3 June 2015

బాబు మోసాలపై ప్రజాబ్యాలెట్


హామీలన్నీ తుంగలో తొక్కారు..
 ప్రజలను కడగండ్ల పాల్జేశారు..
 ఏడాదిలో రాష్ట్రాన్ని మరింత దిగజార్చారు
 అందుకే చంద్రబాబును నిలదీస్తున్నాం..
 నిప్పులు చెరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 
 మంగళగిరి వేదికగా సమరదీక్ష ఆరంభం

 మోసపోయిన రైతులు ఆత్మహత్యలు ఆశ్రయిస్తున్నారు..
 కత్తి లేకుండానే డ్వాక్రా మహిళలకు బాబు వెన్నుపోటు
 నిరుద్యోగులకు శఠగోపం.. ఉన్న ఉద్యోగాలకు మంగళం
 రాజధాని కావాలి.. కానీ రైతుల సమాధులపై కాదు...
 ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్రంలో తెలుగుదేశం మంత్రులెందుకు?

 చంద్రబాబునాయుడు ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, పైగా అన్ని వర్గాల వారూ అనేక అగచాట్లు పడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అనేక బూటకపు హామీలిచ్చి చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చారని, ఆ తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలలో మచ్చుకు వంద హామీలు తీసి వాటితో ఒక బ్యాలెట్ పత్రాన్ని రూపొందించామని, ప్రజలందరూ ఆ బ్యాలెట్ పత్రంలోని అంశాలలో చంద్రబాబు ఎన్ని నెరవేర్చారో గుర్తించాలని కోరారు. చంద్రబాబుకు వందమార్కుల్లో ఎన్ని మార్కులు వస్తాయో చూద్దామని ఆయన అన్నారు. ఎన్నికలకుముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరుజిల్లా మంగళగిరి వై జంక్షన్ సమీపంలో బుధవారం దీక్ష చేపట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షకు కూర్చున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వేదికపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు కూడా ఉన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్షలో చేసిన ప్రసంగం పూర్తి పాఠం ఆయన మాటల్లోనే.......
 ‘‘ఈరోజు ఇక్కడ ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామన్న సంగతి ఇక్కడికి అశేషంగా విచ్చేసిన ఇన్నివేల మంది అందరికీ తెలుసు. మండుటెండలను ఖాతరు చేయకుండా దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో మీరు ఎందుకు పాలు పంచుకుంటున్నారనేది రాష్ర్ట వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. కానీ ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం తెలియదు. ఆ వ్యక్తి ఎవరు అంటే.. చంద్రబాబునాయుడుగారు. ఇవాళ ఈ రాష్ర్టంలో చంద్రబాబు నాయుడుగారు ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఏమిటి? ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబునాయుడుగారు చేస్తున్నది ఏమిటి? అన్నది రాష్ర్టంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. రాష్ర్టంలో ఇవాళ రైతన్నలు బాధ పడతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయిన పరిస్థితుల్లో రైతన్నలు పడుతున్న అవస్థలు, అగచాట్లు అన్నీఇన్నీ కావు. చివరకు ఆత్మహత్యలు చేసుకునే దశకు రైతన్నల దుస్థితి దిగజారిపోయింది. ఎన్నికల వేళ చంద్రబాబు మాటలు నమ్మిన డ్వాక్రా అక్కచెల్లెమ్మలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పట్టపగలు ఏ కత్తీ లేకుండా ఈ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికలకు ముందు ఏ మీటింగ్‌లో విన్నా, ఏ టీవీలో చూసినా కనిపించిందేమిటంటే.. జాబు కావాలంటే బాబు రావాలి.. అని. ఇవాళ బాబు వచ్చి ఒక సంవత్సరం దాటిపోయింది. కొత్త జాబులిచ్చే మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలనే ఊడబీకే కార్యక్రమం జరుగుతోంది. ఉద్యోగమివ్వడంలో ఆలస్యం జరుగుతోంది... రెండువేల రూపాయలు ప్రతి నిరుద్యోగికీ భృతి కింద ఇస్తానన్నావు.. రాష్ర్టంలో కోటీ డెబ్బయి లక్షల ఇళ్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అయినా ఎప్పటి నుంచి ఇస్తావు చంద్రబాబూ అని గట్టిగా నిలదీసే రోజు ఈరోజు.  మన రాష్ట్రాన్ని విభజించే రోజున ఓటు వేసి మరీ చంద్రబాబు మనకు ఇచ్చిన హామీ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తానని. ప్రత్యేక హోదా గురించి చట్టంలో చేర్చక ముందే విభజనకు అనుకూలంగా ఓటువేసి రాష్ట్రాన్ని విడగొట్టిచ్చినవాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని కేంద్రాన్ని చంద్రబాబు గట్టిగా నిలదీయలేకపోతున్నారు. చంద్రబాబును ఈ వేదిక సాక్షిగా గట్టిగా నిలదీస్తున్నాం... అయ్యా చంద్రబాబూ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనపుడు కేంద్రంలో మంత్రులుగా మీ పార్టీ వారిని ఎందుకు కొనసాగనిస్తున్నావు... అని గట్టిగా నిలదీస్తున్నాం. రాజధానిపై కూడా చంద్రబాబును గట్టిగా నిలదీసి అడుగుతున్నాం. రాజధాని కావాలనేది అందరూ కోరుకుంటున్న అంశమే. కానీ రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న వికట చర్యలను మేం వ్యతిరేకిస్తున్నాం. రాజధాని కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కోవడాన్ని ఈ వేదిక సాక్షిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఐదు అంశాల మీద చంద్రబాబు నాయుడును నిలదీస్తున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది కాలంగా ఈ  రాష్ట్రానికి ఎలాంటి మంచి జరగక పోగా రాష్ర్టం చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉంది అని తెలియజేస్తూ చంద్రబాబునాయుడుపై పోరాటం కోసం ఈ దీక్షకు సమరదీక్షగా నామకరణం చేశాం. చంద్రబాబు ఏడాది పాలనపై ఓ బ్యాలెట్ పేపర్ విడుదల చేస్తున్నాం. ఈ బ్యాలెట్ పేపరుపై ప్రజలే చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి హోదాపై ఎన్ని మార్కులు వేస్తారు అనేది ప్రజలకే విడిచిపెడుతున్నా. ప్రజాబ్యాలెట్ పేపరును మీకందరకూ పంచిపెడుతున్నా. ప్రజల ఓట్లను పొందడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో మచ్చుకు వంద తీసుకున్నాం. ఇందులో చంద్రబాబునాయుడు చేసినవెన్ని? చేయనివెన్ని తేల్చేందుకు ప్రజలకే అవకాశమిస్తున్నాం. ఈ ప్రజా బ్యాలెట్ ఇక్కడకు వచ్చిన అవ్వాతాతలకు, అక్కాచెల్లెమ్మలకు, సోదరులకు, స్నేహితులకే కాకుండా రాష్ర్టంలో ప్రజలందరికీ చేరువ కావాలని కోరుతున్నా. పత్రికల ద్వారా, చానళ్ల ద్వారా ఈ ప్రజా బ్యాలెట్‌ను ప్రజలందరికీ చేర్చాలని మీడియా అధిపతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు చంద్రబాబు పాలన మీద ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాం. వంద ప్రశ్నలకు సమాధానాలు వచ్చిన తర్వాత చంద్రబాబుకు ఎన్ని మార్కులు వచ్చాయో మీరే కూడండి. చంద్రబాబునాయుడుకు బుద్ది వచ్చేట్టుగా, గడ్డిపెట్టేట్టుగా మీరు ఈ బ్యాలెట్‌లో మార్కులు వేసి తెలియజేయండి. మిగిలిన విషయాలు రేపు ముగింపు సభ సందర్భంగా మాట్లాడుకుందాం. ఈ రోజు దీక్ష ప్రారంభానికి కాస్త ఆలస్యమైనా ఏ ఒక్కరి ముఖంలో కూడా చిరాకనేది కనిపించడం లేదు. చిరునవ్వులతో ఆత్మీయతను పంచిపెడుతున్నందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమాభిమానాలకు ఆత్మీయతలకు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.’’

No comments:

Post a Comment