4 August 2015

జనం చచ్చిపోతున్నాసర్కారు మొద్దు నిద్ర

విషజ్వరాల మరణాలపై నిప్పులు చెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి
కొత్తమాజేరులో బాధిత కుటుంబాలకు పరామర్శ


కృష్ణాజిల్లా కొత్త మాజేరు గ్రామంలో జనం విషజ్వరాలతో పిట్టల్లా రాలిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా ఆ గ్రామంలో 18 మంది మరకు మరణించారని, అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ఆయన విమర్శించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో వరుసగా సంభవిస్తున్న మరణాలపై స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రామంలో మంగళవారం మద్యాహ్నం పర్యటించారు. నాలుగురోజుల వ్యవధిలో ఐదుగురు మరణించినా కూడా ఆరోగ్యశాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రికానీ ఇక్కడకు రాలేదని, వాళ్లే వచ్చి ఉంటే పరిస్థితి తీవ్రతను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే ఇంతమంది మరణించేవారు కాదని జగన్ అన్నారు. గ్రామంలో డాక్టర్లున్నా, వాళ్లు మందులు ఇస్తున్నా కూడా జ్వరాలు తగ్గక ఆ జ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మే 11న గ్రామంలో మొట్టమొదటి మరణం సంభవించింది. అప్పటి నుంచి వెంటవెంటనే ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 18 మంది మరణించారు.. కానీ ఇక్కడ ప్రజలు మరణిస్తుండడానికి కారణమేంటని ఎవరూ పట్టించుకోలేదు’’ అని జగన్ పేర్కొన్నారు. గత నాలుగు రోజుల వ్యవధిలోనే ఐదుగురు మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇంత జరుగుతున్నా ఆరోగ్యశాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ అక్కడకు వచ్చి పరిస్థితి విచారించలేదని జగన్ పేర్కొన్నారు. వాళ్లు వచ్చి ఉంటే పరిస్థితి తీవ్రత తెలిసి ఉండేదని, వెంటనే వైద్య శిబిరాలు నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంత మంది మరణించేవారు కాదని జగన్ ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం ఇచ్చే మందులు పనిచేయట్లేదని, కేవలం జ్వరాలతోనే మనుషులు చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు పట్టకపోవడం దురదృష్టకరమని జగన్ వ్యాఖ్యానించారు. అధికారులు అస్సలు పట్టించుకోలేదని, ఎమ్మార్వోను నిలదీసినా ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు జగన్‌కు వివరించారు. కలెక్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లినట్లు స్థానికుడొకరు జగన్‌కు తెలిపారు. చర్యలు తీసుకోవలసిందిగా చెబుతానన్నారని, ఎమ్మార్వో మాత్రం కంటి తుడుపు చర్యగా ఒక ఏఎన్‌ఎంని సస్పెండ్ చేశారు తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అతను వివరించాడు. ఇంత జరుగుతున్నాన ఏ మంత్రీ తమ గ్రామానికి రాలేదని, తమ గోడు పట్టించుకునేవారే లేరని స్థానికులు వివరించారు. స్థానిక ఎమ్మార్వో అదికార పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని వారు జగన్‌కు ఫిర్యాదు చేశారు.

No comments:

Post a Comment