4 June 2015

బాబుకు రాళ్ల దెబ్బలే

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత ఉద్వేగ ప్రసంగం
 రెండు రోజుల సమరదీక్ష విరమణ

 మోసపూరిత హామీలతో పీఠమెక్కి జనాన్ని మోసగించిన చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ లేకుండా జనంలోకి వస్తే రాళ్లదెబ్బలు తప్పవని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. మోసం చేసినందుకు జనం ఉడికిపోతున్నారని ఆయన అన్నారు. ప్రజల గుండెల్లో కెరటంలా ఎగసిపడుతున్న అసంతృప్తి బాబును బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని జగన్ విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై సమరశంఖం పూరించి మంగళగిరి సమీపంలో రెండురోజుల పాటు జరిపిన సమరదీక్షను గురువారం జగన్ విరమించారు. ఆయన ఈ సందర్భంగా ముగింపు ఉపన్యాసం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం పూర్తిపాఠం ఇలా ఉంది... 
 ‘‘ రెండు రోజుల పాటు దీక్ష జరిగినా, కష్టమనిపించినా ఎండలు తీవ్రంగా ఉన్నా ఇక్కడకు వచ్చి చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయత చూపిస్తున్నారు. మీ అందరి ఆత్మీయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి శిరసు వంచి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ రెండు రోజుల పాటు ఇక్కడ నిరాహార దీక్ష చేశాం. దీనికన్నా ముందు విశాఖపట్నంలో ఒక భారీ ధర్నాలో నేనే పాల్గొన్నాను. రాష్ర్ట వ్యాప్తంగా 13 జిల్లాల్లో కలెక్టరేట్ల  ఎదుట ధర్నాలు జరిగాయి. ఆ తర్వాత తణుకులో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పూలేదు. ఎన్నికల ముందు ఆయన చెప్పిందేమిటి? నేడు చేస్తున్నదేమిటో మనం పరిశీలించాలి. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో గెలవడానికి ఏం చెప్పాడో ఒక్కసారి చూడండి. (సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్‌లపై  చంద్రబాబు వాగ్దానాలు, తెలుగుదేశం ప్రకటనలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ప్రసారం అయ్యాయి.) ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడుగారు చెప్పిన మాటలివి. ఊరూరూ తిరిగి చంద్రబాబునాయుడు ఇవే మాటలు చెప్పారు. ఏ టీవీ ఆన్ చేసినా కూడా వినిపించేవి ఇవే. జాబు రావాలంటే బాబు రావాలి అని వినిపించేది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు రావాలి అని వినిపించేది. రైతుల ముఖాన చిరునవ్వు కనిపించాలంటే, రైతు రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి అని వినిపించేది. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడుగారు చెప్పారు... ప్రత్యేక హోదా ఐదేళ్లేం ఖర్మ.. పదేళ్లో పదిహేనేళ్లో ఇప్పిస్తానని చెప్పారు. ఎన్నికలయిపోయాయి. సంవత్సరం దాటింది. ఇవాళ చంద్రబాబు నోటి నుంచి వస్తున్న మాటేమిటో తెలుసా?
 ఇవాళ పశ్చిమగోదావరిలో పర్యటిస్తున్న చంద్రబాబు ఒక మీటింగ్‌లో యాదృచ్ఛికంగా ఒక వ్యాఖ్య చేశారు. ఈ హామీలు నేను సమైక్య రాష్ర్టంలో ఇచ్చాను. ఇపుడు వాటిని అమలు చేయడం నావల్ల కాదు అని చేతులెత్తేశారు. ఈ హామీలన్నీ మీరు చూశారు. ఎన్నికలపుడు చంద్రబాబు ఈ హామీల గురించి చెబుతూ మీ వద్దకు వచ్చారు. వచ్చి మిమ్మల్నందరినీ ఇలానే అడిగాడు. బ్యాంకుల్లో రుణాలున్నవారందరినీ చేతులు పెకైత్తమని ఇలానే అడిగాడు.  బంగారం బ్యాంకుల్లో పెట్టిన ఆడపడుచులంతా చేతులు పెకైత్తమని ఇలా అడిగాడు. డ్వాక్రా రుణాలున్న అక్కచెల్లెమ్మలంతా చేతులు పెకైత్తండి అని ఇలా అడిగాడు.  చేతులు పెకైత్తిన తర్వాత చంద్రబాబు ఏమన్నారంటే మీ రుణాలన్నీ పూర్తిగా నెలలోపు మాఫీ చేస్తానన్నాడు. పిల్లలు ఉద్యోగాల కోసం వెతుక్కుంటా ఉంటే ఇదే చంద్రబాబు ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగమిస్తానన్నాడు. ఒకవేళ ఇవ్వలేకపోతే రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ మాటలన్నీ తానన్నాడు. రాష్ర్టం విడగొట్టిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ర్టంలో రెండు మ్యానిఫెస్టోలు విడుదల చేశారు. తెలంగాణకు ఒకటి, ఆంధ్రప్రదేశ్‌కు మరొకటి. అంతటితో ఆగలేదు. మార్చిలో మ్యానిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఏప్రిల్‌లో ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశాడు. ఆ లేఖ రాస్తూ చంద్రబాబు నాయుడు ఇలా అన్నారు. రాష్ర్టంలో వనరుల సంగతి తనకు పూర్తిగా తెలుసని, పూర్తి అవగాహనతోనే తాను ఈ హామీలు ఇచ్చాను. ఆ ప్రతి హామీని నెరవేరుస్తాను అన్నాడు. ఆ తర్వాత మేలో చంద్రబాబు నాయుడు టీవీలలో అడ్వర్టైజ్‌మెంట్లు రిలీజ్ చేశాడు. ఆ ప్రతి అడ్వర్టైజ్‌మెంటు ఇవాళ మీరు చూశారు. ఆ తర్వాత ఎన్నికల సభలకు చంద్రబాబు బయల్దేరాడు. ఆ ఎన్నికల సభల్లో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట మీరు ఇవాళ విన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడుగారు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ప్రజలతో ఇక నాకేం పనుంది? రైతన్నలతో నాకేం పనుంది? చేనేతలతో నాకేం పనుంది? డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో నాకేం పనుంది? చదువుకుని ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న ఆ పిల్లలతో నాకేం పనుంది? అని ఇవాళ చంద్రబాబు నాయుడుగారు ప్లేటు మార్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చివరకు ఏ స్థాయికి చంద్రబాబు నాయుడుగారు దిగజారి పోయారు అని అంటే... నిజంగా ఇలాంటి వ్యక్తులను చూసినపుడు రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఒక్కొక్కసారి సిగ్గుతో తలదించుకోవలసి వస్తోంది. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డిగారు బ్రతికి ఉన్నపుడు ఎపుడూ ఒక మాట అంటూ ఉండేవారు. ‘ఎన్నాళ్లు బ్రతికామన్నది కాదు ముఖ్యం. బ్రతికినన్నాళ్లు ఎలా బ్రతికామన్నదే ముఖ్యం.’ అని. ఇవాళ చంద్రబాబునాయుడుగారిని చూసినపుడు ఇదే చంద్రబాబు సెక్యూరిటీని పక్కనపెట్టి ఒక్కసారి గ్రామాలలో తిరగాలని సవాల్ విసురుతున్నా. ఇదే చంద్రబాబును రాళ్లతో కొడతారు ప్రజలు అని చెబుతున్నా. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకో అబద్దమాడుతూ పోతున్నారు.
 ఈ మధ్య ఒక విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది. మీరంతా టీవీలలో చూసే ఉంటారు. టీవీలలో చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అని ఒకాయన మీకు కనబడే ఉంటాడు. ఐదుకోట్లు లంచమిస్తూ పట్టుబడిన సంగతి మీకందరికీ కనబడే ఉంటుంది.  ఆ ఐదు కోట్లు లంచం ఇచ్చేటపుడు ఆయనేం చేశాడో తెలుసా? మా బాస్‌తో మాట్లాడిస్తానని చంద్రబాబు నాయుడితో కూడా ఫోన్‌లో మాట్లాడించాడు. ఐదు కోట్లు సరిపోకపోతే ఇంకా అడగండి ఇంకా ఎక్కువైనా మా బాస్ ఇస్తాడు అని అదే రేవంత్‌రెడ్డి చెప్పాడు. ఐదు కోట్లు డబ్బు తీసుకుపోయి ఒక ఎమ్మెల్యేని కొనడానికని చెప్పి.. అది కూడా తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేని కొనడానికి. ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి.  ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. 18 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తేనే ఒక ఎమ్మెల్సీ గెలుస్తారు. అటువంటిది ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి ఐదు కోట్లు తీసుకొనిపోయారు. ఐదు కోట్లు ఒక ఎమ్మెల్యేని కొనడానికి తీసుకుపోయారంటే 18 మంది ఎమ్మెల్యేలని కొనడానికి 90 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని నేను అడుగుతున్నా. ఆరోజు రేవంత్‌రెడ్డి లంచమిస్తూ పట్టుబడ్డాడు పోలీసులకు. పోలీసులకు పట్టుబడి చంద్రబాబుకు పూర్తిగా బట్టలిప్పేసిన పరిస్థితి కనబడతా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు విజయవాడ వచ్చాడు. చదువుకుంటున్న పిల్లలను, వాళ్లనూ వీళ్లనూ పిలిపించాడు. అందరిచేత ఆయన ప్రమాణం చేయించాడట.  అవినీతి రహిత రాష్ర్టం కోసం ప్రమాణం చేయించాడట. పేపర్లలోను, టీవీలలోనూ చూశాను. ఒక ఎమ్మెల్యేని కొనడానికి ఐదు కోట్లు ఇవ్వజూపిన నువ్వు, అవినీతిలో నిండా మునిగిన వ్యక్తివి నువ్వు అవినీతి రహిత రాష్ర్టం కోసం ప్రమాణం చేయిస్తున్నావంటే నీకన్నా సిగ్గుమాలనివాడెవడన్నా ఉంటాడా అని చంద్రబాబును నేను అడుగుతున్నా.  చంద్రబాబునాయుడు గత సంవత్సర కాలంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. చివరకు కనీసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రత్యేక హోదా అయినా తీసుకురావయ్యా చంద్రబాబూ అని గట్టిగా నిలదీశాం. ఎన్నిసార్లు తిట్టినా ఢిల్లీ వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ నసుగుతాడే తప్ప ఢిల్లీ వాళ్లను మాత్రం చంద్రబాబు ఇంగ్లీషులో మాత్రం తిట్టడు. హిందీలో మాత్రం తిట్టడు. పోనీ చంద్రబాబుకేమన్నా ఇంగ్లీషు రాదా అనుకుంటే అదీకాదు. కారణమేమిటంటే మోడీకి వినిపిస్తుంది. మోడీకి తెలిస్తే తనను ఇబ్బందులు పెడతాడు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కనీసం ఇంగ్లీషులో తిట్టే ధైర్యం కూడా లేదు.  ప్రత్యేక హోదా కోసం రాష్ర్ట ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే వనరుల్లో మనకు గ్రాంట్లు పెరుగుతాయి. దానివల్ల మనకు మేలు జరుగుతుంది. పరిశ్రమలు వస్తాయి. ఇన్‌కంటాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం. కార్పొరేట్ టాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం. ఎక్సయిజ్ డ్యూటీ బెనిఫిట్స్ ఇస్తాం. దానివల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతారు. పరిశ్రమలు పెడతారు. దానివల్ల రాష్ర్టం బాగుపడుతుంది. చంద్రబాబుకు అన్నీ తెలుసు. కానీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాటమే చేయరు.  తన మంత్రులు ఇద్దరు కేంద్రంలో కొనసాగుతూనే ఉంటారు. చంద్రబాబును నేను గట్టిగా అడుగుతున్నా. ఏమయ్యా చంద్రబాబూ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా ఆయన తన ఇద్దరు  మంత్రులను కేంద్రలోనే కొనసాగనిస్తున్నారు అని గట్టిగా అడుగుతున్నా. ఇవేవీ చంద్రబాబుకు ఎక్కవు.
 చివరకు ఏస్థాయిలో ఉంది చంద్రబాబునాయుడుగారి పరిపాలన అంటే రైతుల వద్ద నుంచి అడ్డగోలుగా నిరంకుశంగా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా భూములు లాక్కుంటాడు. నేను రాజును, నేను ముఖ్యమంత్రిని అన్నట్లు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటాడు. చంద్రబాబునాయుడుగారిని నేను అడుగుతున్నా... హైదరాబాదులో నీకున్న భూమిని, ఇల్లును, స్థలాలను ఎవరైనా లాక్కుంటే నీకు ఎలా ఉంటుందని చంద్రబాబును అడుగుతున్నా. ఆయన స్థలాలను, ఇళ్లను ఎవరూ లాక్కోకూడదు. కానీ రైతుల భూములను మూడుపంటలు పండించే పొలాలను  మాత్రం ఈయన లాక్కుంటాడు.
 చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలు చూశాం. బలవంతంగా రైతులనుంచి భూములు లాక్కోవడం చూశాం. ఒక్క విషయమైతే చెబుతున్నా... చంద్రబాబు మెడలు వంచైనా ఎన్నికల హామీలన్నీ నెరవేర్చే పరిస్థితి తీసుకువస్తాం అని చెబుతున్నా.
 ప్రజల చెవుల్లో కాలీ ఫ్లవర్లు పెట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి సీటెక్కావు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి, నీవు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేశావు కాబట్టి ప్రజలను వారి బాధలు వారిని పడమని వదిలేయడం ధర్మం కాదని గట్టిగా చెబుతున్నా. అయ్యా చంద్రబాబూ బలవంతంగా భూములు లాక్కుంటున్నావు. ఈ పరిపాలన ఎక్కువ కాలం సాగదు. రెండేళ్లుంటావో, మూడేళ్లుంటావో తెలియదు గానీ వచ్చేది మేమేనని గట్టిగా చెబుతున్నా. బలవంతంగా లాక్కున్న భూములను, దౌర్జన్యంగా నువ్వు తీసుకున్న  భూములను  రైతులకు తిరిగి వెనక్కి ఇస్తామని చెబుతున్నాం.  ఈసారి ఎన్నికలొస్తే మాత్రం చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని చెబుతున్నాం. పైనుంచి భగవంతుడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు గుండెల్లోంచి ఒక కదలిక వస్తుంది. ఒక కెరటం పుడుతుంది. ఆ కెరటం ఉవ్వెత్తున పైకి లేస్తుంది. లేచి చంద్రబాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చెబుతున్నా.
  చంద్రబాబు పరిపాలనలో ఇవాళ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చేనేతల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చదువుకున్న పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. చివరకు చదువుకుంటున్న పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నేనిక్కడకు రాకముందు అడిగా ఇంజనీరింగ్‌కాలేజీ యజమానిని. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు మీకు వచ్చాయా అని. నాలుగుకోట్ల పదిహేను లక్షలు రావాలి అని ఆయన చెప్పాడు. సంవత్సరం అయిపోయినా ఇంతవరకు రాలేదని చెప్పాడు. పిల్లలు పరీక్షలు రాశారు.. సర్టిఫికెట్ల కోసం వాళ్లు వస్తారు అని అన్నాడు. కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాలేదు కాబట్టి అవి వచ్చే వరకు ఆ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడుగారిని ఊరికే వదలం అని గట్టిగా చెబుతున్నా. చంద్రబాబునాయుడుగారిని నిద్రపోనివ్వం అని గట్టిగా చెబుతున్నా. ఈ పోరాటాలు కొనసాగుతాయి. కష్టమనిపించినా గుండెల నిండా బాధ ఉన్నా బాధలనుసైతం పక్కనపెడుతూ సంఘీభావం తెలుపుతూ మీ ఆత్మీయత చూపిస్తున్నందుకు పేరుపేరునా మరొక్కసారి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరసు వంచి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’’

No comments:

Post a Comment