12 May 2015

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట

పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగిన పార్టీ ఎంపీలు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది.  తాజాగా వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. 
  వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, తిరుపతి ఎంపీ డా.వీ వరప్రసాద్ రావు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు.. ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఈసందర్భంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరోజు విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రకటన చేస్తూ... ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నాయకులు ... దీనికి మద్దతు ఇస్తూ, ఐదేళ్లు సరిపోదని, పదేళ్ల  పాటు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసినట్లు మేకపాటి వివరించారు. అంతే కాకుండా వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి, ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కల్పిస్తామని బీజేపీ నాయకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు బీజేపీ కి పూర్తి మెజార్టీ ఉంది. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక హోదా హామీ ని నిలబెట్టుకోవాలి. వైఎస్ జగన్ నాయకత్వంలో మేంఇప్పటి దాకా 2,3 సార్లు దీనిపై కేంద్రానికి వినతి పత్రం ఇచ్చాం. మా బాధ్యతగా దీనిపై పోరాటం చేస్తూ వస్తున్నాం’’అని ఆయన వివరించారు. ప్రస్తుతం విభజనతో రాష్ట్రం బాగా నష్టపోయింది కాబట్టి వెంటనే ఆదుకోవాలని ఆయన అన్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉంది, రాష్ట్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అటువంటప్పుడు ప్రత్యేక హోదా కోసం కృషి చేయాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంది. లేదంటే తె లుగుదేశం, బీజేపీలన ప్రజలు క్షమించర ని మేకపాటి అన్నారు. ‘‘అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించింది. అసెంబ్లీలో విభజన వద్దని ఏకగ్రీవ తీర్మానం చేసినా కానీ వినిపించుకోలేదు. పార్లమెంటు తలుపులు మూసేసి మరీ బిల్లు పాస్ చేయించారు. రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని అయినా అమలు చేసే పరిస్థితి లేదు’’అని ఆయన అన్నారు. మాట తప్పటం అన్నది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ బుట్టా రేణుక ... ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతూ వస్తోందని వివరించారు. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నాయకత్వంలో ఎంపీలు అంతా కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశాం. వినతి పత్రాన్ని సమర్పించాం. అనేక వేదికల మీద దీని కోసం పోరాడుతున్నాం. ఇక ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం.’’అని అమె అన్నారు. 

No comments:

Post a Comment