18 January 2016

పచ్చసర్కార్ కుట్రలు

పచ్చసర్కార్ అరాచకాలు పెచ్చురిల్లుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు  ప్రతిపక్ష సభ్యులపై కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు.  ప్రతిపక్షాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.  ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీని అణిచేసేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు.  వైఎస్సార్సీపీ సభ్యులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ అరెస్ట్ లు చేస్తున్నారు.  ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేసినా, ఆందోళన చేసినా సహించలేకపోతున్నారు. 

వైఎస్సార్సీపీ  ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించడమే కాక లొంగిపోవడానికి వెళ్తున్న ఆయన్ను అరెస్టు చేసి జైలుకు తరలించడం అధికారపార్టీ రాజకీయ అసహనానికి పరాకాష్ట. ఒకవైపు ప్రతిపక్ష నాయకులను, ప్రజాస్వామిక ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి ....సొంతపార్టీవారు తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా వెనకేసుకొస్తున్నారు. 


ఇదంతా పచ్చబాబు పన్నాగమే...
విమానాశ్రయ మేనేజరుపై చేయి చేసుకున్నారంటూ వైఎస్సార్సీపీకి చెందిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించారు. సీసీ కెమెరాల నిరంతర నిఘా, పటిష్టమైన సీఐఎస్‌ఎఫ్ భద్రత ఉండే విమానాశ్రయంలో మేనేజర్ వంటి ఉన్నతాధికారిపై చేయి చేసుకుంటే ఎవరికీ తెలియకుండా పోతుందా? ఒకవేళ చేయిచేసుకున్నారన్న వాదనే నిజమనుకుంటే ఆ రోజు సీసీ కెమెరాల ఫుటేజిని ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు?  ‘ఈ ఘటనకు మసిపూసి మారేడు కాయ చేయడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు... ఆ ఘటన జరిగిన రోజు రాత్రి తిరుపతికి చేరుకున్న చంద్రబాబు నేరుగా పోలీసులతో మాట్లాడారు. 

రాత్రికి రాత్రి విమానాశ్రయ అధికారిని ఆసుపత్రిలో చేర్పించి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు ఫైల్ చేయించారు. మిథున్‌రెడ్డి చేయిచేసుకుని ఉంటే విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేసేవారు. కానీ చంద్రబాబు ఆదేశించిన తర్వాతనే వారు నాటకీయ పరిణామాలకు తెరలేపారు. 
 
ప్రతిపక్ష నాయకులే టార్గెట్
ప్రజా సమస్యలపై పోరాడడం, నిరసన వ్యక్తం చేయడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ విద్యుక్తధర్మం. అధికారంలో ఉన్నవారు వాటిని సహించలేకపోవడం ప్రతిపక్షంపై కత్తిగట్టడం నీచమైన పని అని మేధావులు ప్రభుత్వాన్ని తూర్పారబచ్టారు.  ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ వారిపై అనేక అక్రమ కేసులను బనాయించడం చూస్తే రాష్ర్టంలో పరిపాలన ఎలా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మచ్చుకు మరికొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే...
 
* వైఎస్సార్‌కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజాపై శాసనసభలోనూ, వెలుపలా జరిగిన దాడిని రాష్ర్టమంతా చూసింది. చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా నిబంధనలకు విరుద్ధంగా, అప్రజాస్వామికంగా రోజాను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.

* వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పలు సందర్భాలలో అనేక అక్రమ కేసులను బనాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మరో సందర్భంలో కేసు బనాయించడమే కాక రౌడీషీట్ తెరిచారు.

* వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై రకరకాల కేసులు బనాయించడమే కాక అధికారపార్టీ ప్రోద్బలంతో ఆయన వాహనాన్ని పోలీసులు తమవాహనంతో ఢీకొట్టిన ఘటన రాజకీయవర్గాలను నివ్వెరపరిచింది. ప్రాణాపాయం నుంచి ఆయన తప్పించుకున్నా తీవ్రంగా గాయపడ్డారు.

* గుంటూరుజిల్లా ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబుపై అధికారపార్టీకి చెందిన వారు దారికాచి దాడిచేశారు. కారు ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

* బాక్సైట్‌ను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యయుతంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై ముఖ్యమంత్రిని విమర్శించారన్న సాకుతో కేసు బనాయించారు.

* గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేకుండా చేయడం కోసం రకరకాల కుట్రలు సాగాయి. ఎమ్మెల్యే కొడాలి నానిపై దౌర్జన్యం చేయడమే కాక ఆయనపైనే అక్రమంగా కేసు పెట్టారు.

* బందరు పోర్టు భూసేకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి పేర్ని నానిని అరెస్టు చేసి పలు అక్రమ కేసులు బనాయించారు.

* వైఎస్సార్‌సీపీ ఎంపీపీని తెలుగుదేశం వారు హత్య చేయడానికి నిరసనగా ప్రదర్శనలు జరగనుండడంతో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి నిర్బంధించారు.

* చిత్తూరుజిల్లాకు చెందిన ప్రజాదరణ గలిగిన నాయకుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు కనుకనే మిథున్‌రెడ్డిని టార్గెట్ చేశారని పార్టీ నేతలు అంటున్నారు. 

తప్పు చేసినా తమ్ముళ్లపై చర్యలు శూన్యం 
ప్రతిపక్షనాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్న చంద్రబాబు నాయుడు తప్పు చేస్తూ సాక్ష్యాలతో సహా దొరికిపోయిన సొంత పార్టీ నేతలపై మాత్రం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఇసుక మాఫియాలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన దందాను అడ్డుకున్నారన్న కారణంగా తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేయడంతో ఆమె మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. చంద్రబాబు మాత్రం ఆ అధికారిణిదే తప్పని తేల్చారు. విజయవాడ కేంద్రంగా  కాల్‌మనీ - సెక్స్ రాకెట్‌లో సూత్రధారులు అన్ని ఆధారాలతో సహా దొరికినా అధికారపార్టీకి చెందినవారు కావడం, చంద్రబాబుకు సన్నిహితులు కావడంతో వారిపై ఎలాంటి కేసు లేదు, చర్యలు లేవు. రేయ్ చంపుతా.. పాతరేస్తా.. అంటూ అసెంబ్లీలో బండబూతులు తిట్టిన బోండా ఉమామహేశ్వరరావు వంటివారిపైనా ఎలాంటి చర్యలూ ఉండవు. 

కానీ ప్రజాసమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ సభ్యులపై మాత్రం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ లు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులాంటిదని ప్రజా, మహిళా సంఘాలు, మేధావులు, విశ్లేషకులు, ప్రతిపక్షాలు  ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. అసెంబ్లీలోనూ, వెలుపలా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలు ఇంకెంతో కాలం సాగవని వైఎస్సార్సీపీ నాయకులు 
హెచ్చరిస్తున్నారు. 

No comments:

Post a Comment