1 June 2015

సైకిల్ పార్టీ సారథి సెలైన్స్!

తెలుగుదేశం పార్టీ నాయకులకు కాస్త నోరు ఎక్కువే. అయినదానికి కానిదానికి నోరేసుకుని పడిపోవడంలో వారిని మించినవారు లేనేలేరని మీడియా మిత్రులు అంటుంటారు. ఈ విషయంలో చంద్రబాబు నాలుగాకులు ఎక్కువే చదివారు. ఏ పదాన్ని ఎక్కడ నొక్కాలో ఎక్కడ వత్తి పలకాలో ఆయనకు మాబాగా తెలుసు. ఆయన స్వరం పెంచి మాట్లాడుతుంటే వినేవారిలో బీపీ పెరిగిపోతుంటుంది. అయితే ఆదివారం సాయంత్రం నుంచి తెలుగుదేశం నాయకుల నోళ్లు మూతపడ్డాయి. అధినాయకుడిదీ అదేపరిస్థితి. ఎందుకో ఈ పాటికే మీకు అర్ధమయిపోయి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేని ప్రలోభపెట్టిన ముడుపుల వ్యవహారం బట్టబయిలయ్యింది కదా... ఈ వ్యవహారంలో తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టయి 24 గంటలు గడిచినా చంద్రబాబు స్పందించలేదు. సాక్షాత్తూ తమ బాస్ (చంద్రబాబు) ఆదేశాల ప్రకారమే డీల్ నడిచిందని స్వయంగా రేవంత్‌రెడ్డి పలికిన పలుకులు చానళ్లలో హోరెత్తిపోతున్నా కనీసం అధినేత పెదవి విప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. తమ పార్టీ నాయకుడు అడ్డంగా దొరికిపోవడంతో అందరూ మీడియాకు ముఖం చాటేశారు. తనకు రిస్క్ అనుకున్నపుడు మీడియాకు ముఖం చాటేయడం చంద్రబాబుకు అలవాటే. అయితే మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరన్నది జగమెరిగిన సత్యం. ఏ వ్యవస్థనైనా ఆయన అవలీలగా అలవోకగా మేనేజ్ చేసేయగలరు. ఎమ్మెల్యేలను మేనేజ్ చేసే ఆయన మొదట సీఎం అయ్యారు. అందుకోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు కూడా. ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలా మేనేజ్ చేసి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఓటేయించుకుందాం అనుకున్న తెలుగుదేశం నాయకుల పథకాలు బెడిసికొట్టాయి. అవినీతిని అంతం చేస్తానంటూ అన్నాహజారే తమ్ముడిలాగా లెక్చర్లు దంచే చంద్రబాబు నిజస్వరూపం సాక్ష్యాలతో సహా బట్టబయలు కావడంతో సైకిల్ పార్టీ అధినేత సెలైంట్ అయిపోయారు. మహానాడులో అవినీతిపై అధినాయకుడు ప్రసంగం దంచికొట్టిన రెండు రోజులకే తెలుగుదేశం పార్టీ అవినీతి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసులో చంద్రబాబు ప్రోద్బలం మేరకే రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని, అందువల్ల చంద్రబాబు పేరును కూడా ఈ కేసులో చేర్చాలని టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. అందుకనే నోరు తెరిస్తే చిక్కుల్లో పడతామన్న భయంతోనే చంద్రబాబు సెలైంట్ అయిపోయారని అవి ఆరోపిస్తున్నాయి. 

No comments:

Post a Comment