10 August 2015

వైఎస్‌ఆర్‌సీపీ ఢిల్లీ ధర్నా విజయవంతం

28న రాష్ర్ట వ్యాప్తంగా బంద్- అసెంబ్లీనీ స్తంభింపజేస్తాం
 ధర్నాలో పకటించినవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  
 ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు గాను ఈ నెల 28వ తేదీన రాష్ర్టవ్యాప్త బంద్ పాటించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని చెప్పినపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలో ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సవ్యవసాచుల వలె విచ్చేసిన ప్రతి అన్నకు, తమ్ముడికి, ప్రతి అక్కకు చెల్లెలికి, ప్రతి అవ్వకు తాతకు శిరసు వంచి చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని జగన్ ప్రసంగం ప్రారంభించగానే శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశంపై మనకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలిపేందుకు ఢిల్లీ వీధుల్లో మన స్వరం వినిపించేందుకు వచ్చామని ఆయన తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని విభజించిన రోజే చెప్పాం. రాష్ట్రాన్ని విడగొట్టకండి అని మొత్తుకుని చెప్పాం.. 19 నెలల క్రితం రాష్ర్ట విభజనను 60శాతం మంది ప్రజలు ఒప్పుకోకపోయినా నిరంకుశంగా విభజించారు. విభజన బిల్లును వ్యతిరేకించినందుకు మమ్మల్ని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు..’’ అని జగన్ వివరించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి, పార్లమెంటు డోర్లు మూసి, లైట్లు బంద్ చేసి, మైక్‌లు, లైవ్ టెలికాస్ట్ కట్‌చేసి మరీ నాడు రాష్ర్ట పునర్విభజన బిల్లును ఆమోదింపజేశారని వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాలని అందరి కంటే ముందుగా తామే లేఖ ఇచ్చామని, రాష్ర్ట విభజన జరగాలని కోరుకున్నామని.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చెబుతోందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా స్వార్థంతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయడం లేదని ఆక్షేపించారు. 

 ప్రత్యేకహోదా ఎందుకంటే..
 మనఖర్మ ఏమిటంటే ప్రత్యేక హోదా అంటే కూడా ఏమిటో చాలా మంది నాయకులకు తెలియడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వల్ల రెండు రకాల మేళ్లు జరుగుతాయని వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రా్నకి ప్రత్యేక గ్రాంట్లు వస్తాయని, 90శాతం గ్రాంటు, 10శాతం మాత్రమే రునం అవుతుందని వివరించారు. రాష్ట్రానికి ఊరికే డబ్బిస్తారు కాబట్టి రాష్ర్టం బాగుపడే అవకాశం ఉంటుందని, అదే ప్రత్యేక హోదా లేని రాష్ర్టం అయితే గ్రాంటు కేవలం 30శాతం మాత్రమే ఉంటుందని, మిగిలినదంతా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తారని, ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ టాక్స్, ఆదాయపు పన్ను లేకుండా పరిశ్రమలు పెట్టవచ్చని జగన్ తెలిపారు. అలా అయితేనే ఉత్సాహవంతులు ముందుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పుతారని, దాంతో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని జగన్ పేర్కొన్నారు. వాటి వల్ల రాష్ర్టం అంతా బాగుపడే పరిస్థితి వస్తుందని ఆయన వివరించారు.

 14వ ఆర్థికసంఘానికి ఆ అధికారం లేదు
 14వ ఆర్థిక సంఘం నివేదిక వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని జగన్ విమర్శించారు. నిజానికి ఓ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా అనే విషయం చెప్పడానికి ఆర్థిక సంఘానికి ఏ మాత్రం అధికారం, హక్కు లేవని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను చదివి వినిపించారు. రాష్ట్రాలకు రుణాలకు సంబంధించి మాత్రమే ఫైనాన్స్ కమిషన్ ప్రమేయం ఉంటుందని వివరించారు. అది కాక ప్లాన్ లోటు గురించి గానీ, ప్లాన్ గ్రాంటు గురించి కానీ ఎలాంటి కేటాయింపు చేసే అధికారం ఫైనాన్స్ కమిషన్‌కు ఉండదని జగన్ వివరించారు. నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌డీసీ)కి మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చే లేదా ఇవ్వకపోయే అధికారం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

 చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు?
 రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించామని, కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని కోరామని, అయినా బాబు స్పందించలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపుదామని అడిగినా చంద్రబాబు స్పందించలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని తెలిసినా.. కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. మంగళగిరిలో రెండు రోజులు నిరాహార దీక్ష చేశామని, ప్రత్యేక హోదా రాదని, ఇక ఉద్యోగాలు రావన్న ఆవేదనతో మునికోటి అనే వ్యక్తి ఆత్మార్పణ చేశాడని జగన్ వివరించారు. 65మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వేలాదిమంది ప్రజలు అందరూ ఇక్కడకు వచ్చి ధర్నా చేస్తున్నారని, ఇంతమంది ఆవేదన మీకు అర్ధం కావడం లేదా చంద్రబాబూ అని జగన్ ప్రశ్నించారు.

 ఓటుకు కోట్లు కేసు నుంచి బైటపడేందుకే...
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఐదు కోట్ల రూపాయల ఆఫర్‌తో అడ్డంగా దొరికి పోయి.. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు ఆ కేసు నుంచి బైటపడేందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని జగన్ అన్నారు. అలా తన స్వార్థం కోసం రాష్ర్త ప్రయోజనాలనే తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఓటుకు కోట్లు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వీడియో, ఆడియో టేపులున్నాయని, డబ్బిస్తూ సాక్ష్యాలతో సహా పట్టుబడిన కేసులో చంద్రబాబును ఈ రోజు వరకు ఎందుకు అరెస్టు చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను మాత్రమే కాదని, బిజినెస్‌లైన్ అనే జాతీయ పత్రిక స్వయంగా అడిగిందని ఆ పత్రిక క్లిప్పింగ్‌ను జగన్ చూపించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం విచారణ జరగకుండా చూసుకునేందుకు రాష్ట్రాన్నే ఫణంగా పెట్టారని బిజినెస్‌లైన్ చెప్పిందని జగన్ వివరించారు.

 పోలవరంపై కేంద్రం గడ్డిపెట్టినా బుద్ధిరాలేదా..?
 గోదావరి ఎప్పుడు పొంగినా పోలవరం ప్రాజెక్టుతో నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, ఆ నీళ్లతో రాష్ర్టమంతా బాగుపడే అవకాశం ఉంటుందని జగన్ వివరించారు. కానీ చంద్రబాబు లంచాలు, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారని జగన్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌వర్క్ తప్ప ఏమీ జరగడం లేదని, పదేపదే దీని గురించి  ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని చంద్రబాబుకు కేంద్రం గడ్డిపెడుతూ లేఖ రాసిందని జగన్ తెలిపారు. ఎడమకాలువలో కూడా కాంట్రాక్టర్ పనులు చేయట్లేదని కేంద్రం రాసిందని, కానీ చంద్రబాబు ఇదే కాంట్రాక్టరుకు రు.290 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజె క్టు మీద నువ్వు చూపిస్తున్న శ్రద్ధ ఏంటి.. కాంట్రాక్టరు బాగోలేదని ఈరోజు గుర్తుకొచ్చిందా.. అడ్వాన్సు ఇచ్చేటపుడు గుర్తురాలేదా.. అని చంద్రబాబును జగన్ నిలదీశారు. కాంట్రాక్టులు చేసేది రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన సంస్థ కాదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో మరింత దోపిడీ జరుగుతోందని జగన్ విమర్శించారు.

 28న రాష్ర్ట బంద్
 ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, ఇకముందు మరింత ఉధృతం చేస్తామని జగన్ ప్రకటించారు. ఈనెల 28న రాష్ర్ట బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో చంద్రబాబును నిలదీస్తామని చెప్పారు. చంద్రబాబు మీడ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికే అసెంబ్లీ జరగడానికి మూడు రోజుల ముందు 28 వ తేదీన రాష్ర్టవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నామని జగన్ చెప్పారు. మధ్యాహ్నం సరిగ్గా 3.35 గంటలకు వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలసి ఆయన పార్లమెంటుకు మార్చ్‌ఫాస్ట్ చేపట్టారు. 

No comments:

Post a Comment