26 May 2015

నవ నిర్మాణ దీక్ష కాదు... నవ వంచన దీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలకు ఉత్సాహపడుతున్నారు. అందులో నవనిర్మాణ దీక్ష కూడా ఒకటి. ఏడాది పాలనలో రాష్ర్ట ప్రజలకు ఏమీ ఒరగబెట్టిందే లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేసింది లేదు. ఐదు సంతకాలను అభాసుపాల్జేశారు. మాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను వంచించారు. ఇంటికో ఉద్యోగమంటూ నిరుద్యోగులను బుట్టలో వేసుకుని ఆనక చెత్తబుట్ట దాఖలా చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న మాట నీటి మూట అయ్యింది.  ఏడాది పాలన ఎలాంటి స్ఫూర్తినీ నింపలేదని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్వయంగా చంద్రబాబే అంగీకరించారు. ఇప్పుడు ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి నవనిర్మాణ దీక్ష పేరుతో నాటకాలాడుతున్నారు. అందుకే ఇది నవ నిర్మాణ దీక్ష కాదు.. నవ వంచన దీక్ష...

 ఐదు సంతకాలేమయ్యాయి?
 తొలి ఐదు సంతకాల్లో 1) వ్యవసాయ రుణాలు రూ. 87 వేల కోట్ల నుంచి 97 వేల కోట్లకు పెరిగాయి. 2) డ్వాక్రా రుణాలు అర్థ రూపాయి కూడా మాఫీ చేయలేదు. 3) బెల్టు షాపులు రద్దు కాలే దు. బెల్టు షాపులన్నింటినీ చట్టబద్ధంగా నడిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. 4) రిటైర్మెంట్ వయసు పెంపు అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న 44 ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, కార్పోరేషన్ ఉద్యోగులకు ఏ ఒక్కరికీ వర్తించటం లేదు. 5) రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అన్నది ఎక్కడా అందటం లేదు. మరి ఐదు హామీలు అమలు చేశాం అంటే దానర్థం ఏమిటి? ఐదు సంతకాలు పెట్టినా ఒక్క హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రిగా మీకు అద్భుతమైన రికార్డు దక్కింది చంద్రబాబు గారు.

 ప్రత్యేక హోదాను వదిలేశారే....
 ప్రత్యేక ఆర్థిక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా మీకు బాధ లేదు. మీ రక్తం సల సల మరగటం లేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోయినా మీ నరాల్లో, మీ మెదడులో చలనం లేదు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోనే చేసిన హామీలను కూడా నెరవేర్చకపోయినా మీ నోరే పెగలటం లేదు. ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన ప్రకటన సరిపోదని, ఐదేళ్ళు కాదు, పదేళ్ళు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఆరోజు అడిగిన వెంకయ్య నాయుడును, ఆయన పార్టీని నిలదీయటానికి మీ గుండె ధైర్యం చాలటం లేదు.  దీని అర్థం ఏమిటి చంద్రబాబు నాయుడు గారూ? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో, ఢిల్లీ నాయకత్వం పాదాల ముందు సాష్టాంగ పడి మోకరిల్లి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ తెర వెనుక ఒప్పందాల కోసం తాకట్టు పెట్టారా? కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు మంత్రి పదవులైతే పొందారు గానీ ఈ ఇద్దరు మంత్రుల వల్ల తెలుగు రాష్ట్రాలకు అర్థ అణా మేర ప్రయోజనం కలిగిందని చెప్పుకునే పరిస్థితే లేదంటే మీ మంత్రులు, మీరు తెలుగుదేశం మంత్రులా? లేక తెలుగు వారికి ద్రోహం చేసే మంత్రులా?

 విభజనకు మీరేకదా కారణం?
 విభజన పట్ల ప్రజలు కలత చెందారని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అర్థమైందట. ఏమయ్యా నామా నాగేశ్వరరావు ఎవడి పార్టీలో ఉన్నాడు? నీ పార్టీలోనే గదా. లోక్‌సభలో విభజన బిల్లు మీద ఓటింగ్ జరిగిన మరుక్షణం నామా ఏం మాట్లాడాడు? ఆరోజు నామా మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. బయటకు వచ్చి విభజనకు తొలి ఓటు తెలుగుదేశం పార్టీదే. నేనే వేశానని చెప్పాడు. నామాతో అక్కడ ఓటు వేయిస్తావు. ఇక్కడ ప్రజలందరికీ నామాలు పెట్టాలని చూస్తావు. నామా సంగతే ఎందుకు నీ సంగతే చూద్దాం. మొన్న మహబూబ్‌నగర్ మీటింగ్‌లో ఏం మాట్లాడావు? విభజనకు మొట్టమొదటి లేఖ ఇచ్చింది మా పార్టీయేనని గుండెలు మీద బాదుకున్నావు. టిఆర్‌ఎస్ కన్నా ముందు విభజన లేఖ ఇచ్చింది మీ పార్టీనే. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే టిఆర్‌ఎస్ సృష్టికి మూలం నువ్వే. అలాంటిది అక్కడ ఆ మాట మాట్లాడి... ఇక్కడ ఏపీ కేబినెట్ సమావేశంలోనో, ఏపీలో జరిగే సభల్లోనో ఏం చెబుతున్నావు? విభజన వల్ల ప్రజలు కలత చెందారని చెబుతావా? రాజధాని పేరు చెప్పకుండా కట్టుబట్టలతో పంపించారంటావా? మీ మామ గారు సినిమాల్లోనే మహా నటుడు అయితే.. నువ్వు రాజకీయాల్లో మహా మహా నటుడివి. రావణాసురిడికి పది తలలు ఉంటే ఒక తలలోనే పది నాల్కలు ఉన్న వ్యక్తివి నీవు. కాబట్టే, ఇంత అలవోకగా రాష్ట్ర విభజన గురించి అందరూ చూస్తుండగానే, అందరూ పిచ్చివాళ్ళు అనుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలుగుతున్నావు. అయితే వంచన, మోసం చేసి కూడా... మీడియాను మేనేజ్ చేసుకుంటూ మీరు చేసే దాన్ని పరిపాలన అని మీరు అనుకోవచ్చుగానీ ఇది దుష్పరిపాలన అని మాత్రమే ప్రజలు భావిస్తున్నారు.

 రాజధాని ఎంపికలో రియల్‌ప్రయోజనాలు
 రాజధాని ఎంపిక పేరుతో శివరామకృష్ణన్ కమిటీ వేసి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వటానికి గడువు ముగిసే లోపే నీ ఆర్థిక నిర్మాత, అప్పటికి రాజకీయంగా అనామకుడైన నారాయణ ఆధ్వర్యంలో మరో కమిటీ నువ్వు ఎందుకు వేశావు? ఏ ప్రజలకు న్యాయం చేయాలని ఆ కమిటీ వేశావు? ఆ కమిటీలో ఒక్కడంటే ఒక్కడు రాజధానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఉన్నాడా? అయినా కమిటీ వేశావు. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెబుతుందో అనే భయంతో, నీ రియల్ ఎస్టేట్ డిజైన్లు, తద్వారా మీరు ప్లాన్ చేసుకున్న వేల కోట్ల రూపాయల వ్యాపారం ఎక్కడ దెబ్బతిని పోతుందో అనే భయంతోనే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక బయటకు రాకముందే నీ మంత్రులతో రాజధానికి సంబంధించి నిర్ణయం అయిపోయిందని ప్రకటింపజేశావు. ఇవన్నీ చరిత్ర. ఇవన్నీ నిన్న మొన్న అందరూ ప్రత్యక్షంగా చూసిన వాస్తవాలు. అలాంటిది మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినట్టు? నువ్వు ఎవరికి న్యాయం చేసినట్టు? నువ్వు ఏ ప్రాంతంలో రాజధాని పెడుతున్నావో ఆ ప్రాంతానికి కూడా అన్యాయం చేసిన వ్యక్తివి. ముందుగా, ఒక పథకం ప్రకారం నీ బినామీలతో చుట్టూ భూములు కొనిపించి ఆ తర్వాతే రాజధాని ప్రకటన మీరు చేసిన విషయం మీద ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దర్యాప్తు జరగకపోవచ్చు. రేపు ప్రతి అంశం మీద దర్యాప్తు జరిగి తీరుతుంది. మీ నేరం రుజువు అవుతుంది.

 ఏ రోటికాడ ఆ పాట
 ముందు సింగపూర్ పద్ధతులు మీద అధ్యయనం చేయాలన్నావు. తర్వాత జపాన్ పద్ధతుల మీద అద్యయనం చేయాలన్నావు. ఆ తర్వాత చైనా పద్ధతుల మీద అధ్యయనం చేశానన్వావు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ రాజధాని వెళ్ళి చూసి వచ్చావు. ఇప్పుడు మధ్యప్రదేశ్ వృద్ధి రేటు గురించి మాట్లాడుతున్నావు. ఏది చూస్తే అది. ఎక్కడికి వెళితే ఆ పాట.

 నవ నిర్మాణ దీక్షలో నారాయణ విద్యార్థులను చేర్చండి...
 ఆరవ తరగతి నుంచి విద్యార్థులనందరినీ నవ నిర్మాణ దీక్షలో భాగస్వాముల్ని చేస్తారా? ముఖ్యంగా నారాయణ విద్యార్థులనందర్నీ కూడా ఈ నవ నిర్మాణ దీక్షలో భాగస్వాముల్ని చేయదలచుకున్నారా? లేదా అన్నది ముందు చెప్పండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు మీకు తేరగా దొరికారా? వారికి చదువు అక్కర్లేదా? వారు మీ పథకాలకు ప్రమోషన్‌గా ఉపయోగపడే బాల కార్మికులు అని మీరు అనుకుంటున్నారా? అసలే ప్రభుత్వ పాఠశాలలు అంతంతమాత్రంగా నడుస్తుంటే అక్కడి విద్యార్థులను మీ పథకాల ప్రచారం కోసం ఉపయోగించుకునే పద్ధతికి స్వస్తి చెప్పండి. 

No comments:

Post a Comment