1 June 2015

మాఫీ మోసంపై ఆడపడుచుల ఆగ్రహం

 బాబు మోసగాడంటూ మండిపాటు
 పలుచోట్ల ఆందోళనలు
 డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ వాగ్దానాల వర్షం కురిపించి అధికారం చేతికి చిక్కగానే మోసపుచ్చిన చంద్రబాబుపై ఆడపడుచులంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బాబు మాయమాటలు నమ్మినందుకు ఇల్లు, వాకిలి గుల్లయిపోయాయని డ్వాక్రా సంఘాల మహిళలు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు మోసాలకు నిరసనగా పలుచోట్ల డ్వాక్రా మహిళలు ఆందోళన చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. చంద్రబాబు మాయమాటలు నమ్మినందుకు అసలు రుణం మాపీ కాకపోగా అంతకుముందు అందే జీరో వడ్డీ స్థానంలో ఇపుడు రెండు రూపాయల వడ్డీ భారం మోయాల్సి వస్తోందని డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. మాఫీ చేస్తున్నామంటూ మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇపుడు మాట మార్చి తొలి దశ పెట్టుబడిగా అప్పు పేరుతో మహిళా సంఘాలలో ఒక్కో మహిళకు మూడువేల రూపాయలు ఇస్తున్నామంటూ ప్రకటనలు చేస్తుండడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణాలు మాఫీ కాలేదు సరికదా కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదు. పైగా కొత్తగా మూడువేల రూపాయలు అప్పుగా ఇవ్వడం వల్ల మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతామే తప్ప దీనివల్ల ఏం ఉపయోగమని మహిళలు మండిపడుతున్నారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని ఆశపడ్డామని, అందువల్లే నెలనెలా అసలు, వడ్డీ కట్టడం మానేశామని, అయితే ఆరునెలల తర్వాతే అసలు సంగతి తెలిసిందని మహిళలు వాపోతున్నారు. అప్పుడు నెలనెలా వాయిదాలు కట్టడం ప్రారంభించినా గత ఆరునెలలుగా సకాలంలో వాయిదాలు కట్టలేదంటూ బ్యాంకులు వడ్డీమీద వడ్డీలు వేయడం ప్రారంభించాయి. అది కాంపౌండ్ ఇంపాక్ట్ పేరుతో మొత్తం రెండు రూపాయలకు చేరుకుంది. డ్వాక్రా సంఘాలలోని ఒక్కో మహిళ 50 వేల రూపాయల నుంచి 80 వేల రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు. 50 వేల రూపాయల రుణం తీసుకున్న మహిళ బాబు మాటలు నమ్మి సకాలంలో రుణం చెల్లించని కారణంగా రెండు రూపాయల వడ్డీ కింద రు.12,000 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కో మహిళలకు అప్పుకింద ఇస్తున్నన్నది కేవలం రు.3,000 మాత్రమే. ఇది వడ్డీ కూడా సరిపోదు. వడ్డీలో నాలుగోవంతు మాత్రమే. అదికూడా కొత్త అప్పు కింద ఇస్తున్నారు. అందుకే మహిళలు ఆగ్రహోదగ్రులవుతున్నారు.
  డ్వాక్రా రుణమాఫీపై చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలపై శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామ పంచాయతీలో డ్వాక్రా గ్రూపుల మహిళలు కన్నెర్ర చేశారు. మాఫీ మాయాజాలంపై కమ్యూనిటీ ఫెసిలిటేటర్‌ను నిలదీశారు. రు.1.50 లక్షల వరకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నేడు రు.3 వేలు కూడా జమ చేయకుండా తమను వంచనకు గురిచేశాడంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలకు మోసపోయామని, స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మహిళలు మండిపడ్డారు. రుణమాఫీ చేయకుంటే సర్కారుకు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.

No comments:

Post a Comment