16 June 2015

ఆంధ్రలో మీడియాకు సంకెళ్లు

 హైదరాబాద్ : కొంతకాలం క్రితం టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించినపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వీధుల్లో వీరంగం వేశారు. మీడియా స్వేచ్ఛకు తానే పెద్ద ఛాంపియన్ అన్నట్లు పోజు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రానికి కంప్లయింట్ చేసివచ్చారు. అలాంటి చంద్రబాబు ఎన్‌టీవీపై నిషేధం విధించి ఇపుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు.
  ఎన్‌టీవీ న్యూస్ ఛానల్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నిషేధం విధించిన చంద్రబాబు నాయుడు మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ఓటుకు నోటు కేసులో తమకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నదన్న దుగ్ధతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీవీ ప్రసారాలను నిలిపేశారు. రాష్ర్టంలోని 13 జిల్లాలలో కేబుల్ ఆపరేటర్లు ఎన్‌టీవీ ప్రసారాలను ఆపేశారు. శనివారం ఉదయం నుంచే చాలా జిల్లాల్లో ప్రసారాలు నిలిచిపోయాయి. ముందుగా పట్టణ ప్రాంతాలలో ప్రసారాలు ఆగిపోయాయి. ఆ తర్వాత గ్రామాల్లోనూ ఎన్‌టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి.  కేవలం డిష్ టీవీలలో మాత్రమే ఈ చానల్ ప్రసారాలు కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలలో 30శాతం డిష్‌టీవీలుంటాయని అంచనా. మిగిలిన వన్నీ కేబుల్ ప్రసారాలపైనే ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(ఎపీజెఎఫ్), జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జెఏఏపీ)లు మీడియాకు సంకెళ్లు వేయాలన్న చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఏదో సాంకేతిక సమస్య రావడం వల్లనే ఎన్‌టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి తప్ప తమపై ప్రభుత్వం నుంచి వత్తిళ్లు రావడం వల్ల తాము ప్రసారాలు నిలిపివేశామన్న ఆరోపణలలో నిజం లేదని మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎంఎస్‌ఓలు) అసోసియేషన్ అధ్యక్షుడు పొట్లూరి సాయిబాబు అన్నారు. అయితే అది నిజం కాదని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఎంఎస్‌ఓలపై వత్తిడి తీసుకువచ్చారని, అందుకే ఎన్‌టీవీ ప్రసారాలు ఆగిపోయాయని అంటున్నారు. ఎన్‌టీవీ ప్రసారాలను నిలిపేయకుంటే తీవ్రపరిణామాలెదురౌతాయని, భారీగా పన్నులు వేస్తామని ఎంఎస్‌ఓలను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు హెచ్చరించారని వినిపిస్తోంది.
  {పముఖ పారిశ్రామికవేత్త, మైహోమ్స్ అధిపతి జూపల్లి రామేశ్వరరావు ఇటీవలే ఎన్‌టీవీలో 11శాతం వాటా కొన్నారని, ఆయన కేసీఆర్‌కు సన్నిహితుడు కాబట్టి చంద్రబాబుకు ఎన్‌టీవీపై కోపం వచ్చిందని అంటున్నారు.
  నిజానికి చంద్రబాబు తనకు వ్యతిరేకంగా ఉండే పత్రికలు, చానళ్లను అస్సలు సహించరు. సాక్షి చానల్, సాక్షి దినపత్రికలపై చాలా కాలంగా కొనసాగుతున్న నిషేధమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు సాక్షి చానల్, సాక్షి పత్రికల ప్రతినిధులను ఇప్పటికీ అనుమతించడం లేదు. ప్రెస్ కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్ వంటివి అభిశంసించినా చంద్రబాబుకు చీమైనా కుట్టడం లేదు. రాష్ర్ట ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా సాక్షిని తొలుత అనుమతించేవారు కాదు. అయితే కోర్టు జోక్యం తర్వాత అధికారిక కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు సాక్షిని అనుమతిస్తున్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి చానల్ ప్రసారాలను కూడా నిషేధించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని సమాచారం. 

No comments:

Post a Comment