25 June 2015

బైటపడడానికి కేసీఆర్‌తో బాబు కుమ్మక్కు

 రాష్ర్టప్రయోజనాలు తాకట్టుపెట్టారు
 కృష్ణాజలాలు కోల్పోతున్నా మాట్లాడనిది అందుకే..
 చంద్రబాబును జనం ఛీకొడుతున్నారు
 కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు వచ్చిన స్పందనే రుజువు

 ఓటుకు కోట్లు కుంభకోణంలో అడ్డంగా ఇరుక్కున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ కేసు నుంచి బైటపడడానికి గాను ఏకంగా రాష్ర్టప్రయోజనాలనే తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలు, కృష్ణాజలాలు కోల్పోతున్నా మిన్నకుండిన వైనం వంటివాటికి నిరసనగా గురువారం రాష్ర్టవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలు విజయవంతమయ్యాయని ఆమె వివరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...
 ‘‘మోసపూరిత విధానాలు, అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో తాను రైతు వ్యతిరేకినని మరోమారు రుజువు చేసుకున్నారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గల వల్ల రైతుల జీవితాలు 20 ఏళ్ల వెనక్కి నెట్టివేసినట్లయింది. బ్యాంకుల నుంచి దర్జాగా రుణం తీసుకుని వ్యవసాయపనులు మొదలుపెట్టే రైతు ఇవాళ ప్రయివేటు వడ్డీ వ్యాపారుల దగ్గర కాళ్లావేళ్లాపడి అధిక వడ్డీలకు పెట్టుబడుల కోసం అప్పులు చేసే దుస్థితి ఇవాళ ఏపీలో చూస్తున్నాం. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల విషవలయంలోకి రైతులను నెట్టి కనీసం విత్తనాలను కూడా సమయానికి అందించలేక దాన్ని కూడా వ్యాపారమయం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరిని చూస్తున్నాం. రైతు వ్యతిరేకిగా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న అన్ని విధానాలకు నిరసనగా గురువారం నాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట విజయవంతంగా ధర్నాలు జరిగాయి. రైతులు, ప్రజలు స్పందించి ఈ ధర్నాలకు స్వచ్ఛందంగా హజరయ్యారు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్న కర్నూలు, ప్రకాశం తప్ప అన్నిజిల్లాల్లోనూ ధర్నాలు పెద్ద ఎత్తున జరిగాయి. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడలలో జరిగిన ధర్నాలకు ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. ఈ ధర్నాలు చంద్రబాబు పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టాయి. విశాఖపట్నంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తున్నా ఒక విజ్ఞాపన పత్రం తీసుకోవడానికి కూడా అక్కడ అధికారి ఎవరూ లేకపోవడం శోచనీయం. విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద స్థానిక ఏసీపీ దౌర్జన్యం చేయడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. అక్కడ ఎస్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మీద పోలీసులు జులుం ప్రదర్శించడం, అనేక మంది మహిళలను పక్కకు ఈడ్చివేసిన పద్ధతి చాలా గర్హనీయమైన అంశం. ప్రజలపైన, ప్రతిపక్ష పార్టీపైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడాదికాలంగా పాల్పడుతున్న దౌర్జన్యాలలో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నాం. పోలీసులు ప్రతిపక్ష పార్టీపైన విరుచుకుపడడం చూస్తే శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. పోలీసులకు, అధికారులకు కొమ్ములిచ్చిన చంద్రబాబునాయుడు ప్రతిపక్షాలను కుమ్మమని ఆదేశాలిస్తున్నారనేందుకు వైజాగ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనే సాక్ష్యం. ఈఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు జరిగిన ధర్నాలలో కృష్ణానదికి సంబంధించి నీటిని రాబట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందీ, ఎలా కేసీఆర్‌తో కుమ్మక్కయ్యిందీ వివరిస్తూ కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రజలను కూడా చైతన్యవంతులను చేయడం జరిగింది. బచావత్ అవార్డు ప్రకారం ఏపీ రాష్ట్రానికి రావలసిన కృష్ణా జలాల వాటాకు సంబంధించి ఇటీవల కృష్ణా వాటర్ బోర్డు సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కిమ్మనకుండా గట్టిగా వాదించకుండా మనకు రావలసిన జలాల విషయంలో నష్టం జరుగుతున్నా కూడా ఎందుకు రాజీ ధోరణితో వ్యవహరించిందనేటటువంటిది చాలా తేటతెల్లంగా ఈరోజు తెలుస్తున్న విషయం. ఓటుకు కోట్లు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన, ఒక దొంగలాగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కేసు నుంచి బైటపడడానికి కేసీఆర్‌ని మచ్చిక చేసుకోవడానికి, ఆ కేసు నుంచి సాధ్యమైనంత తక్కువ నష్టంతో బైటపడాలన్న  ఉద్దేశంతో ఏకంగా రాష్ట్రానికి నష్టం చేసే కృష్ణా జలాల విషయంలో నోరుమూసుకుని రావడం చూస్తున్నాం. కృష్ణా నీటిని పరీవాహకప్రాంతంలో ఎక్కడైనా సరే ఉపయోగించుకునేలా తెలంగాణకు కృష్ణాజలాల బోర్డు రాసిచ్చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నోరుమూసుకోవడానికి ఆయన కేసే కారణం. ఇవాళ రాజీకి రావడం కోసం చివరకు ఏపీకి నీళ్లు రాకపోయినా పరవాలేదు అనే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించినందునే ఈరోజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది. రైతులు ఒకపక్కన రుణమాఫీ అమలు కాక, విత్తనాలు దొరక్క,సాగునీరు అందక విపత్కరమైన పరిస్థితుల్లో ఉంటే టీఆర్‌ఎస్‌ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కయి కృష్ణాజలాలు కూడా దక్కకుండా చేస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు చేసిన ధర్నాలు పెద్ద ఎత్తున విజయవంతమయ్యాయి. ఈ ధర్నాలలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలందరికీ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ర్టప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. అంతేకానీ కేసుల నుంచి బైటపడడానికి గాను పక్కరాష్ర్టంతో కుమ్మక్కు కావొద్దని హెచ్చరిస్తున్నాం. ’’

No comments:

Post a Comment