10 May 2015

నవ్వి పోదురు గాక, నాకేంటి సిగ్గు..!

విముక్తి యాత్రకు సిద్ద పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతులకు రుణాల బాధ లేదంటూ ప్రచారం
రైతుల్ని మళ్లీ ఊరించి, మోస పుచ్చేందుకు ప్రయత్నం
 
అప్పుల బాధతో అల్లాడుతున్న వ్యవసాయదారులు
ఏకంగా సీఎం సభలోనే ఆత్మాహత్యకు యత్నించిన రైతు
పీకల్లోతు కూరుకొని పోయిన అన్నదాతలు
 
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రుణ విముక్తి యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారుల బృందాలు  ఊరూరా పర్యటించనున్నాయి. ఇప్పటికే రుణాలన్నీ తీరిపోయి  ఉంటాయని, ఈ ప్రభుత్వం వచ్చాక అన్నీ సమస్యలు తీరుతున్నాయని చెప్పటమే దీని ఉద్దేశ్యం. అయితే రుణమాఫీ మీద ఎవరికైనా సమస్యలు ఉంటే ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. దీంతో  రుణ మాఫీ మీద పచ్చ మార్కు నాటకంలో మరో అంకానికి తెర లేచినట్లయింది. 
 
అదిగదిగో రుణ మాఫీ
‘బాబు వస్తాడు, మీ అప్పులన్నీ మాఫీ అయిపోతాయి’.....  ‘మన ప్రభుత్వం వచ్చేస్తోది, అప్పులేవీ క ట్టకండి’..... ‘అదిగ దిగో తెలుగుదేశం ప్రభుత్వం, ఇదిగిదిగో రుణాల మాఫీ’ అంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. కింద మీద పడి కొద్దో గొప్పో అప్పులు కడదామనుకొన్న రైతులు కూడా ఆ ప్రచారం తో ఆగిపోయారు. పూర్తిగా నమ్మిన రైతులు పెద్ద ఎత్తున ఓట్లేసి చంద్రబాబును గెలిపించారు. అధికారం అప్పగించారు. 
మొదటి రోజు సంతకాలు  కూడా రుణమాఫీ మీద అనేసరికి రైతులకు, డ్వాక్రా మహిళల ఆనందానికి అంతే లేకుండా పోయింది. త్వరలోన రుణమాఫీ జరిగిపోతుందని కలలు కన్నారు. తీరా చూసి, రోజులు గడిచాయి, వారాలు మారాయి, నెలలు పూర్తయ్యాయి. రుణమాఫీ చేయకుండానే చంద్రబాబు పాలన సాగిపోతోంది. ఈ లోగా బ్యాంకర్లు తమ తడాఖా చూపించసాగారు. అప్పులు తీర్చకుండా ఆగినందుకు వడ్డీల మీద వడ్డీలు విధించుకొంటూ పోయాయి. దీంతో ఇవ న్నీ రైతుల నెత్తిమీద పిడుగులా పడ్డాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన మొదటి బ్యాంకర్ల సమావేశంలో అప్పుల పరిస్థితిని బయట పెట్టారు. 2014 మార్చి నెలాఖరు నాటికి రూ.87, 612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల మేర డ్వాక్రా రుణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ మేరకు నిధులు ఇచ్చి నట్లయితే రుణాల్ని మాఫీ చేయటం జరుగుతుందని స్పష్టం చేశాయి. దీని మీద ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడ లేదు.  మొదటి విడత రుణ మాఫీ కింది అర కొర మాత్రమే విదిల్చారు. ఈలోగా అప్పులన్నీ కలిసి రూ. 99 వేల కోట్లకు చేరిపోయాయి. అంటే దాదాపుగా లక్ష కోట్లయిపోయాయి. కానీ ప్రభుత్వం మొదట్లో ఇచ్చింది మాత్రం రూ. 4,664  కోట్లే. అంటే దాదాపు 5శాతం వరకే అనుకోవచ్చు. దీంతో రైతులకు పెద్దగా లాభం లేక పోయింది. 
 
కష్టాల కొలిమి
రుణ మాఫీ అందక పోవటంతో రైతుల పరిస్థితి కష్టాల్లో పడ్డట్లయింది.  ఎలాగు బాబు వచ్చాడు కాబట్టి అప్పులన్నీ తీరిపోయినట్లే అని భావించారు. కానీ అప్పుల తాలూకు డబ్బులేవీ రాలేదు. అప్పులు అలాగే ఉన్నాయి. బ్యాంకులు మాత్రం వడ్డీల మీద వడ్డీలు వేసేశాయి. దీంతో మళ్లీ పెట్టుబడుల కోసం బ్యాంకుల దగ్గర కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. {పైవేటు వ్యాపారుల దగ్గరకు వెళ్లి నూటికి 4,5 రూపాయిల వడ్డీకి అప్పులు తెచ్చుకోవలసి వచ్చింది. ఒక వైపు అప్పులు తీరక, మరో వైపు కొత్త అప్పులు మీద చక్ర వడ్డీలు పేరుకొని పోయి... ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితి చితికి పోయినట్లయింది. 
అటు బ్యాంకుల దగ్గరకు వెళ్లి తిరిగి అప్పు పొందలేని పరిస్థితి. అంతెందుకు.. గడచిన ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ. 56, 019 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొంటే అయిదో వంతు మేర కూడా లక్ష్యాల్ని దాటలేదు. ఖరీఫ్ నాటికి కేవలం రూ. 7,263 కోట్ల మేర మాత్రమే అప్పులు ఇవ్వగలిగారు. దాదాపు మెజారిటీ రైతులు అప్పులు తీసుకోలేక బ్యాంకులకు దూరంగా ఉండిపోయారు. పైగా అప్పుల్ని రీ షెడ్యూల్ చేసుకోక పోవటంతో పంట బీమా వంటి ప్రయోజనాలకు కూడా దూరంగా ఉండిపోయారు. ఈలోగా బంగారం మీద తీసుకొన్న రుణాలకు గడువు తీరిపోవటంతో వేలం వేస్తున్నట్లుగా బ్యాంకులు నోటీసులు ఇవ్వసాగాయి. దీంతో వాటిని విడిపించుకొనేందుకు మరో సారి ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పులు తేవటంతో పూర్తిగా మునిగిపోయారు. 
 
మహిళల కంట కన్నీరు
డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అని ఊరించారు. అప్పటి దాకా పొదుపు చేసుకొంటూ డ్వాక్రా రుణాలు తెచ్చుకొనే వారు. వాటిని తీర్చుకొంటూ ముందుకు వెళితే పావలా వడ్డీ రుణాలువంటి ప్రయోజనాలు దక్కేవి. కానీ చంద్రబాబు మాటలు నమ్మి అప్పులు కట్టక పోవటంతో ఈ ప్రయోజనాలన్నీ పక్కకు పోయాయి. కానీ పొదుపు సంఘాల్లోని కొందరైనా కడదామని ప్రయత్నించినా, మొత్తం సంఘం పేరు మీద బకాయిలు ఉండిపోవటంతో అప్పులు అలాగే పేరుకొని పోయాయి. తర్వాత కాలంలో బ్యాంకుల నుంచి ఒత్తిడి పేరుకొనిపోవటంతో పొదుపు సంఘాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు పొదుపు సంఘాల పని తీరులో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా పేరు ఉండేది ఇప్పుడు కాస్తా అదోగతి పాలైంది. 
 
ఫిర్యాదుల కేంద్రం పనితీరు
వ్యవసాయ రుణాలకు సంబంధించి రుణ మాఫీ కాని వారి సంఖ్య లక్షల్లో ఉండటంతో ఫిర్యాదులు అంతకంతకూ పెరిగిపోసాగాయి. బ్యాంకర్లను అడిగితే రెవిన్యూ అధికారుల్ని అడగమనటం, రెవిన్యూ అధికారుల్ని అడిగితే వ్యవసాయ అధికారుల్ని అడగమనటం, వ్యవసాయ అధికారులు తిరిగి బ్యాంకర్ల దగ్గరకు పంపిస్తూ కాలక్షేపం చేశారు. అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోవటంతో రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకొనేందుకు ఒక కంప్లయింట్ సెల్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఎటువంటి వివరాలు అందించే పరిస్థితి లేకపోయింది. రోజు రోజుకి అక్కడకు వచ్చే రైతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవటం, రాజధానిలో ఉండే మీడియా దీని మీద కథనాలు రాయటంతో పరిస్థితి వేడెక్కింది. 
దీంతో రైతులంతా ఫిర్యాదుచేయాలంటే హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు తెరిచారు. అక్కడ కూడా వచ్చిన ఫిర్యాదులో లోపాలు వెదికేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న మాట వినిపిస్తోంది. రుణమాఫీ అందలేదంటూ చెప్పిన రైతుల సమస్యలు తెలుసుకొని రుణ మాఫీ చేసేలా ప్రయత్నించే యంత్రాంగం ఏదీ లేనే లేదు. దీంతో ఈ ఫిర్యాదు కేంద్రాలన్నీ తూతూ మంత్రం అన్న మాట అర్థం అయిపోయింది. దీంతో రైతుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొంటున్నాయి. 
 
అధికార పక్షానికి సెగ
బాబు వస్తాడు, రుణమాఫీ జరుగుతుంది అని నమ్మించిన తెలుగుదేశం శ్రేణుల్ని ఎక్కడకికక్కడ రైతులు నిలదీయటం మొదలెట్టారు. రుణమాఫీ చేయలేకపోతే చేయలేం అని చెప్పాలి కానీ ఇలా ముంచేయటం మంచిది కాదని మండిపడ్డారు. దీంతో పార్టీ శ్రేణులకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. పైగా రుణమాఫీఅంతా ఆన్ లై న్ లో కాబట్టి ఎవరెవరకు రుణమాఫీ అవుతోందో, ఎవరకి కావటం లేదో ఏమాత్రం చెప్పలేని పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్న పార్టీ సమావేశంలో విశాఖపట్నంలో పార్టీ నేతలు స్వయంగా సీఎంకే మొర పెట్టుకొన్నారు. ఊళ్లలోకి వెళ్లలేక పోతున్నామని, కనిపిస్తే చాలు రుణమాఫీ మీద ప్రశ్నిస్తున్నారని వాపోయారు.
  
కొత్త కుట్రకు తెర
రైతులు రగిలిపోతున్నారన్న సంగతి గ్రహించిన ప్రభుత్వం కొత్త కుట్రకు తెర దీసింది. ఈ రుణ మాఫీ నేరాన్ని అధికార యంత్రాంగం మీదకు నెట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. బ్యాంకర్లు సరైన అంశాలు నమోదు చేయలేదని, వ్యవసాయ రెవిన్యూ యంత్రాంగం సరైన వివరాలు సమర్పించలేదని జవాబులు వినిపించ సాగారు. అటూ ఇటూ చేసి రుణ మాఫీ అందకపోతే ఆ తప్పంతా అధికారులది అని, ఒక వేళ అర కొరగా రుణమాఫీ అయితే మాత్రం ఆ ఖ్యాతి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వానిది అని చెప్పే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా విముక్తి యాత్ర లకు శ్రీకారం చుట్టారు. అంటే రుణమాఫీ మీద ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఇందులో చేసుకోవ చ్చని చెప్పారు. హైదరాబాద్ లో రుణమాఫీ ఫిర్యాదుల అంశం అయిపోయింది, జిల్లాకేంద్రాల్లో రుణ మాఫీ అంశం అయిపోయింది. ఇప్పుడు ఊరూరా విముక్తి యాత్రల దగ్గరకు వచ్చారు. ఫిర్యాదులు ఎక్కడ ఇచ్చినా, అందులోని లోపాల్ని చెప్పి అధికార యంత్రాంగాన్ని బాధ్యుల్ని చేసేందుకే  ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఈ రుణ విముక్తి యాత్రల్ని సంకల్పించారన్న మాట బలంగా వినిపిస్తోంది. 

ఇందులో భాగంగా ప్రతీ చోట ప్రభుత్వం చేస్తున్న పనుల్ని చాటుకొనే ప్రయత్నం జరుగుతోంది. అయితే రుణమాఫీ కి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే మాత్రం దాన్ని స్థానిక యంత్రాంగం మీదకు నెట్టేసి చేతులు దులిపేసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఈ రుణ విముక్తి యాత్రను ఇప్పటికిప్పుడు రూపొందించినట్లు తెలుస్తోంది. పైగా రుణమాఫీ మీద ఫిర్యాదులు తీసుకొని క్రమంగా వీటిని చెట్టు ఎక్కించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద రుణ మాఫీ మీద రూపొందిస్తున్న కొత్త నాటకం ఎటు తిరిగి ఎటువస్తుందో వేచి చూడాలి. 

No comments:

Post a Comment