1 November 2015

పప్పులు ధరలు పెరగటానికి కారణం




సామాన్యుల అవసరాలు చంద్రబాబుకి పెద్దగా పట్టవు. అది ఆయనకు స్వతాహాగా ఉన్న లక్షణం. అందుకే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు.
 కందిపప్పు విషయమే తీసుకొంటే ప్రభుత్వం చేతకాని తనం ఏమిటో స్పష్టంగా అర్థం అవుతుంది. కందిపప్పు ధర కిలో రూ. 200 దాటి పై పైకి ఎగబాకుతోంది. ఇందుకు డిమాండ్..సప్లయి సూత్రాన్ని ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పప్పుల ధరలు పెరిగాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కానీ ఇది చాలా వాస్తవ దూరం. ఎందుకంటే మన దగ్గర కంది ని సాగుచేయటం కాస్త తగ్గిన మాట వాస్తవం. సగటున ఉత్పత్తిలో ఈ సారి 9.5 శాతం మాత్రమే తగ్గింది. అంటే మహా అయితే 10, 20 శాతం మేర ధరలో పెరుగుదల రావచ్చు. కానీ ఎకాఎకిన 70,80 రూపాయిల నుంచి 200 రూపాయిలు దాటిపోయింది అంటే 150శాతంమేర పెరుగుదలను గమనించవచ్చు. ఈ స్థాయిలో పెరుగుదలకు ఉత్పత్తి తగ్గటం అన్నది కారణం కానే కాదు.
గతంలో కందిపప్పు ధరలు పెరిగిన ప్రతీ సారి ప్రభుత్వం నుంచి ఒకటే సన్నాయి నొక్కులు.. కందుల విస్తీర్ణాన్ని ప్రోత్సహిస్తామని, సబ్సిడీ ధరలకు విత్తనాలు అందిస్తామని, రైతులకు అండగా నిలుస్తామని, తద్వారా మార్కెట్ లో కందిపప్పు రేట్లు అదుపులో ఉంచుతామని. అక్కడికీ, మార్కెట్ లో రేట్లు పెరిగిపోవటానికి రైతులే కారణం అన్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం మాత్రమే ఇది. కందులకు కనీస మద్దతు ధరను రూ.130గా నిర్ణయించి, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వుండవల్సింది. వర్షపాతం తక్కువగా ఉంటుందనే విషయాన్ని కూడా రైతులకు తెలియజేసి వుండవల్సింది. అప్పుడు రైతులు నీటి ఎద్దడిని తట్టు కునే వంగడాలనే సాగుచేసేవారు. తత్ఫలితంగా ఈ ఏడాది పప్పు ధాన్యాల ముఖ్యంగా కందిపప్పు కొరత ఉండేది కాదు. అలాగే కందులకు కనీస మద్దతు ధరను రూ.100 నుంచి రూ.130కి పెంచి వుండవల్సింది.   ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుతం కందిపప్పు ధర అమితంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.
అవునన్నా కాదన్నా కందిపప్పు రేట్లు భయంకరంగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు మాత్రమే. కందుల ఉత్పత్తి తగ్గటాన్ని గమనించిన దళారీలు గుట్టు చప్పుడు కాకుండా నల్లబజారుకి తరలించేశారు. అటు ఫ్యూచర్ మార్కెట్ పేరుతో అందుబాటులో ఉన్న  కందులు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయాయి. దీంతో సామాన్యులకు మార్కెట్లో అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా కందిపప్పు రేట్లు భగ్గుమంటున్నాయి.  
ఇటువంటి సమయంలో అధికారులతో ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసి కొరడా ఝుళిపిస్తే నల్ల బజారులేని కందులు బయటకు వస్తాయి. కందిపప్పును దాచి పెట్టిన పందికొక్కుల్ని పట్టుకోవాలి. కానీ పందికొక్కులన్నీ తెలుగుదేశం తాబేదారులవి కావటంతో ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
మహిళాతహశీల్దార్ వనజాక్షి ... ఇసుక అక్రమ రవాణాను  అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే జుట్టుపట్టి తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొట్టించారు. అంతటి దాడి చేస్తే చంద్రబాబు స్వయంగా క్యాంప్ కార్యాలయంలో కూర్చొని మహిళా అధికారిని పిలిపించి బెదిరించి పంపించారు. దీంతో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన సందేశం పంపించారు. తెలుగు తమ్ముళ్లు ఎక్కడ ఎటువంటి దందా చేసినా కన్నెత్తి చూడవద్దని పరోక్షంగా ఆదేశించారు. దీంతో ఇసుక అక్రమ మాఫియా కానీ, కందిపప్పును దాచిపెడుతున్న పందికొక్కులు కానీ హాయిగా కాలం వెళ్లదీస్తున్నాయి. అందుకే నల్ల బజారు దళారీల మీద ఎటువంటి చర్యలు లేనే లేవు.
 నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే చాలా చర్యలు తీసుకోవచ్చు. మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపి పప్పుల కొనుగోళ్లు చేపట్టవచ్చు. రేషన్ డిపోలు, రైతు బజార్ల ద్వారా ధరల్ని క్రమబద్దీకరించి పప్పుల్ని అమ్ముకోవచ్చు. కంట్రోల్ ఆర్డర్లు జారీ చేసి ధరల పెరుగుదలకు కళ్లెం వేయవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అదేమీ చేయదు. ఎందుకంటే  సామాన్యుల గురించి ఆయనకు ఎప్పుడు పట్టదు.

No comments:

Post a Comment