22 June 2015

రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు

కృష్ణా నీటి కేటాయింపుల్లో అన్యాయం
కృష్ణా జలాల బోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. బచావత్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఒక కొలిక్కి  రాలేదు. ఏపీని రెండు ముక్కలు చేశారు. తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు చేసి 299 టీఎంసీలు వారు వారికి నచ్చిన విధంగా వాడుకోవచ్చు అని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ఇందుకు గంగిరెద్దు మాదిరిగా తల ఊపింది. కృష్ణా నదికి సంబంధించి మహారాష్ట్ర- కర్ణాటక-తెలంగాణ తరవాత మాత్రమే కృష్ణా ఆయకట్టుకు నీరు వస్తుంది. తెలంగాణ కూడా ఏపీకి ఎగువ రాష్ట్రమే అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు నీటి కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా ఉంటే అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చునని చెప్పటం అంటే అటు రాయలసీమకు, ఇటు కృష్ణా డెల్టాకు కూడా అన్యాయం జరిగినా పరవాలేదని ఏపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయటమే. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ దొరికిపోయిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌తో సంధి కుదుర్చుకునేందుకు వీలుగానే కృష్ణా నీటి బోర్డు ముందు ఏపీ వాదనల్ని బలంగా వినిపించలేదన్నది స్పష్టం అవుతూనే ఉంది. ఇది రాగల సంవత్సరాల్లో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రయోజనాలకు చావు దెబ్బగా మారబోతోంది.
 అనుమతులు లేని ‘పాలమూరు’కు అభ్యంతరం చెప్పరా?
 తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల నీటి వాడకం కోసం ప్రారంభించినా కేంద్ర జల వనరుల శాఖకు అభ్యంతరం చెప్పే బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 90 టీఎంసీల ప్రాజెక్టుమీద కనీసం అభ్యంతరం లేవదీయలేదు. ఏపీ అధికారులను చంద్రబాబు నాయుడు ముందుగానే హెచ్చరించి, ఎలాంటి అభ్యంతరాలూ లేవనెత్తవద్దని, తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉందని చెప్పినట్టుగా మొత్తం వ్యవహారం ఏపీ హక్కులను తాకట్టు పెడుతూ నడిచింది. 

No comments:

Post a Comment