ‌దా?
ఇన్ని ప్ర‌యోజ‌నాలున్న ప్ర‌త్యేక హోదా మ‌న రాష్ట్రానికి రావాల‌ని అయిదు కోట్ల మంది కోరుకుంటారు. హోదా ఇవ్వం అన్న దుర్మార్గ‌పు మాట‌లు విని ఇప్ప‌టికే అయిదుగురు త‌మ జీవితాన్ని బ‌లిదానం చేశారు. అయినా, ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని కాద‌ని, అదే స‌ర్వ‌రోగ నివారిణి కాద‌ని, అది జిందా తిలిస్మాత్ కాద‌ని అధికారంలో ఉన్న నాయ‌కులు వ్యాఖ్య‌నించ‌టం అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌ను కాల‌ద‌న్న‌ట‌మే. అటువంటి దుస్సాహ‌సానికి ఒడిగ‌డుతున్న పార్టీలు, నాయ‌కులు, ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించాల్సిన స‌మ‌యం ఇది. ప్ర‌త్యేక హోదా - ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కు. అది ఇవ్వ‌టం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌!
జై తెలుగుత‌ల్లీ! జై వైఎస్సార్‌!!

No comments:

Post a Comment