16 June 2015

పరిపాలన గాలికి..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉన్నారు. సమీక్షల మీద సమీక్షలు జరుగుతున్నాయి. ఓటుకి కోట్లు కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబు.. తనను తాను బయట పడేందుకు మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల్ని, ఇతర అధికారుల్ని పిలిచి వ్యూహ రచన చేస్తున్నారు. మంత్రులు, ఇతర సీనియర్ ఉన్నతాధికారులు సైతం ఇప్పుడు ఇదే పనిలో పడ్డారు. ఇవ న్నీ సరే, ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏమిటి..!ప్రజల కష్ట నష్టాల్ని పట్టించుకొనేది ఎవరు..!

 చంద్రబాబే అసలు దొంగ..!
 ఓటుకి కోట్లు కుంభకోణంలో చంద్రబాబు  అసలు సూత్రధారి అని లోకమంతా చెబుతోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డబ్బు ఇవ్వచూపుతూ దొరికి పోయినప్పటి నుంచి పలువురు ప్రముఖులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. చంద్రబాబు మాట్లాడారంటూ ఆడియో టేపులు విడుదల అయ్యాక అందరి వైఖరిలోనూ స్పష్టత వచ్చేసింది. రేవంత్ రెడ్డి ని తాను పంపించలేదని కానీ, బేరసారాలు తాను జరపలేదని కానీ చెప్పకుండా చంద్రబాబు ముందుకు వెళ్లడం గమనించాల్సిన విషయం. మొత్తం మీద ఈ కుంభకోణం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినది. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఈ కుంభకోణానికి సూత్రధారిగా నిలిచారు... ఈ వ్యవహారాన్ని ఆయనే స్వయంగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం నడిపించారని అర్థం అవుతోంది.

 తెలుగుదేశం అధ్యక్షుడిగా పాత్ర
 న్యాయ శాస్త్ర లెక్కల ప్రకారం నేరం చేసినప్పుడు సద రు నిందితుడి ఉద్దేశ్యానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కావాలి. తెలంగాణ లో పార్టీ ప్రయోజనాల కోసం ఆయన ఈ కుంభకోణాన్ని నడిపించారనే మాట వినిపిస్తోంది. అటువంటప్పుడు ఈ కేసులో ఎలా వ్యవహరించాలి లేదా ఈ కేసునుంచి ఎలా బయట పడాలన్నది చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత వ్యవహారం. అంతేకానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అంశం కానే కాదు.

 చంద్రబాబు వ్యవహార శైలి
 తెలుగుదేశం అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు మాత్రం ఈ కేసును ప్రభుత్వం వ్యవహారంగా మార్చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. పదే పదే తాను ముఖ్యమంత్రిని, తాను ముఖ్యమంత్రిని అని చెప్పుకొని వస్తున్నారు. నా దగ్గర పోలీస్ ఉంది, నా దగ్గర ఏసీబీ ఉంది అని ప్రకటిస్తున్నారు. అంతే కాకుండా ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించుకొని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఏ విధంగా స్పందించాలి, ఏ రకంగా బయట పడాలి అనే దానిపై చర్చలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను కుంభకోణంలో ఇరుక్కొంటే, దాని మీద పరిష్కారాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగిస్తున్నారు.

 మంత్రులు, ఉన్నతాధికారులు అదే బాటలో..!
 ఇప్పుడు మంత్రులు, ఉన్నతాధికారులు చంద్రబాబు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. చంద్రబాబుతో సమావేశాలన్నీ ఈ కుంభకోణం నుంచి ఎలా బయట పడాలి అనే దానిమీదనే జరుగుతున్నాయి. రక రకాల సమాచారాలు తెప్పిస్తున్నారు, రక రకాల విశ్లేషణలు అందిస్తున్నారు. ఇక్కడ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పనుల్లో ఉంటే ఇతర రకాల పరిపాలన విభాగాల్ని గాలికి వదిలేశారు. దీంతో ఇతర రకాల వ్యవహారాలన్నీ మూలన పడ్డాయి.

 రైతుల పరిస్థితి ఇరకాటంలో..!
  ఒకవైపు  ఖరీఫ్ ముంచుకొని వస్తోంది. రైతులకు విత్తనాలు దొరకటం లేదు. ఖరీఫ్ కు ముందు సన్నాహక సమావేశాలు నిర్వహించటం ఆనవాయితీ. వ్యవసాయ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. విత్తనాలు, సబ్సిడీలు, ఎరువుల సరఫరా, ఇతర రకాల అవసరాల్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతులకు అప్పులు ఇవ్వాల్సిన బ్యాంకర్లను సమాయత్త పరచటం జరగుతూ ఉంటుంది. అప్పుడే రైతులు సజావుగా ఖరీఫ్ కు సిద్ద పడగలుగుతారు.

 వ్యవసాయ మంత్రి దృష్టంతా అటు వైపే..!
 ఇక్కడ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురించి చెప్పుకోవాలి. ఏ ముహుర్తాన గుంటూరు జిల్లాలో రాజధాని ప్రకటించారో కానీ, అప్పటి నుంచి మంత్రి పుల్లారావు పూర్తిగా రాజధాని మంత్రిగా మారిపోయారు. అక్కడ రైతుల నుంచి భూములు ఎలా లాక్కోవాలి, ఏ విధంగా వ్యవసాయాన్ని నాశనం చేయాలి అనే దానిమీదనే దృష్టిని కేంద్రీకరించారు. అన్ని రకాలుగా రైతుల్ని భయపెట్టి, ఆందోళనకు గురి చేసి భూములు లాక్కొనేందుకు ప్రయత్నించారు. వ్యవసాయ మంత్రి దృష్టి పూర్తిగా భూముల అక్రమణ మీద ఉండటంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా అదే బాటలో నడిచారు. వ్యవసాయాన్ని , రైతుల్ని అలాగే గాలికి వదిలేశారు. ఒక వైపు రుణమాఫీ జరగక, బ్యాంకులు రుణాలు ఇవ్వక రైతులు అల్లాడిపోతున్నారు. విత్తనాలు అందక ఆందోళన చెందుతున్నారు. వీరికి తక్షణ పరిష్కారం చూపేందుకు కూడా రైతులు సిద్దంగా లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

 మొత్తం యంత్రాంగం కుంభకోణం చుట్టూనే..!
 ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కుంభకోణం వైపే మోహరించి ఉంది. ఓటుకి కోట్లు కుంభకోణాన్ని పూర్తిగా ప్రభుత్వ పరమైన అంశంగా మార్చేశారు. రైతుల గురించి ఆలోచించాల్సిన వ్యవసాయ మంత్రి ఎంతసేపూ చంద్రబాబును కేసు నుంచి కాపాడటం మీద దృష్టి పెడుతున్నారు. పాఠశాలలు, కాలేజీలు తె రిచే సమయం అయినప్పటికీ విద్యా మంత్రి ఆ విషయాలు పట్టించుకోరు. ఈ కుంభకోణాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. హోమ్ శాఖ పూర్తిగా కుంభకోణం అంశంలో మునిగిపోయింది. న్యాయ నిపుణుల్ని రప్పించి పథక రచన చేస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం ముగుస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలకు అందించాల్సిన వనరుల గురించి ఆర్థిక మంత్రి చూసుకోవాలి.  ఆ పనిని పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి కేసు గురించి ప్రకటనలు ఇస్తూ గడిపేస్తున్నారని విమర్శ వినిపిస్తోంది. ఇక కార్మిక శాఖ మంత్రి అయితే ఇదే అదనుగా ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేసేందుకు పడిగాపులు కాస్తున్నారని సమాచారం.
  మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడి సొంత వ్యవహారంలో కూరుకొని పోవటంతో ప్రభుత్వ పాలన కుంటుపడుతోంది. దీంతో ప్రజల కష్టాలు, నష్టాలు పట్టించుకొనే నాథుడు కరవయ్యాడు.

No comments:

Post a Comment