25 May 2015

బాబుగారి గోదావరి గోబెల్స్!

ఏదైనా అబద్దాన్ని పదేపదే వల్లెవేస్తే అది నిజమైపోతుందని నారా చంద్రబాబునాయుడిగారి నమ్మిక. ఆయన గోబెల్స్‌ని నమ్ముకున్నారు మరి. ఉభయగోదావరి జిల్లాల ప్రజలపై రెండు మూడు రోజులుగా చంద్రబాబు ఇదే రకమైన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమకు ఓట్లేసిన జిల్లాలకు పెద్దపీట వేస్తామని, ఆ జిల్లాల్లో అభివృద్ధిని ఏరులుగా పారిస్తామని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల గురించి ఆయన తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఇందులో ఇమిడి ఉన్న విషయాలను ప్రధానంగా రాష్ర్ట ప్రజలు చర్చించుకుంటున్నారు. 
  ఓట్లేసిన జిల్లాలను అభివృద్ధి చేస్తానని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారంటే మరి తెలుగుదేశం పార్టీకి ఓటేయని జిల్లాల గురించి ఆయన పట్టించుకోరా? అంటే ఆయన తనకు ఓట్లేసిన జిల్లాలకు మాత్రమే ప్రతినిధా? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి  మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎన్నికలు అయిపోయిన తర్వాత పదవీ ప్రమాణ స్వీకారం చేసేటపుడు వల్లెవేసిన మాటలేమిటి? చేసిన ప్రతిజ్ఞలేమిటి? ప్రమాణాలేమిటి? రాగద్వేషాలకు అతీతంగా రాష్ర్ట ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకోవలసిన ముఖ్యమంత్రి పదవిలోని వ్యక్తి ఇలా పక్షపాత పూరితమైన వ్యాఖ్యలు చేయవచ్చా? అసలు అలాంటి వ్యక్తి అంతటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండడానికి అర్హుడేనా? చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను చూసిన వెంటనే ఇలాంటి ప్రశ్నలన్నీ ఉదయించకమానవు. 
  ఇకపోతే ఓట్లేసిన జిల్లాలను అభివృద్ధి పథాన పరుగులు పెట్టిస్తానని చంద్రబాబు చేస్తున్న బూటకపు ప్రచారంలోని డొల్లతనాన్ని కూడా ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. బ్రహ్మానందాన్ని మించిన కామెడీ చేస్తున్నాడని నవ్విపోతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ఎత్తున అభివృద్ధి జరిగిపోతున్నదంటూ ఇతర జిల్లాల్లో గోబెల్స్ ప్రచారం జరుగుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలో ఇంతవరకు చెప్పుకోదగిన కార్యక్రమం ఒక్కటీ చేపట్టిన దాఖలా లేదు. అయినా పశ్చిమగోదావరి జిల్లాలో నిధులు కుమ్మరిస్తున్నట్లుగా తెలుగుదేశం నేతలు ప్రచారం చేస్తున్నారు. కర్నూలులో జరిగిన తెలుగుదేశం మినీ మహానాడు సభలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జిల్లాకు చంద్రబాబు ఎనిమిదిసార్లు వచ్చారు. అయితే ఆయన పర్యటనల వల్ల జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిట్ కేటాయిస్తున్నట్లు చేసిన ప్రకటన మినహా ఏదీ ముందుకు సాగలేదు. చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తుంటే చాలు అభివృద్ధి జరిగిపోతున్నట్లు గోబెల్స్ ప్రచారం చేయడం మినహా నిజానికి జరిగిందేమీ లేదు. 
  ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో మరో విచిత్రమైన తంతు కూడా నడుస్తోంది. చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. ఆ అసంతృప్తి తమపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలా అని స్థానిక నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఏడాది పాలనపై వేదికలెక్కి అసంతృప్తి వెళ్లగక్కడం ద్వారా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రజల వద్ద మంచి మార్కులు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పాలకొల్లులో జరిగిన మినీ మహానాడులో ఇలాంటి ప్రయత్నమే కనిపించింది. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఇతర ప్రజా ప్రతినిధులు ఏడాది పాలన తమకు సంతృప్తినివ్వలేదని మొసలి కన్నీరు కార్చడం ఇందుకే. చంద్రబాబు వాగ్దానాల భంగం, ఏడాదిగా ఏమీ చేయకపోవడం వంటి వాటి ప్రభావాలు తమపై పడకుండా ప్రజల వద్ద సానుభూతి సంపాదించడం కోసం తెలుగుదేశం నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏడాది పాలనలో ఏమీ చేయలేకపోయామన్న అపప్రథ నుంచి బయటపడేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు.

No comments:

Post a Comment