23 June 2015

ఆంధ్రలోనూ ఓటుకు కోట్లు!

 ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీల కొనుగోళ్లు
 నెల్లూరు లాడ్జిలో వైశ్రాయ్ క్యాంప్
 తెలంగాణలో ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నాయకుల తీరు ఇంకా మారలేదు. ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిలో ఎలాంటి మార్పూలేదు. ఇప్పటికే ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వీడియో టేపుల్లో చిక్కుకుని జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. తీరుమారని తెలుగుదేశం నాయకులు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే విధమైన కొనుగోళ్లకు తెగబడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులను ప్రలోభపెడుతూ అడ్డంగా దొరికిపోయారు. మంత్రి నారాయణ నాయకత్వంలో స్థానిక సంస్థల ప్రతినిధులను నెల్లూరులోని ఓ హోటల్‌లో దాచిపెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు హోటల్‌ను చుట్టుముట్టి టీడీపీ నేతల కుట్రను రట్టు చేశారు. ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీకే బలం ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాగుంట శ్రీనివాసులురెడ్డి (టీడీపీ), అట్లా చిన వెంకటరెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ) పోటీపడుతున్నారు.అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కంకణం కట్టుకున్న టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను కొనడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలో ఉన్న తమతో కలవకుంటే కష్టాలు తప్పవని బెదిరిస్తూ దాదాపు 30 మంది ఎంపీటీసీలను దారిలోకి తెచ్చుకున్నారు. ఒక్కో ఎంపీటీసీకి 3 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్సుగా రు.50 వేలు ఇచ్చారు. మిగిలిన మొత్తం ఇస్తాం రమ్మని చెప్పి వారిని ప్రత్యేక వాహనాలలో తీసుకొచ్చి నెల్లూరులోని సప్తగిరి లాడ్జిలో దాచి ఉంచారు. ఈ విషయాన్ని పసిగట్టిన నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ అనుచరులతో లాడ్జికి చేరుకున్నారు. లాడ్జిలో వివిధ గదుల్లో బస చేసిన వారంతా ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలుగా గుర్తించారు. అధికార పార్టీ నేతలు తమను బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చి నిర్బంధించారని, వారి మాట వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించారని ఎంపీటీసీలు తెలిపారు. తాము పార్టీ మారబోమని, తమ గుండెల్లో వైఎస్‌ఆర్ గూడుకట్టుకుని ఉన్నారని వారు పేర్కొన్నారు. కాగా తమ కుట్ర గుట్టు బైటపడిపోవడం, ఎంపీటీసీలు దొరికిపోవడంతో తెలుగుదేశం నాయకులు పోలీసులను ఎగదోశారు. అధికార పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులను బెదిరించారు. తప్పు చేస్తున్నవారిని వదిలేసి నిలదీస్తున్న తమను బెదిరించడమేమిటని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, అనుచరులు అడ్డం తిరగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తపరిస్థితులు  నెలకొన్నాయి. తెలంగాణలో అడ్డంగా దొరికిపోయినా తెలుగుదేశం నాయకులకు బుద్ధి వచ్చినట్లు లేదని అక్కడకు చేరుకున్న జనం వ్యాఖ్యానించడం వినిపించింది. ఇంత బహిరంగంగా ప్రజాప్రతినిధులను భయపెట్టడం, ప్రలోభపెట్టడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎంతగా బరితెగించిందో అర్ధం చేసుకోవచ్చు. 

No comments:

Post a Comment