12 May 2015

చంద్రబాబు దగ్గరుండి ప్రతిపక్ష నేతలను హత్యలు చేయిస్తున్నారు: వైఎస్ జగన్

అనంతపురం: ఏకపక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జైల్లో ఉన్న పార్టీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ హత్యలు చేసిన వాళ్లను వదిలేసి, ఎమ్మార్వో కార్యాలయాన్ని ధ్వంసం చేశారంటూ గుర్నాథరెడ్డితో పాటు మరో 40మందిని అరెస్ట్ చేయటం అన్యాయమన్నారు. ఎమ్మార్వో కార్యాలయాన్నే హత్యా వేదికగా మార్చుకుని, ప్రభుత్వ ఉద్యోగులే ఈ ఘటనల్లో ప్రమేయం ఉండటం దారుణమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సాక్షాత్తూ దగ్గరుండి ప్రతిపక్ష నేతలను హత్యలు చేయిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో భూమిరెడ్డి ప్రసాదరెడ్డి హత్య మొదటిది కాదని, గతంలోనూ విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని సింగిల్ విండో కార్యాలయానికి పిలిచి రాజీనామా చేయాలని సీఈవో స్వయంగా ఫోన్ చేశారని, అయితే అందుకు నిరాకరించిన విజయ్ భాస్కర్ను దారుణంగా హతమార్చారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భావోద్వేగానికి లోనై ప్రవర్తిస్తే రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అని కూడా చూడకుండా జైల్లో పెట్టారని ఆయన అన్నారు. ఇటువంటి అన్యాయం ఎవరికైనా, ఎప్పుడైనా జరుగుతుందని ప్రజాస్వామ్యంలో మీడియా తన వంతు బాధ్యతగా గళం విప్పాలని వైఎస్ కోరారు.

No comments:

Post a Comment