15 June 2015

ఇదేమి అనుభవం బాబూ..


 ఖరీఫ్‌కి ఏర్పాట్లేవి?.... విత్తనాల కోసం అన్నదాతల అవస్థలు
 చంద్రబాబు రావాలి.. కష్టాలు తీరాలి... ఆయనొస్తున్నాడు... మన బాధలన్నీ మాయం చేస్తాడు.. బీదాబిక్కీతో ఇలాంటి మాటలు చెప్పిస్తూ ఎన్నికల ముందు తెలుగుదేశం అధినాయకుడు టీవీల్లో ఎన్నో ప్రకటనలు ప్రచారం చేయించాడు.. ‘‘నాకు అనుభవం ఉంది.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...’’ స్వయంగా చంద్రబాబు కూడా ప్రచారంలో ఊదరగొట్టాడు... ఎలాగైతేనేం ‘అనుభవజ్ఞుడైన చంద్రబాబు’ పీఠమెక్కాడు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కష్టాలు తీరలేదు సరికదా... రెట్టింపయ్యాయి. అన్ని వర్గాల ప్రజలదీ అదేమాట.
  ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతోనే అన్నదాతల కష్టాలు కూడా రెట్టింపయ్యాయి. విత్తనాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు అధికారులతో సమావేశాలు జరిపి అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిన ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలలో కూరుకుపోయి  బైటపడే మార్గాల కోసం ప్రతిరోజూ పోలీసు, నిఘా విభాగ అధికారులతో సమావేశాలలో తలమునకలుగా ఉన్నాడు.
  వేరుశనగ విత్తనాల కోసం అనంతపురం జిల్లా అట్టుడికిపోతోంది. విత్తనకాయలు అందక అమడగూరులో ఎంపీడీవో కార్యాలయంపై రైతులు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు. ఉరవకొండలోనూ మధ్యాహ్నం 12 గంటలకే కౌంటర్లు మూసివేయడంతో ఎండలో క్యూలో నిలబడ్డ రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. అధికారులపై తిరగబడ్డారు. గంటల తరబడి క్యూలలో నిలబడినా విత్తనాలు లేవంటూ అధికారులు చేతులెత్తేయడంతో కళ్యాణదుర్గం, నల్లచెరువు, బెళుగుప్ప మండలాల్లో రైతులు ఆందోళన చేశారు. కుందుర్పి, శెట్టూరు, కంబదూరు, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు, కూడేరు, ఓడీ చెరువు, కొత్తచెరువు, గాండ్లపెంట, అనంతపురం, గుంతకల్లు, శింగనమల తదితర మండలాల్లో విత్తనకాయలు అయిపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
  ఒక్క అనంతపురమే కాదు రాయలసీమ జిల్లాలన్నిటిలోనూ ఇదే పరిస్థితి.  విత్తనాల కోసం అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఎన్ని విత్తనాలు అవసరమౌతాయో నిర్ణయించి వాటిని సేకరించి రైతులకు అందుబాటులో ఉంచాల్సిన రాష్ర్ట ప్రభుత్వ చేతకానితనం ఇది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఈరోజు రైతులు ఎండల్లో చాంతాడంత క్యూలలో నిలబడి ఉసూరుమంటూ తిరిగి వెళుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.55 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమౌతాయని అంచనా. కానీ ఇప్పటి వరకు రాష్ర్ట ప్రభుత్వం సరఫరా చేసింది 1.98 లక్షల క్వింటాళ్లు. మహా అయితే మరో 45 వేల క్వింటాళ్లు మాత్రమే సేకరించి అందించగలమని అధికారులంటున్నారు. అంటే మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? సగం మంది కైనా విత్తనాలు అందించలేని చంద్రబాబు అనుభవాన్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. తమ జీవితాలను గాలికొదిలేసిన ఈ ప్రభుత్వం మట్టిగొట్టుకుని పోతుందంటూరైతులు శాపనార్థాలు పెడుతున్నారు.

No comments:

Post a Comment