13 May 2015

బలవంతపు భూసేకరణకు వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం

న్యూఢిల్లీ : రైతుల ఆమోదం లేకుండా భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభలో మరోమారు స్పష్టం చేసింది. భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం తెచ్చిన బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. బహుళ పంటలు సాగయ్యే భూములు, సారవంతమైన భూములను రైతుల ఆమోదం లేకుండా లాక్కోవడాన్ని తాము వ్యతిరేకిస్తామని మేకపాటి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు లాక్కోవడం సరికాదని, అక్కడికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో రాజధానిని నిర్మించవచ్చని ఆయన సభలో వివరించారు. రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారని, ఈ కారణాల వల్లే తాము ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నామని మేకపాటి పేర్కొన్నారు. ఈసారి కూడా సవరణలు సూచిస్తామని, బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment