20 June 2015

బాబు వచ్చారు.. జాబులు పోతున్నాయ్..

బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఊదరగొట్టాడు. ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కాడు. జాబులు వచ్చే సంగతి అలా ఉంచితే ఉన్న జాబులను ఊడగొడుతున్నాడు. జాబులు ఊడబీకే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది. చంద్రబాబును ఎన్నుకుని ఎంత తప్పు చేశామో అని అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగాలు పోతున్నవారు వాపోతున్నారు.
  వైఎస్‌ఆర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని ఎన్‌పీఎం సీఎంఎస్‌ఏ (పురుగుమందులు లేని వ్యవసాయం) విభాగంలో జిల్లా వ్యాప్తంగా 812 మందికి ఒక్కసారిగా ఉద్వాసన పలికారు. క్షేత్రస్థాయిలో 575మంది వీఏలు, 115 మంది సీఏలు, కమిటీకి చెందిన 115 మంది, ఏడుగురు ఆపరేటర్ల ఉద్యోగాలను ఊడబీకారు. వీరంతా 2006 నుంచి ఈ విభాగంలో పనిచేస్తున్నారు. సెర్ఫ్ సీఎంఎస్ డెరైక్టర్ సుధాకర్ సెల్ నుంచి ‘మీ సేవలు ఇక చాలు’ అని మెస్సేజ్ వచ్చిందట. ఆ వెంటనే వీరి ఉద్యోగాలు పోయాయి. పై స్థాయిలో నిర్ణయం తీసుకోబట్టే తమ ఉద్యోగాలు పోయాయని వారు వాపోతున్నారు. ఏప్రిల్22 నుంచి ఉద్యోగాల కోసం వీరంతా ఆందోళన చేస్తూనే ఉన్నారు. శుక్రవారంనాడు కడప నగరంలోని ప్రెస్‌క్లబ్ వద్ద వారు ఆందోళన చేశారు. మీడియా ప్రతినిధులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం జరక్కపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. క్షేత్రస్థాయిలో పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, పొలంబడుల ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వడం, అంతర పంట సాగుపై మెళకువలు అందించడం, వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసి రైతులను చైతన్యవంతులను చేయడం వీరి బాధ్యతలు. అన్నదాతలకు అందుబాటులో ఉంటూ సాగు సమస్యలను తీర్చడం వంటి కీలకమైన బాధ్యతలు వీరు నిర్వర్తించారు. ఎలాంటి ముందు హెచ్చరికలు లేకుండా కనీసం నోటీసైనా ఇవ్వకుండా తమను ఒక్క సెల్ మెస్సేజ్‌తో ఇంటికి పంపించడం ఎంత అన్యాయమో అని వారు వాపోతున్నారు. చంద్రబాబు నాయుడికి వ్యవసాయం పట్ల ఎంతటి చిన్నచూపు ఉందో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ. పైగా గడచిన ఏడాది కాలంగా వీరికి వేతనాలు అందడం లేదు. చంద్రబాబు పీఠం ఎక్కిన తర్వాత వీరికి జీతాలు ఆగిపోయాయి. తొలగించేముందు వేతన బకాయిలు చెల్లించడం కనీస మర్యాద. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ మర్యాదను కూడా పాటించలేదు. వారంతా నిరుపేదలు. చాలీచాలని జీతాలతో ఎలాగోలా ఆ ఉద్యోగాలను చేసుకుంటూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. అలాంటిది వారిని ఉన్నఫళంగా తొలగించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 812 కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఒక్కొక్క ఉద్యోగికీ రు.50 వేలకు పైనే వేతన బకాయిలు ఉన్నాయట. వాటిని చెల్లించాలంటూ డీఆర్‌డీఏ పీడీకి ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. తమకు ఎలాంటి ప్రత్యామ్నాయమూ చూపించకుండా ఇలా రోడ్డున పడేయడం ఎంత వరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఇవే విభాగాలను కొనసాగిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చంద్రబాబు ప్రభుత్వ వేటు వేసింది. ఇప్పటికైనా రాష్ర్టప్రభుత్వం కళ్లు తెరిచి తమ కుటుంబాలను ఆదుకోవాలని లేదంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment