26 May 2015

గోదావరి రైతుల మాఫీ కష్టాలు

పశ్చిమగోదావరిలో వ్యవసాయ రుణాల మాఫీ కార్యక్రమం ఓ ప్రహసనంలా మారిపోయింది. ఎన్నికల ముందు బేషరతుగా సంపూర్ణ రుణమాఫీ హామీతో రైతులను ఆకర్షించిన చంద్రబాబు అనేక ఆంక్షలు, షరతులతో రుణమాఫీని పరిమితం చేసేశారు. ఆ తర్వాత అరకొరగా విదిల్చారు. ఒకవైపు లబ్ధిదారులను తగ్గించేయడమే కాక మాఫీ చేయకుండా తప్పించుకోవడం కోసం అనేక పిల్లిమొగ్గలు వేశారు. తరచూ నిబంధనలను మార్చుతూ లబ్ధిదారుల సంఖ్యను పావు వంతుకు మార్చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 4.55 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చారు. వారికి రెండు విడతలుగా రు.1550 కోట్లను మాఫీ చేయాల్సి ఉండగా రు. 488 కోట్లను మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని బాండ్లరూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు అమలు కాలేదు. మరోవైపు లబ్ధిదారులుగా ఎంపికయిన వారిలో కూడా 30శాతం మంది రైతులకు మాఫీ సొమ్ము ఖాతాల్లో జమ కాలేదు. రుణమాఫీకి అర్హత పొందని రైతులు పైసా దక్కక అల్లాడుతుంటే అర్హత సాధించిన రైతులు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. కొంత పొలంపై సొసైటీలోనూ మరి కొంత పొలంపై వాణిజ్య బ్యాంకుల్లోను రుణాలు తీసుకున్న రైతులు మాఫీ కోసం అనేక అవస్థలు పడుతున్నారు. సొసైటీలో తీసుకున్న రుణానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలపై స్టాంప్ వేయించుకుని రావాలని వాణిజ్యబ్యాంకు అధికారులు, వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి ఆ బ్యాంక్ స్టాంప్ వేయించాలని సొైసైటీలు కోరుతుండడంతో రైతుల పని అడకత్తెరలో పోకచెక్కలా మారింది. మరోవైపు నిమ్మ, అరటి వంటి దీర్ఘకాలిక పంటలు వేసిన ఉద్యాన రైతులు రుణమాఫీకి అనర్హులుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. వారి వేదన అరణ్య రోదనలా మారిపోయింది. ఇదిలా ఉండగా మూడోవిడతలోనూ రుణమాఫీ కాని రైతులంతా తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా ప్రత్యేక కౌంటర్లలో పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 10 వేల మంది రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రత్యేక కౌంటర్లలో రైతుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులను మూటగట్టి మూలన పడేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరికి రుణమాఫీ అవుతుందా లేదా అన్నది సందేహంగానే ఉంది. రుణమాఫీ సక్రమంగా జరగక  పోవడంతో బకాయిలు చెల్లించని రైతులపై అధిక వడ్డీల భారం పడుతోంది. ఇంకోవైపు కొత్త రుణాలు అందక విలవిల్లాడుతున్నారు. రుణమాఫీ పేరిట చంద్రబాబు చేసిన మోసాన్ని తలచుకుని ఆవేదన చెందుతున్నారు.

No comments:

Post a Comment